Begin typing your search above and press return to search.

రేవంత్ సర్కార్‌కు గ్రేటర్ భయం పట్టుకుందా.. ?

జీహెచ్ఎంసీ విభజన, డివిజన్ల ప్రక్రియపై కోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయనే వాదనను అధికార పక్షం తెరపైకి తెస్తోంది.

By:  Garuda Media   |   28 Sept 2026 7:00 PM IST
రేవంత్ సర్కార్‌కు గ్రేటర్ భయం పట్టుకుందా.. ?
X

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. అదే... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? పాలనా సౌలభ్యం పేరుతో హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించి, వందల సంఖ్యలో డివిజన్లను పునర్విభజించిన రేవంత్ రెడ్డి సర్కార్... అసలు పోరు విషయానికి వచ్చేసరికి ఎందుకు వెనుకడుగు వేస్తోంది? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా, రాజధాని పీఠంపై పట్టు నిరూపించుకునే సరైన అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికలకు వెళ్లేందుకు ఎందుకు సాకు వెతుకుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.

జీహెచ్ఎంసీ విభజన, డివిజన్ల ప్రక్రియపై కోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయనే వాదనను అధికార పక్షం తెరపైకి తెస్తోంది. అయితే, ఇది కేవలం కాలయాపన కోసమే వాడుతున్న డొల్ల వాదన అనే విమర్శలు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, కోర్టుల్లో పకడ్బందీగా కౌంటర్లు దాఖలు చేసి, న్యాయపరమైన చిక్కులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, యంత్రాంగం చేతిలో అన్ని అధికారాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రక్రియను పక్కన పెడుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఉపఎన్నిక వేళ అద్భుతమైన అవకాశం వదులుకుంటున్నారా?

మరోవైపు దానం నాగేందర్‌పై వేటుతో ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక అనివార్యమైన తరుణంలో, గ్రేటర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్చింది. ఇలాంటి హై-వోల్టేజ్ ఉపఎన్నిక ముంచుకొస్తున్న సమయంలోనే కార్పొరేషన్ ఎన్నికలకు వెళితే, అది అధికార పార్టీకి తిరుగులేని అడ్వాంటేజ్ ఇస్తుందనడంలో సందేహం లేదు. పట్టణ ఓటర్లను ఏకతాటిపైకి తెచ్చి, ప్రచార జోరు పెంచితే... ప్రతిపక్ష బీఆర్ఎస్, దూకుడు మీదున్న బీజేపీలను ఏకకాలంలో ఆత్మరక్షణలోకి నెట్టేయవచ్చు. కానీ, ఈ సువర్ణావకాశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనన్న భయమో, లేక అర్బన్ వోటర్ల నాడి తమకు వ్యతిరేకంగా మారుతుందన్న అనుమానమో తెలియదు కానీ, ఈ వాయిదా ధోరణి కాంగ్రెస్‌కు దీర్ఘకాలంలో నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న సానుకూల వాతావరణాన్ని క్యాష్ చేసుకోకుండా కాలయాపన చేస్తే, భవిష్యత్తులో వ్యతిరేక పవనాలు వీచినప్పుడు ఈ ఎన్నికలే ప్రభుత్వానికి పెద్ద కొండలా మారుతాయి. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి, గ్రేటర్ సమరానికి సై అనడమే రేవంత్ సర్కార్‌కు ఇప్పుడున్న ఏకైక, అత్యుత్తమ రాజకీయ మార్గం.