Begin typing your search above and press return to search.

ప్రేయ‌సితో పెళ్లి కోసం.. అన్నం పెట్టిన సంస్థ‌కు 4 కోట్ల‌కు క‌న్నం!

కానీ, ఈ వ్య‌వ‌హారం పోలీసుల జోక్యంతో నిలిచిపోయింది. చివ‌ర‌కు ప్రేయ‌సీ ప్రియులు.. వీరికి స‌హ‌క‌రించిన వారు అంద‌రూ జైలు బాట‌పట్టారు.

By:  Garuda Media   |   18 Jun 2026 12:47 PM IST
ప్రేయ‌సితో పెళ్లి కోసం.. అన్నం పెట్టిన సంస్థ‌కు 4 కోట్ల‌కు క‌న్నం!
X

ప్రేమ పెళ్లిళ్లు స‌ర్వ‌సాధార‌ణం. ఉన్నంత‌లో పెళ్లిళ్లు చేసుకున్న ప్రేయ‌సీ ప్రియుల గురించి కూడా మ‌న‌కుతెలిసిందే. కానీ, ప్రేయసి కోరింద‌ని.. ఆమెను మెప్పించాల‌ని భావించిన ఓ యువ‌కుడు త‌న‌కు ఉద్యోగం ఇచ్చిన సంస్థ‌కే క‌న్నం వేశాడు. ఏకంగా 4 కోట్ల రూపాయ‌ల‌కు పైచిలుకు విలువ చేసే బంగారు, వజ్రాభ‌ర‌ణాల‌ను దొంగిలించి.. వివాహ వేదిక‌పై అట్ట‌హాసంగా త‌న ప్రేయ‌సిని పెళ్లి చేసుకోవాల‌ని భావించాడు. కానీ, ఈ వ్య‌వ‌హారం పోలీసుల జోక్యంతో నిలిచిపోయింది. చివ‌ర‌కు ప్రేయ‌సీ ప్రియులు.. వీరికి స‌హ‌క‌రించిన వారు అంద‌రూ జైలు బాట‌పట్టారు.

ఎక్క‌డ ఏం జ‌రిగింది?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన నితిన్ అనే యువ‌కుడు.. కాజ‌ల్ అనే యువ‌తి ప్రేమించుకున్నారు. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇంత వ‌ర‌కు బాగానేఉంది. అయితే.. త‌న‌కు క‌నీసంలో క‌నీసం.. నెక్లెస్ అయినా కావాల‌ని కాజ‌ల్ త‌న ప్రియుడి ముందు ష‌ర‌తు పెట్టింది. దీంతో ప్రేయ‌సి కోరిన దానికంటే.. భారీగానే బంగారం ఇస్తాన‌ని హామీ ఇచ్చిన నితిన్‌.. దీనిని స్వ‌యంగా సంపాయించే స్థాయి, స్థోమ‌త లేక‌పోవ‌డంతో చోరీ మార్గం ప‌ట్టాడు. త‌న‌కు తెలిసిన వారి ద్వారా.. ఘ‌జియాబాద్‌లోనే అతి పెద్ద న‌గ‌ల దుకాణంలో ఉద్యోగం సంపాయించాడు.

తాను డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్నాన‌ని, కానీ ఉద్యోగం లేద‌ని.. దీంతో త‌న‌పై ఆధార‌ప‌డిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని యాజ‌మాన్యాన్ని న‌మ్మ‌బ‌లికాడు. దీంతో న‌గ‌ల దుకాణం య‌జ‌మాని.. పాపం అని అనుకుని నితిన్‌కు ఉద్యోగం ఇచ్చారు. ఆ త‌ర్వాత వారానికి కాజ‌ల్ కూడా ఇదే పంథాలో స‌ద‌రు న‌గ‌ల దుకాణంలో ఉద్యోగంలో చేరింది. ఇరువ‌రూ.. క‌లిసి సింగిల్ షిఫ్ట్‌లో ప‌నిచేసేవారు. అంతేకాదు.. భోజ‌నాల స‌మ‌యంలో అంద‌రూ భోజ‌నాలు చేస్తుంటే.. వీరిద్ద‌రూ న‌గ‌ల దుకాణంలోని నాలుగు అంత‌స్థుల్లో తిరిగి.. న‌గ‌ల‌ను `ఎంచుకున్నారు.`

ప‌క్కా ప్ర‌ణాళిక‌తో..

కాజ‌ల్‌.. త‌న‌కు ఏయే న‌గ‌లు కావాలో ముందుగానే ఎంచుకుంది. అనంత‌రం.. వీటిని ఓ కాయితంపై రాసుకుంది. ఆ త‌ర్వాత‌.. ప్రీవెడ్డింగ్ పార్టీ పేరుతో న‌గ‌ల దుకాణంలో ప‌నిచేసేవారిని పిలిచి నితిన్ భారీ విందు ఇచ్చాడు. ఈ స‌మ‌యంలో న‌గ‌ల‌దుకాణంలో కీల‌క ర్యాకుల త్యాళాలు ఉండే వ్య‌క్తిని మ‌చ్చిక చేసుకుని.. అత‌నికి బాగా మందు తాగించి.. అత‌ని నుంచి తాళాలు తీసుకున్నా రు. ఆ త‌ర్వాత తెల్లారే.. న‌గ‌ల దుకాణంలో చోరీకి పాల్ప‌డి.. ఎంచుకున్న న‌గ‌ల‌ను చాక‌చ‌క్యంగా 10 నిమిషాల్లోనే బుట్ట‌లో వేసుకుని ఉడాయించారు. అయితే.. న‌గ‌ల దుకాణంలో ఉన్న కొన్ని లోటుపాట్లు కూడా వీరికి క‌లిసి వ‌చ్చాయ‌ని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ఇద్ద‌రినీ అరెస్టు చేశారు. వీరికి స‌హ‌క‌రించిన నితిన్ తండ్రిని కూడా జైలుకు పంపారు.