ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం.. ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ నిర్ణయం.. అసలు ఏం జరిగింది..?
ఫోన్ ఒకప్పుడు మాట్లాడటానికి మాత్రమే ఉపయోగించే సాధనం. ఇప్పుడు అది చదువు, వినోదం, గేమ్స్, సోషల్ మీడియా అన్నింటికీ కేంద్ర బిందువుగా మారింది.
By: Tupaki Political Desk | 4 Feb 2026 2:43 PM ISTఫోన్ ఒకప్పుడు మాట్లాడటానికి మాత్రమే ఉపయోగించే సాధనం. ఇప్పుడు అది చదువు, వినోదం, గేమ్స్, సోషల్ మీడియా అన్నింటికీ కేంద్ర బిందువుగా మారింది. అయితే అదే ఫోన్ కొందరి జీవితాల్లో విషాదానికి కారణం అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన సమాజాన్ని కుదిపేసింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించారన్న కారణంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకోవడం రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని సైతం కలవరానికి గురి చేసింది.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెళ్లెల్లు..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.., గాజియాబాద్‌లోని ఒక రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 12, 14, 16 ఏళ్ల ముగ్గురు తోబుట్టువులు కరోనా కాలంలో ఫోన్ వినియోగానికి అలవాటుపడ్డారు. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో మొదలైన మొబైల్ వినియోగం, క్రమంగా ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనంగా మారింది. రోజురోజుకూ చదువుపై ఆసక్తి తగ్గిపోవడంతో పాటు.., స్కూల్‌కు వెళ్లడం కూడా మానేశారు. ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేని స్థితికి చేరుకున్నారు. పిల్లల ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని, గేమ్స్ ఆడొద్దని పలుమార్లు సూచించారు. మంగళవారం రాత్రి ఇదే విషయమై ఇంట్లో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల మందలింపును తట్టుకోలేక ఆ ముగ్గురు బాలికలు అత్యంత విషాదకరమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉన్న సమయంలో, టౌన్‌షిప్‌లోని 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అపార్ట్ మెంట్ వాసులు..
తెల్లవారు జామున 2 గంటల సమయంలో భారీ శబ్దం వినిపించడంతో అపార్ట్‌మెంట్ వాసులు బయటకు వచ్చి చూడగా ఈ ఘటన బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. వారు సైసైడ్ చేసుకుంటూ ఒక నోట్ కూడా రాసినట్లు తెలుస్తుంది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
పిల్లలతో ఎక్కువగా గడపాలి..
ఈ ఘటన కేవలం ఒక కుటుంబానికి మాత్రమే కాదు.. సమాజానికి కూడా హెచ్చరికగా మారింది. ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం చిన్నపిల్లల్లో ఎంతటి మానసిక ప్రభావం చూపుతుందో ఈ ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది. గేమ్స్‌లో గెలుపు ఓటములు, వర్చువల్ ప్రపంచంలో ఏర్పడే ఒత్తిడి, తల్లిదండ్రుల నియంత్రణ ఇవన్నీ కలిసి పిల్లల్లో తీవ్ర భావోద్వేగ ప్రతిస్పందనలకు దారి తీస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.., ఆన్‌లైన్ గేమింగ్‌కు పూర్తిగా నిషేధం విధించడం కంటే, సమతుల్యత నేర్పించడం అవసరం. తల్లిదండ్రులు పిల్లలతో సంభాషణ పెంచాలి. వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. కఠినంగా మందలించడం కంటే, మార్గనిర్దేశం చేయడం ముఖ్యం. అదే సమయంలో పాఠశాలలు, ప్రభుత్వం కూడా డిజిటల్ వ్యసనంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
ముగ్గురు అమాయక బాలికల ప్రాణాలు ఇలా వృథా కావడం బాధాకరం. ఒక చిన్న విషయంగా కనిపించిన ఆన్‌లైన్ గేమ్ వ్యసనం, చివరికి ప్రాణాంతక పరిణామానికి దారితీసింది. ఈ ఘటన ప్రతి తల్లిదండ్రికి ఒక మేల్కొలుపు. టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తోంది.. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పకపోతే, అదే టెక్నాలజీ ప్రమాదంగా మారుతుందనే విషాద సత్యాన్ని గాజియాబాద్ ఘటన మరోసారి గుర్తు చేసింది.
