దుమ్ము లేపుతోన్న జెన్ జెడ్... తాజాగా మరో దేశానికి ఎఫెక్ట్!
అవును... మెక్సికోలోని పశ్చిమ రాష్ట్రమైన మిచోకాన్ లోని ఉరుపాన్ (దివంగత) మేయర్ కార్లోస్ మాంజో మరణానంతరం జెన్-జెడ్ రోడ్లపైకి రావడం మొదలుపెట్టింది.
By: Raja Ch | 16 Nov 2025 5:53 PM ISTఇటీవల కాలంలో పలు సమస్యలపై స్పందించే విషయంలో జనరేషన్ జెడ్ ఏమాత్రం తగ్గడంలేదు. ఇందులో భాగంగా గతంలో బంగ్లాదేశ్ లోనూ, నేపాల్ లోనూ ప్రభుత్వాలను తలకిందులు చేసే విషయంలో వారి నిరసనలు కీలకంగా మారగా.. ఇటీవల పీఓకే లోనూ విద్యార్థులు పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ లకు వ్యతిరేకంగా గళం ఎత్తారు. ఈ క్రమంలో మెక్సీకోలోనూ జెన్ జెడ్ ఎఫెక్ట్ తెరపైకి వచ్చింది.
అవును... మెక్సికోలోని పశ్చిమ రాష్ట్రమైన మిచోకాన్ లోని ఉరుపాన్ (దివంగత) మేయర్ కార్లోస్ మాంజో మరణానంతరం జెన్-జెడ్ రోడ్లపైకి రావడం మొదలుపెట్టింది. ఈ సమయంలో మెక్సికోలో పెరుగుతున్న హింసను అరికట్టడంలో ప్రభుత్వ భద్రతా విధానాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ వేలాది మంది ప్రజలు, ప్రధానంగా జెన్-జెడ్ యువత నగరాల్లోని వీధుల్లోకి వచ్చారు.
ఈ సందర్భంగా "కార్లోస్ చనిపోలేదు.. ప్రభుత్వమే అతన్ని చంపింది" అంటూ మెక్సికో నగరంలో ప్రదర్శనకారులు నినాదాలు చేశారు. ఇదే సమయంలో.. మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ నివసించే, పనిచేసే నేషనల్ ప్యాలెస్ చుట్టూ ఉన్న లోహపు కంచెలను కూడా ముసుగులు ధరించిన నిరసనకారులు కూల్చివేశారు. దీంతో.. పోలీసులు టియర్ గ్యాస్ తో స్పందించారు.
దీంతో... "మీరు కార్లోస్ మాంజోను కూడా ఇలాగే రక్షించాల్సింది" అని కొంతమంది నిరసనకారులు భద్రతా దళాలపై కేకలు వేసినట్లు మీడియా నివేదించింది. ఈ సందర్భంగా స్పందించిన మెక్సికో నగర భద్రతా అధిపతి పాబ్లో వాజ్క్వేజ్... చాలా సమయం ఈ నిరసనలు శాంతియుతంగానే కొనసాగాయని.. అయితే, మాస్కులు ధరించిన కొంతమంది హింసాత్మక చర్యలకు పాల్పడటంతో పరిస్థితి మారిందని తెలిపారు.
ఈ ఘటనలో సుమారు 100 మంది పోలీసులు గాయపడ్డారని.. వారిలో 40 మందికి ఆస్పత్రిలో చికిత్స అవసరమని అన్నారు. ఇదే క్రమంలో మరో 20 మంది పౌరులు గాయపడగా, 20 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే... ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా విదేశాల నుంచి ప్రచారం చేయబడిన ఉద్యమనని మెక్సికన్ అధ్యక్షురాలు అన్నారు!
