ప్రేమ కంటే భయం ఎక్కువ.. కొత్తతరం రిలేషన్ ట్రెండ్ లు!
జెన్ జెడ్ కాలం ఇదీ. మ్యాగీ నూడుల్స్ లా ఏదైనా త్వరగా అయిపోవాలి. లేదంటే రచ్చ రంబోలానే. ఈ కాలానికి అన్నింట్లోనూ స్పీడున్నా.. ప్రేమ విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ భయం వెంటాడుతోంది.
By: A.N.Kumar | 14 Dec 2025 1:00 AM ISTజెన్ జెడ్ కాలం ఇదీ. మ్యాగీ నూడుల్స్ లా ఏదైనా త్వరగా అయిపోవాలి. లేదంటే రచ్చ రంబోలానే. ఈ కాలానికి అన్నింట్లోనూ స్పీడున్నా.. ప్రేమ విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ భయం వెంటాడుతోంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అధ్యయనాలు, కౌన్సిలింగ్ కేంద్రాల ట్రెండ్ లు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత తరం యువతలో రిలేషన్ షిప్ లపై ఆసక్తి ఉన్నప్పటికీ వాటిలోకి ప్రవేశించడానికి లేదా కొనసాగించడానికి భయం ఎక్కువగా అడ్డుపడుతోంది. ఈ భయం కొన్ని సార్లు వారిని ప్రేమ సంబధాలకు దూరం చేస్తోంది. బంధాలను అవసరం నుంచి జాగ్రత్తల ఎంపిక గా మారుస్తోంది.
ఎందుకిలా భయం పెరుగుతోంది?
యువతలో ఈ ధోరణి పెరగడానికి అనేక సామాజిక , వ్యక్తిగత అంశాలు దోహదపడుతున్నాయి. గతంలో జరిగిన బ్రేకప్ లు, మోసాలు, టాక్సిక్ సంబంధాల నుంచి ఎదురైన అనుభవాలు యువత ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మళ్లీ అంతటి బాధను భరించాల్సి వస్తుందేమోనన్న భయమే వారిని కొత్త బంధాలకు దూరంగా సింగిల్ గా ఉంచడానికి కారణమవుతోంది.
సోషల్ మీడియాలో ఒత్తిడి
ఇన్ స్టా, యూట్యూబ్ వ్లాగ్ లలో కనిపించే ‘ప్రొటెక్ట్ కపుల్ లైఫ్ స్టైల్’ అనేది వాస్తవానికి చాలా దూరం. ఈ హైపర్ కంపారిజన్ అతిగా పోల్చడం వల్ల నేను కూడా అలాంటి పరిపూర్ణ ప్రేమను కొనసాగించలేను లేదా నా భాగస్వామి కూడా ఆశించిన స్థాయిలో ఉండరు అనే అనుమానం, ఆందోళన పెరుగుతోంది.
కెరీర్, సెటిల్ మెంట్ పై ఆందోళన కారణం
ప్రస్తుతం జీవితంలో స్థిరపడడం అత్యంత కష్టంగా మారింది. ఉద్యోగం, కెరీర్ లో స్థిరపడాలనే ఒత్తిడి యువతపై తీవ్రంగా ఉంది. ఈ ఒత్తిడి వల్ల రిలేషన్ షిప్ కు అవసరమైన సమయాన్ని మానసిక శ్రద్ధను ఇవ్వలేమనే భావన ఎక్కువై బంధాలను వాయిదా వేస్తున్నారు.
వ్యక్తిగత స్వేచ్ఛకు అధికప్రాధాన్యం
ప్రస్తుత తరం వ్యక్తిగత స్వేచ్ఛ కు, హద్దులేనితనానికి ఎక్కువ విలువ ఇస్తున్నారు. ‘రిలేషన్ షిప్ అంటే వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవడం ’ అనే అపోహ లేదా భావన కొంతమందిలో భయాన్ని పెంచుతోంది. ఆన్ లైన్ డేటింగ్ యాప్ లు, ఫేక్ ప్రొఫైల్స్, చాట్ ల ద్వారా జరిగే మోసాలు విశ్వాసంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల ఇతరులను గుడ్డిగా నమ్మడానికి యువత భయపడుతోంది.
భయం నుంచి బయటపడడం ఎలా?
రిలేషన్ షిప్ ఫియర్ ఉన్న యువతలో నిర్ణయం తీసుకోవడంలో తడబాటు కనిపిస్తోంది. ప్రేమ, బంధం విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోవడం కారణంగా కనిపిస్తోంది. బంధం మొదలవ్వకముందే వెనక్కు తగ్గడం కనిపిస్తోంది. ఒక రిలేషన్ షిప్ మొదలవుతున్న సూచనలు కనిపిస్తే వెంటనే దూరం జరగుతున్నారు. ఇతరులతో సున్నితమైన విషయాలు పంచుకోకుండా భావోద్వేగంగా దూరంగా ఉండడం ముఖ్యం. సామాజికంగా కలవకుండా.. ఒంటరిగా ఉండడానికే సురక్షితమని భావించడంతో ఒంటరితనానికి ప్రాధాన్యమిస్తున్నారు.
ప్రతీ బంధంలోనూ సమస్యలుంటాయి. సోషల్ మీడియాలో చూపించేదంతా నిజం కాదని.. ప్రతి బంధంలో సమస్యలుంటాయని గుర్తించాలి. రిలేషన్ షిప్ ను ఒత్తిడిగా కాకుండా పరస్పర గౌరవంగా బంధంగా చూడాలి. గత చేదు అనుభవాలను భవిష్యత్తుపై రుద్దకూడదు. ప్రతీ బంధం కొత్తదిగా పరిగణించాలి. భాగస్వామితో మీ భయాలు, అభద్రతా భావాలు పంచుకోవాలి. భయం ఎక్కువుంటే సైకాలజిస్ట్ ను కలవాలి.
యువతలో ఈ రిలేషన్ షిప్ భయం పెరుగుతున్న ఒక పరిణతి చెందిన తరం సున్నితమైన అంశాల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తగా కూడా చూడవచ్చు. ప్రేమ, బంధాల విషయంలో భయాన్ని వీడి జాగ్రత్తగా అడుగులు వేయడం ద్వారా యువత ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చు.
