కాక్రోచ్ నీడలో కాంగ్రెస్ ఏపీలో బలపడుతుందా ?
కాక్రోచ్ జనతా పార్టీ. ఇది వాట్సప్ పార్టీ అని అంతా అంటున్నా యువతను ఎందుకో పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది.
By: Satya P | 24 July 2026 1:10 PM ISTకాక్రోచ్ జనతా పార్టీ. ఇది వాట్సప్ పార్టీ అని అంతా అంటున్నా యువతను ఎందుకో పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. దేశంలో అసంతృప్తి చెందిన యువతకు సీజేపీ ఒక వేదికగా మారుతోంది. దాంతో వారంతా సీజేపీ ద్వారా ఏదో మార్పు వస్తుందని ఆశపడుతున్నారు. ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. రొటీన్ పాలిటిక్స్ పట్ల విసుగెత్తిన యూత్ కూడా అక్కడే కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక వైపు జెన్ జీ తరం ఉంది. మరో వైపు కాక్రోచ్ ఉద్యమాలు ఉన్నాయి. దేశంలో ఈ రోజున పెద్ద ఎత్తున యువత ఉంది. వారి ఓట్లే గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయన్నది కూడా నిజం. తమిళనాడులో విజయ్ గెలుపు వెనకాల యువత ఎంత ముఖ్య పాత్ర పోషించింది అన్నది కూడా ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాలి.
విద్యార్థి ఉద్యమాలతో :
ఏపీలో గత పన్నెండేళ్ళుగా డస్సి పోయి డీలాపడిన కాంగ్రెస్ కి జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒక్కసారిగా ఊపిరిపోసేలా ఉన్నాయని అంటున్నారు. దానికి ఏపీలో రాజకీయ వాతావరణం కూడా కాంగ్రెస్ కి కలసి వచ్చేలా ఉంది. విద్యార్ధి ఉద్యమాలకు ఒక రాజకీయ పార్టీగా నిలిచి చేతులు కలిపేది కాంగ్రెస్ మాత్రమే అక్కడ ఉంది. ఎన్డీయేలో మూడు పార్టీలు ఉంటే విపక్షంలో వైసీపీ ఉన్నా ఈ పరిణామాల పట్ల సైలెంట్ గానే ఉంటోంది. నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ మీద వైసీపీ స్టాండ్ ఏమిటో కూడా చెప్పినది లేదని అంటున్నారు. దాంతో దేశమంతా సీజేపీ ఉద్యమాలు జోరుగా సాగుతూంటే ఏపీలో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. నిజానికి ఒక విపక్షంగా వైసీపీ ఈ చాన్స్ ని అందిపుచ్చుకోవాల్సి ఉంది. కానీ ఆ పార్టీ ఆలోచనలు ఏమిటో అంతుబట్టడం లేదని అంటున్నారు.
కాంగ్రెస్ రంగంలోకి :
సరిగ్గా ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ కి అనుకూలంగా మారుతోంది. దాంతో కాంగ్రెస్ తన జవసత్వాలను కూడగట్టుకుని రంగంలోకి దిగుతోంది. ఆ పార్టీలో మెల్లగా ఉత్తేజం కనిపిస్తోంది. విద్యార్థి సంఘాలలో ఉన్న యువ జీవం కాంగ్రెస్ కి కూడా సరికొత్త ప్రాణంగా మారుతోంది. ఈ విధంగా పరిస్థితులు తమను జనంలోకి కనెక్ట్ చేస్తాయని కాంగ్రెస్ కూడా ఊహించలేదు. కానీ ఇపుడు సమాజంలో అతి పెద్ద సెక్షన్ యూత్ ఒక సునామీలా అసంతృప్తి కెరటంగా విరుచుకుపడుతోంది. అది పాలక పక్షాల మీద తీవ్ర స్థాయిలో గర్జిస్తోంది. దాంతో కాంగ్రెస్ లాంటి పార్టీలకు ఏపీ లాంటి చోట ఇది ఒక మంచి అవకాశంగా మారుతోంది అని అంటున్నారు.
జాతీయ ప్రభావం :
ఇక దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సీజేపీకి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మద్దతు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రత్యక్ష పోరాటాలు అన్నీ కూడా ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. ఏపీలో చూస్తే రాజకీయ మైదానం ఖాళీగా ఉంది. పర్టిక్యులర్ గా ఈ సమయంలో సీజేపీ విషయంలో టచ్ మీ నాట్ అంటూ ప్రధాన పక్షాలు దూరంగా జరగడం కాంగ్రెస్ కి రేసులో పోటీ లేకుండా అయినట్లు ఉందని అంటున్నారు. మరి యూత్ ప్లస్ విద్యార్ధి ఉద్యమాలకు కాంగ్రెస్ వెన్ను దన్నుగా ఉంటూ చేయూతను అందిస్తే మాత్రం ఏపీలో కాంగ్రెస్ కి యూత్ కళ కట్టడం ఖాయమని అంటున్నారు. అంతే కాదు జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలు కూడా ఏపీలో కాంగ్రెస్ కి దశ దిశా నిర్దేశం చేస్తాయని అంటున్నారు. దాంతో గడచిన కాలం ఒక ఎత్తు వచ్చే కాలం మరో ఎత్తు అన్నట్లుగా కాంగ్రెస్ ఏపీ రాజకీయం సాగేందుకు అయితే అవకాశాలు మెరుగుపడ్డాయని అంటున్నారు.
