సామన్య ప్రజల కళలకు దివ్యమైన దేవాలయం!
హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ..`స్టార్ వార్స్` రూపశిల్పి జార్జ్ లూకాస్ సృష్టించిన ప్రతిష్టాత్మక `లూకాస్ మ్యూజియం ఆఫ్ నరేటివ్ ఆర్ట్` ఎట్టకేలకు లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభానికి సిద్ధమైంది.
By: Srikanth Kontham | 3 Sept 2026 3:00 PM ISTహాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ..`స్టార్ వార్స్` రూపశిల్పి జార్జ్ లూకాస్ సృష్టించిన ప్రతిష్టాత్మక `లూకాస్ మ్యూజియం ఆఫ్ నరేటివ్ ఆర్ట్` ఎట్టకేలకు లాస్ ఏంజెల్స్‌లో ప్రారంభానికి సిద్ధమైంది. ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ సిరీస్ `స్టార్ వార్స్` అభిమానులను ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నా? ఈ మ్యూజియం కేవలం ఆ ఒక్క ఫ్రాంచైజీకి మాత్రమే పరిమితం కాదని లూకాస్ స్పష్టం చేశారు. సామాన్య ప్రజల కళలకు ఓ దివ్యమైన దేవాలయంగా, అరుదైన నరేటివ్ ఆర్ట్‌ను ఒకే చోట ఆవిష్కరించే అద్భుత వేదికగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.
మ్యూజియం ఏర్పాటు వెనుక 17 ఏళ్ల సుదీర్ఘ శ్రమ .. ప్రయాణం ఉంది. గతంలో శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో వంటి నగరాల్లో వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అయితే 82 ఏళ్ల జార్జ్ లూకాస్ తన భార్య మెలోడీ హాబ్సన్‌తో కలిసి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఎట్టకేలకు లాస్ ఏంజెల్స్‌లోని ఎక్స్‌పోజిషన్ పార్క్‌లో దీనిని ఆవిష్కరించారు. అసాధ్యమైన విషయాలను సాధ్యం చేయడమే తనకు అలవాటని కానీ ఈ ప్రాజెక్ట్ తనను తీవ్రంగా శోధించిందని లూకాస్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఆర్కిటెక్ట్ మా యాన్సాంగ్ రూపొందించిన భవన నిర్మాణం ఒక అంతరిక్ష నౌకను తలపించే వినూత్న శైలిలో ఉంటుంది. మ్యూజియం ప్రధాన ల్యాబీలోనే `ది ఫాంటమ్ మెనాస్` సినిమాలోని పసుపు రంగు నబూ ఎన్-1 స్టార్‌ఫైటర్ సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. అయినా? లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న గ్యాలరీలలో `స్టార్ వార్స్` వాటా కేవలం 7 శాతం మాత్రమే కావడం గమనార్హం. మిగిలిన భాగమంతా లూకాస్ .. ఆయన భార్య దశాబ్దాలుగా సేకరించిన అరుదైన చిత్రలేఖనాలు, కామిక్స్ ,పాపులర్ ఆర్ట్సే ఆక్రమించాయి.
ఈ ప్రదర్శనశాలలో 20వ శతాబ్దపు ప్రముఖ చిత్రకారుడు నార్మన్ రాక్‌వెల్ చిత్రాలకు ప్రత్యేక స్థానం కల్పించారు. ముఖ్యంగా 1960లో నల్లజాతి చిన్నారి రూబీ బ్రిడ్జెస్ తెల్లవారి పాఠశాలలోకి అడుగుపెడుతున్న చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిన `ది ప్రాబ్లమ్ వి ఆల్ లివ్ విత్` పెయింటింగ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటితో పాటు మ్యాక్స్‌ఫీల్డ్ పారిష్ వంటి ప్రముఖ కళాకారుల వర్ణచిత్రాలు, ఫ్రీడా కాలో, డీగో రివేరా, అండీ వార్హోల్ వంటి దిగ్గజాల సృష్టి కథన చిత్రాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేసేలా ఏర్పాటు చేశారు.
అలాగే పాతకాలపు వార్తాపత్రిక కామిక్స్, `ఫ్లాష్ గోర్డాన్`, `బక్ రోజర్స్` వంటి తొలి తరం కామిక్ స్ట్రిప్స్‌తో పాటు జపాన్ ఎనిమే, మాంగా ఆర్ట్ , చిన్నారుల విభాగాలు కూడా మ్యూజియంలో కొలువుదీరాయి. ఆర్ట్ గ్యాలరీలను కేవలం వర్గాలు లేదా కాలక్రమం ఆధారంగా కాకుండా క్రీడలు, సామాజిక పోరాటాలు, పౌరాణిక కథలు వంటి నిత్య జీవిత కోణాల ప్రాతిపదికన వర్గీకరించడం విశేషం. కథ చెప్పే ప్రతి కళాఖండానికి ఇక్కడ తగిన గౌరవం దక్కుతుందని క్యురేటర్లు తెలిపారు.
సెప్టెంబర్ 22న సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానున్న మ్యూజియం పాప్ కల్చర్ .. కమర్షియల్ ఆర్ట్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొస్తుందని భావిస్తున్నారు. సినిమా రంగానికి మాత్రమే కాకుండా దృశ్యరూప కథనాలకు (నరేటివ్ ఆర్ట్) లూకాస్ అందించిన కానుక భవిష్యత్తు తరాలకు గొప్ప స్ఫూర్తి కేంద్రంగా నిలవనుంది.
