Begin typing your search above and press return to search.

కాక్రోచ్ పార్టీ... జెన్ జీ రీ సౌండ్ నా ?

వెల్లువలా నీరు పొంగుతూంటే దోవ అదే చూసుకుంటుంది. క్రమానుగతంగా పోవాలని అసలు ఆలోచించదు, నీరు పల్లమెరుగు అన్న సూత్రాన్ని కూడా అది విస్మరిస్తుంది.

By:  Satya P   |   21 May 2026 11:58 PM IST
కాక్రోచ్ పార్టీ...  జెన్ జీ రీ సౌండ్ నా ?
X

వెల్లువలా నీరు పొంగుతూంటే దోవ అదే చూసుకుంటుంది. క్రమానుగతంగా పోవాలని అసలు ఆలోచించదు, నీరు పల్లమెరుగు అన్న సూత్రాన్ని కూడా అది విస్మరిస్తుంది. అలాంటి వెల్లువ జెన్ జీ. వారికి దూకుడు ఎక్కువ. అదే సమయంలో ఏమీ తెలియదు అనుకోవడమూ పొరపాటే. వారికి అనేక విషయాల మీద అవగాహన ఉంది. ఈ సమాజం విషయంలో వారి భావాలను అవసరమైన సందర్భాల్లో ఎలాంటి మొహమాటాలకూ తావు లేకుండా వ్యక్తం చేస్తూనే ఉంటున్నారు. జెన్ జీ అనగానే పొరుగు దేశాలలో పాలక పక్షాల మీద తిరుగుబాటు చేసిన ఉదంతాలు తప్పనిసరిగా గుర్తుకు వస్తాయి. అది శ్రీలంక అయినా నేపాల్ అయినా బంగ్లాదేశ్ అయినా జెన్ జీ సత్తా ఏమిటో తెలియ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక భారత్ లో జెన్ జీ ప్రభావం పెద్దగా లేదు అనుకోవడానికి ఆస్కారమే లేదు. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీని గెలిపించడం వెనక జెన్ జీ పాత్ర అత్యధికం అన్న విశ్లేషణలు ఉన్నాయి.

కాక్రోచ్ జనతా పార్టీ :

ఈ పేరేదో మరో ప్రధాన పార్టీతో పోలికగా ఉందే అన్న చర్చ రావచ్చు. అలా రావాలనే పెట్టింది అన్న అనుమానామూ రావచ్చు. ఇవన్నీ నిజాలూ కావచ్చు, అయితేనేమి ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అని ముద్ర వేసుకున్న బీజేపీని మించి కాక్రోచ్ పార్టీ తన హవాను చాటుకుంటోంది. పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ని సాధించింది. దీనిని అంత ఆదరణ ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు జవాబూ వెంటనే ఉంది. ఇది ఒక తరం దూకుడు నుంచి వచ్చినది అని కూడా చెప్పవచ్చు. ఇక గత నాలుగైదు రోజులుగా ప్రభంజనం సృష్టిస్తూ సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తున్న కాక్రోచ్ పార్టీ ఖాతాని ఎక్స్ లో బ్లాక్ చేయడం ఒక సంచలన పరిణామం అయితే అది ఒక్కటే కాదు మేము మరిన్ని ఉన్నామని అనేక ఖాతాలు పుట్టుకుని వస్తున్నాయి. దటీజ్ ద పవర్ ఆఫ్ కాక్రోచ్ పార్టీ అని అంటున్నారు.

విపక్షాల మద్దతు :

సహజంగానే పాలక పక్షాన్ని ప్రశ్నించే వారికి విపక్షం మద్దతు ఉంటుంది కాక్రోచ్ పార్టీకి అదే తీరున విపక్షాల మద్దతు లభిస్తోంది. జెన్ జీ గళం ఇది అంటున్నాయి విపక్షాలు వాటి గొంతుని అధికార పక్షం వినాలని డీఎంకే ఎంపీ కనిమొళి కోరేడం కూడా విశేష పరిణామం. మరో వైపు నీట్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేయడం ద్వారా రీ సౌండ్ చేసింది. అది జెన్ జీ అచ్చమైన గొంతుక అని అంతా అంటున్నారు. మరింత సహజంగా కాక్రోచ్ పార్టీకి సినీ నటుడు ప్రకాష్ రాజ్ నుంచి ఫుల్ సపోర్టు లభించింది. మొత్తం మీద చూస్తే కాక్రోచ్ కదా అని లైట్ తీసుకుంటే ఎంతైనా చేస్తుందా అన్న చర్చ అయితే స్టార్ట్ అయింది. ముందే చెప్పినట్లుగా వెల్లువకు హద్దులు పద్దులూ ఉండవు. దానికి కొండలు ఎత్తులు అన్న సమస్యలూ సవాళ్ళొ అంతకంటే లేవు. దూకుడుగా సాగినపుడు వాటిని సైతం దాటేసి పోతుంది. మరి కాక్రోచ్ పార్టీ వెనక జెన్ జీ బిగ్ సౌండ్ ఉందా అంటే ఆలోచించాల్సిన విషయమే.