ఏకైక క్రిస్టియన్ మంత్రి కురియన్ పై తొలి వేటు.. కేంద్రంలో కీలక మార్పులు!
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు.
By: Tupaki Political Desk | 23 Jun 2026 3:00 PM ISTకేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం జూన్ 21న ముగియడంతో మంత్రివర్గం నుంచి ఆయన తప్పుకోవాల్సివచ్చిందని అంటున్నారు. కేరళకు చెందిన కురియన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేవారు. ఈ నెలలో జరిగిన ఎన్నికల్లో ఆయనకు కొనసాగింపు ఇవ్వకపోవడంతో మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సివచ్చిందని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గం పునర్వ్యస్థీకరించనున్నారనే చర్చలు జరుగుతున్న సమయంలో ఒక మంత్రి తప్పుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు. ఇక కేంద్ర మంత్రివర్గంలో ఏకైక క్రిస్టియన్ మంత్రిగా కురియన్ ఉండేవారు. ఆయన రాజీనామాతో ఆ వర్గానికి ప్రాతినిధ్యం లేకపోయిందని అంటున్నారు. కురియన్ స్థానంలో కొత్తగా ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కేరళకు చెందిన జార్జి కురియన్ 1980వ దశకం నుండి బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా సేవలందించారు. తొలి నుంచి పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో 2024లో ఆయన కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఆ ఏడాది జూన్ 9న ప్రభుత్వం కొలువుదీరే సమయానికి కురియన్ కు పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యత్వం లేదు. దీంతో ఆ ఏడాది ఆగస్టులో జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి అవకాశం కల్పించారు. ఫలితంగా రెండేళ్ల పాటు కురియన్ మంత్రిగా కొనసాగారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్రిస్టియన్ వర్గాన్ని ఆకర్షించడంతోపాటు ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కురియన్ ఉపయోగపడతారని కేంద్ర పెద్దలు భావించారు. అయితే, కేరళ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి ప్రభావం చూపకపోవడం, క్రిస్టియన్లలోనూ కురియన్ పట్టు సాధించకపోవడంతో ఆయన పనితీరుపై అగ్రనేతలు అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. దీనిఫలితమే రాజ్యసభకు రెండోసారి అవకాశం కల్పించలేదని అంటున్నారు. దీంతో కురియన్ రాజీనామాపై వారం రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయని చెబుతున్నారు.
ఇక జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత ప్రక్షాళనలో భాగంగానే అధిష్టానం కొందరు మంత్రులతో రాజీనామా చేయించాలని ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా తొలివేటు కురియన్ పై పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 18న జరిగిన రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో జార్జి కురియన్ పేరు లేకపోవడం, ఆయన నిష్క్రమణకు సంకేతంగా మారింది. ఇది పార్టీ దీర్ఘకాలిక వ్యూహాత్మక మార్పులని, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరో జార్జి కురియన్ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
కురియన్ మంత్రివర్గంలో ఉన్న ఏకైక క్రిస్టియన్ మంత్రి కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన నిష్క్రమణతో కేంద్ర మంత్రివర్గంలో ఈ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ పరిణామంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు దీనిని కేవలం పరిపాలనాపరమైన ప్రక్రియగా అధికార వర్గాలు చూస్తుంటే, మరోవైపు క్రిస్టియన్ మైనారిటీ వర్గాలు తమ ప్రాతినిధ్యం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మైనారిటీల భద్రత, సామాజిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇకపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక సంకేతాలు అందలేదు. రాబోయే రోజుల్లో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఇతర మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
