Begin typing your search above and press return to search.

ఇనుపరాడ్లతో కొట్టేసుకున్నారు.. రీల్ కాదు హైదరాబాద్ లో ‘రియల్’ సీన్

రీల్ సన్నివేశాన్ని తలపించే రియల్ సన్నివేశాలు హైదరాబాద్ మహానగర శివారులో తాజాగా చోటు చేసుకుంది.

By:  Garuda Media   |   11 Jan 2026 10:10 AM IST
ఇనుపరాడ్లతో కొట్టేసుకున్నారు.. రీల్ కాదు హైదరాబాద్ లో ‘రియల్’ సీన్
X

రీల్ సన్నివేశాన్ని తలపించే రియల్ సన్నివేశాలు హైదరాబాద్ మహానగర శివారులో తాజాగా చోటు చేసుకుంది. పోలీసుల ముందే ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. రోజురోజుకు పెరిగిపోతున్న భూవివాదాలు.. హద్దులు దాటేయటమే కాదు.. శాంతిభద్రతలకు సైతం సవాలు విసిరే స్థాయికి చేరుకున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఇదంతా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ రెవెన్యూ పరిధిలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన కొట్లాటలో నలుగురు యువకులు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతంలో పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..

ఘట్ కేసర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏకశిలా వెంచర్ లో భూములకు సంబంధించిన వివాదం కొన్నేళ్లుగా సాగుతోంది. ఏకశిలా ప్లాట్ల యజమానులు ఒక పక్షాన.. ఏకశిల భూములను కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ మధ్య పంచాయితీ నడుస్తోంది. ప్లాట్ల యజమానులను అక్కడకు వెళ్లనియ్యకుండా ఏకశిలా వెంచర్ చుట్టూ వెంకటేశ్ అనుచరుల కాపాలా కాస్తున్న పరిస్థితి. ప్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేసి.. దౌర్జన్యానికి దిగుతున్న ఆరోపణలతో వెంకటేశ్ పై పోచారం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదులు.. కేసులు నమోదయ్యాయి.

ఇక్కడ పరిస్థితి సున్నితంగా ఉండటంతో.. గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. శనివారం ఏకశిలా వెంచర్ లో సర్వే కోసం అధికారులు వచ్చారు. వారిని ప్లాట్ల యజమానులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. కొందరు ప్లాట్ల యజమానులు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ అనుచరులు వారిని అడ్డుకున్నారు.

దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆపై తోపులాట వరకు విషయం వెళ్లింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోచారం పోలీసులు వచ్చే లోపే.. ప్లాట్ల యజమానులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ అనుచరుల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు ఇనుపరాడ్లతో కొట్టేసుకున్న పరిస్థితి. ఈ దాడుల్లో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఇరు వర్గాలు పోచారం.. మేడిపల్లి పోలీస్ స్టేషన్లలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. రాజధాని.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూవివాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటి పరిష్కారం ఏళ్లకు ఏళ్లు సాగుతున్నా.. ఒక కొలిక్కి రాని పరిస్థితి. ఇలాంటి వేళ.. శాంతిభద్రతలకు సవాలు విసిరేలా చోటు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా సీఎం రేవంత్ కాస్తంత ఫోకస్ చేయాలన్న విన్నపాలు పెరుగుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.