ఒకే పాటను ఇద్దరు గాయకులు పాడిన చిత్ర విచిత్రం !
ఆచార్య ఆత్రేయ రాసిన ఈ గీతానికి సత్యం మ్యూజిక్ చేశారు. ఈ చిత్రంలో మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు.
By: Satya P | 26 July 2026 9:06 AM ISTచిత్ర సీమ అంటే పేరులోనే ఉంది చిత్రం. అక్కడ ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. ఒక సినిమా తీయడానికి ప్లాన్ చేసుకున్న దగ్గర నుంచి విడుదల చేసే మధ్యలో ఎన్నో మార్పులు చేర్పులూ అలా జరుగుతూనే ఉంటాయి. కాగితం మీద అనుకున్న పేరు షూటింగ్ వేళకు మారిపోవచ్చు. అలా హీరో హీరోయిన్ల నుంచి టీక్నీషియన్ల వరకూ ఎంతో మందిని మార్చేసిన చిత్ర విచిత్రం సినీ సీమలో ఎన్నో జరిగాయి. ఇక తెలుగు చిత్ర సీమలో చూసుకుంటే ఇలాంటి చిత్రాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అందులో చెప్పుకోవాల్సింది ఒక గాయకుడు పాడిన పాటను వేరే గాయకుడు ఆలపించడం. అలా ఒకే సినిమా కోసం ఇద్దరు గాయకులు పాడితే బయటకు వచ్చిన రికార్డు మీద ఒకరి పేరు ఉంటే సినిమాలో మరో గాయకుడి పేరు ఉంటుంది.
పీబీ శ్రీనివాస్ పాట ఘంటసాలతో :
ఈ విధంగా తెలుగు సినిమా నేపధ్య సంగీతంలో ఎన్నో జరిగాయి. నాటి ఘంటసాల నుంచి తరువాత తరంలో ఎస్పీ బాలు దాకా ఈ విధంగా గాయకులు ఒకరు పాడిన పాటను మళ్ళీ వేరొకరు పాడిన చరిత్ర ఉంది. ముందుగా బాగా పాత రోజులకు వెళ్తే అప్పట్లో అంటే 1969లో మూగనోము అన్న సినిమా వచ్చింది. అక్కినేని జమునా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ఒక సిట్యువేషన్ సాంగ్ ఉంది. ఊరు మారినా ఉనికి మారునా అంటే సాగే ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ని మొదట పాడింది అప్పటి ప్రముఖ గాయకుడు పీబీ శ్రీనివాస్. అయితే షూటింగ్ కి వచ్చేసరికి మాత్రం ఈ సాంగ్ విషయంలో మరో నిర్ణయం తీసుకున్నారు. పీబీ శ్రీనివాస్ పాడిన పాటనే మళ్ళీ ఘంటసాలతో పాడించి సినిమాలో ఉంచారు. దాంతో రికార్డు మీద పీబీ శ్రీనివాస్ పడింది ఉంటుంది. సినిమాలో మాత్రం ఘంటసాల పాట వస్తుంది. ఈ పాటకు ఆర్ గోవర్ధన్ సంగీతం అందించారు.
రామకృష్ణ పాట బాలూతో :
అదే విధంగా మరో చిత్రం తరువాత రోజులలో జరిగింది. 1976లో దేవుడు చేసిన బొమ్మలు అని ఒక సినిమా వచ్చింది. అందులో ఈ జీవితమూ అంతే లేని సాగరం అంటూ సాగే పాటను మొదట గాయకుడు వి రామక్రిష్ణతో పాడించారు. తీరా సినిమా షూటింగ్ నాటికి ఇదే పాటను ఎస్పీ బాలు చేత మళ్ళీ పాడించి రికార్డు చేశారు. అలా ఈ ఇద్దరి పాడిన పాటలు అందుబాటులో ఉండడం విశేషం. ఆచార్య ఆత్రేయ రాసిన ఈ గీతానికి సత్యం మ్యూజిక్ చేశారు. ఈ చిత్రంలో మురళీమోహన్, జయసుధ, మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు.
ఆనంద్ పాట బాలూ నోట :
ఇదే విధంగా 1977లో మరో తమాషా జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చక్రధారి సినిమాలో విఠలా విఠలా అంటూ సాగే భక్తి గీతాన్ని మొదట గాయకుడు జీ ఆనంద్ తో పాడించారు. ఆ పాటే రికార్డులలో ఉంటుంది. అయితే సినిమాలో మాత్రం ఆ పాటను ఎస్పీ బాలూతో తిరిగి పాడించారు. ఈ సినిమాకు జీకే వెంకటేష్ మ్యూజిక్ చేశారు ఇదే విధంగా 1977లో వచ్చిన అక్కినేని మరో చిత్రం రాజా రమేష్ లో కూడా రామకృష్ణ ఎస్ జానకి పాడిన నెల్లూరు నెరజాణ అన్న యుగళ గీతం రికార్డులలో కనిపిస్తుంది. తీరా సినిమాలో మాత్రం అదే పాటను ఎస్ జానకితో కలసి ఎస్పీ బాలు పాడినది మళ్ళీ రికార్డు చేసి ఉంచారు. ఇలా ఎన్నో పాటలకు జరిగాయి. ఒకే పాట గాయకులు మాత్రం ఇద్దరు పాడడం అన్నది ఎందుకు జరుగుతుంది అంటే హీరోల గొంతులకు ఆ గాయకుడి వాయిస్ సూట్ అవదని తరువాత ఆలోచించడం వల్ల కావచ్చు. అలాగే ముందు ట్రాక్స్ తీసి షూటింగ్ పూర్తి చేసుకుని ఆనక పాపులర్ గాయకుడితో పాడించి సినిమాలో మిక్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే దీన్ని వల్ల మంచి పాటలు మాకి దగ్గరగా వచ్చి పోయాయని రామకృష్ణ ఆనంద్ వంటి గాయకులు బాధపడిన సందర్భాలు ఉన్నాయి.
