ఒక్క ఆర్టికల్ తో పాకిస్తాన్ సర్కార్ కు చెమటలు పట్టించిన జెన్ జెడ్ యువకుడు
జెన్ జీ, ఆల్ఫా యువతకు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు పూర్తీగా తెలుసని జొరైన్ అన్నారు. దేశభక్తిని నూరిపోయాలని ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వ ప్రయత్నాలను వారు నిరంతరం అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
By: A.N.Kumar | 9 Jan 2026 6:00 AM IST‘‘దేశభక్తిని బలవంతంగా రుద్దలేం. సమాన అవకాశాలు కల్పించినపుడే అది సాధ్యం. పాఠశాలలు, కళాశాలల్లో దేశభక్తిని బోధించడానికి ఎన్ని సెమినార్లు పెట్టిన ఉపయోగం లేదు. మీరు అమ్మాలనుకున్న దాన్ని నేటి యువతరం కొనడానికి సిద్ధంగా లేదు’’ అంటూ యూఎస్ లో పీహెచ్.డీ చేస్తున్న పాకిస్థానీ యువకుడు జొరైన్ నిజమాని ఓ పత్రికకు ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ పాకిస్థాన్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాకిస్థాన్ లో స్థితిగతులు, ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, నేటి తరం ఆలోచనలను సూటిగా జొరైన్ నిజమాని తన ఆర్టికల్ లో వ్యక్తీకరించారు. జొరైన్ వాదనకు పాక్ లో మద్దతు పెరుగుతోంది.
దేశంలోని అందరికీ సమాన అవకాశాలు కల్పించినపుడు.. సరైన యంత్రాంగం ఏర్పాటు చేసినప్పుడు, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తీసుకొచ్చినపుడు దేశభక్తి సహజంగా వస్తుందని అది నూరి పోయడం ద్వారా రాదంటూ జొరైన్ నిజమాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లో విఫలమైన పాలనను ప్రస్తావించారు. పెరుగుతున్న అవినీతి, పేదరికం గురించి వ్యాఖ్యానించారు. ఒక నివేదిక ప్రకారం 2025లో నిరుద్యోగం 31 శాతం పెరిగింది. అదే సమయంలో 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజినీర్లు 24 నెలల్లోనే పాకిస్థాన్ వదిలి వెళ్లారు.
జెన్ జీ, ఆల్ఫా యువతకు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు పూర్తీగా తెలుసని జొరైన్ అన్నారు. దేశభక్తిని నూరిపోయాలని ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వ ప్రయత్నాలను వారు నిరంతరం అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఏం జరుగుతుందో తెలియని విధంగా ప్రజలను ఉంచడానికి ప్రయత్నించిన ప్రభుత్వ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్నారు. ప్రజలు ఏం ఆలోచించాలో చెప్పడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు వారు సొంతంగా ఆలోచిస్తున్నారని తెలిపారు.
``జెన్ జీ యువత స్పీడ్ ఇంటర్నెట్ కావాలని కోరుకుంటోంది కానీ అధికారంలో ఉన్నవారు బలమైన ఫైర్ వాల్ కావాలనుకుంటున్నారు. జెన్ జీ చౌకైన స్మార్ట్ ఫోన్లు కావాలనుకుంటోంది. ఆ ఫోన్లపై ప్రభుత్వం పన్నులు వేయాలనుకుంటోంది. జెన్ జీ ఫ్రీలాన్సింగ్ పై పరిమితులు ఉండకూడదని కోరుతోంది. కానీ ప్రభుత్వం పరిమితులు విధిస్తోంది `` అంటూ జొరైన్ పేర్కొన్నారు.
అదే సమయంలో జెన్ జీ యువత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోందని, ఒకవైపు ధరలు పెరుగుతుంటే మరోవైపు ఆదాయం తగ్గుతోందన్నారు. `` మీ పిల్లలు విదేశాల్లో చదువుతారు. మంచి ఆహారం తింటారు. మంచి నీరు తాగుతారు. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటారు`` అంటూ జొరైన్ వ్యాఖ్యానించారు.
జొరైన్ రాసిన ఆర్టికల్ కు పాకిస్థాన్ లో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. పాకిస్థాన్ లో జెన్ జీ యువత మనసులో మాటను జొరైన్ ఆర్టికల్ ప్రతిబింబించిందని చాలా మంది జర్నలిస్టులు, మేధావులు, న్యాయవాదులు జొరైన్ వాదనకు మద్దతుగా నిలిచారు. కానీ పాక్ ఆర్మీ మీడియా వింగ్ మాత్రం జొరైన్ ఆర్టికల్ కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించింది. ఈ ఆర్టికల్ ను ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఏ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ ఆర్టికల్ వైరల్ కావడంతో సోషల్ మీడియా ద్వారా జొరైన్ స్పందించారు. తాను చూసినది, అనుభవించినది మాత్రమే తన ఆర్టికల్ రాసినట్టు పేర్కొన్నారు. ఏ ఒక్కరినీ ద్వేషిస్తూ రాయలేదన్నారు. ఇప్పటికే ప్రపంచంలో కావాల్సినంత ద్వేషం ఉందని అన్నారు. నిజం ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటుందన్నారు.
