రోడ్డుపై రీల్స్.. బెంగళూరులో స్టార్ ఇన్‌ఫ్లూయెన్సర్స్ అరెస్ట్
వీడియో తీస్తుండగా అనేక మంది అభిమానులు, ఉత్సాహవంతులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
By: A.N.Kumar | 1 Aug 2025 6:29 PM ISTబెంగళూరు నగరంలో సోషల్ మీడియా ప్రభావం మరోసారి చర్చనీయాంశమైంది. జర్మనికి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ నోయెల్ రాబిస్సన్ - యూనెస్ జరూను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు నగర వీధుల్లో వీడియో రీల్స్ చిత్రీకరిస్తుండగా అనూహ్యంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.
వీడియో తీస్తుండగా అనేక మంది అభిమానులు, ఉత్సాహవంతులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో రద్దీ పెరిగి, గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందన్న అభిప్రాయంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 15 నిమిషాలపాటు వారిని పోలీస్ వాహనంలో ఉంచిన తర్వాత వారికి హెచ్చరికలు జారీ చేసి విడుదల చేశారు.
ఈ ఘటనపై స్పందించిన నోయెల్, యూనెస్‌లు "మేమెవరినీ ఇబ్బంది పెట్టాలనలేదు. మేము ఆనందంగా రీల్స్ తీస్తున్న సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం. పోలీసులు కూడా తమ విధిని నిర్వహించారు. కానీ మాతో ప్రవర్తించిన తీరులో అనవసర కఠినతనం కనిపించింది" అని పేర్కొన్నారు.
అయితే ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ వాణిజ్య సముదాయం వద్ద తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి జనసమూహాలపై తక్షణ చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. ఇదే నేపథ్యంతో ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా పోలీసులు తక్షణ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ఘటనపై నెటిజన్లు, పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు మిశ్రమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. "ఇన్ఫ్లూయెన్సర్లపై ఇలా వ్యవహరించడం సబబు కాదు" అని కొంతమంది అభిప్రాయపడితే, "ప్రజల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయమే" అని మరికొందరు సమర్థిస్తున్నారు.
మొత్తానికి రోడ్లపై రీల్స్ తీసే ట్రెండ్ రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో భద్రతా పరంగా అధికార యంత్రాంగం తీసుకునే చర్యలు, సోషల్ మీడియా వినియోగదారుల బాధ్యతాయుత ప్రవర్తన మధ్య సమతుల్యత అవసరమన్నది ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
