Begin typing your search above and press return to search.

జెన్ జెడ్ ని తట్టుకోవడం ఎవరి తరం ?

జెన్ జెడ్ ఇపుడు దేశంలో సగటు రాజకీయ నేతల నుంచి ప్రముఖ నేతల వరకూ అందరిలో వినిపిస్తున్న మాట. కొత్తగా ఉంది.

By:  Satya P   |   21 Sept 2025 10:47 PM IST
జెన్ జెడ్ ని తట్టుకోవడం ఎవరి తరం ?
X

జెన్ జెడ్ ఇపుడు దేశంలో సగటు రాజకీయ నేతల నుంచి ప్రముఖ నేతల వరకూ అందరిలో వినిపిస్తున్న మాట. కొత్తగా ఉంది. జనాలకు క్యాచీగా ఉండి కనెక్ట్ అవుతోంది అని వాడేస్తున్నారు. పైగా తమ ప్రత్యర్ధులకే ముప్పు అని భావిస్తున్నారు, ఒక రకంగా భ్రమిస్తున్నారు. జెన్ జెడ్ తరం ఉప్పొంగాలని విరుచుకుపడాలని కూడా ఎవరికి వారుగా పిలుపు ఇస్తున్నారు. నిజానికి చూస్తే భారతీయ సమాజం ఈ విధంగా ఉంది పదిలంగా ఉంది, భద్రంగా ఉంది అంటే దానికి కారణం సగటు యువతలో సముద్రమంత సహనం ఉండడమే అని అంటున్నారు.

ఎనభయ్యేళ్ళుగా :

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపుగా ఎనభై ఏళ్ళకు దగ్గర పడుతోంది. అయితే మంచి జరగలేదు అని ఎవరూ అనలేరు, దేశం అభివృద్ధి చెందలేదు అని కూడా అనవసరంగా నిందించే పరిస్థితి కూడా లేదు. ప్రపంచంలో భారత్ మంచి ప్లేస్ లో ఉంది అని అంతా అంగీకరిస్తారు. కానీ ఎపుడో ఆరున్నర దశాబ్దాల కిందట ఒక మహాకవి తెలుగు సినిమాలో రాసిన ఒక పాట నగ్న సత్యాన్ని ఈ రోజుకీ ప్రతీ పౌరుని చెవులలో అలా వినిపిస్తూనే ఉంటుంది. అదే అక్షర సత్యమని కూడా గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ పాట ఏమిటి అంటే వెలుగు నీడలలో పాడవోయి భారతీయుడా పాట. అవినీతి బంధుప్రీతి చీకటి బజారు నిరుద్యోగం, లంచాలు, రాజకీయ పెత్తనం ఇలా ఏ వైపు చూసినా ఏముంది గర్వకారణం అన్నట్లుగానే దేశం పరిస్థితి ఉంది.

ఆకలి అగ్ని కణంగా :

ఎక్కడ అయినా మనిషిని మండించేది ఎంతటి వారిని అయినా ఎదిరించేలా చేసేది ఆకలి. ఇక చదువుకుందామంటే భారీగా ఫీజులు, తీరా చదివాక ఉద్యోగాలు దొరకవు. ఇప్పటికి యాభై ఏళ్ళ క్రితం ఆకలి రాజ్యం సినిమాలో ఆత్రేయ రాసిన పాట సాపాటు ఎటూ లేదు బ్రదర్ అన్న దాంతో అంతా చూడవచ్చు. నిరుద్యోగం నిలువెత్తులా ఎదిగి మింగేస్తున్న వేళ సగటు యువ జనంలో ఆశలు ఎలా ఉంటాయి అన్నది ఆలోచించాల్సిందే కదా. అలాగే ఎటు చూసినా అవినీతి ఆశ్రిత పక్షపాతంతో మగ్గిపోతున్న వేళ హాహాకారాలే కదా జనంలో వినిపించే ఆర్తనాదాలు అన్న ఆవేదన సైతం కలుగుతుంది.

రెండు భారతాలుగా :

ఒకే దేశంలో రెండు భారతాలు ఉన్నాయి. ఒకటి సంపన్న భారతం. రెండవది నిరుపేద భారతం. మూడున్నర దశాబ్దాల క్రితం ఆర్ధిక సంస్కరణలు అమలు అయ్యాక దేశంలో ధనవంతులు మరింతగా పెరిగారు. వారి ఆస్తులు బాగా పెరిగాయి. అదే సమయంలో మధ్యతరగతి అధోగతి పాలు అయ్యారు. పేదలుగా జారిపోయారు. ఆ పేదలు కటిక పేదలు అయ్యారు.పాలకులు పేదరికాన్ని తీసేసామని కోట్లాది మందిని పేదరికం నుంచి ఒడ్డున పడేశామని గొప్పగా చెప్పవచ్చు కానీ నిజానికి ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజానీకం ఉంటే 80 కోట్ల మందికి పైగా ఇంకా తెల్ల రేషన్ కార్డు మీద చౌక దుకాణాల వద్ద సరుకులు ఇస్తున్నారు అన్నది ఒక కఠిన సత్యంగా కళ్ళ ముందు ఉంది అన్నది మేధావుల మాటగా ఉంది.

సముద్రమంత సహనం :

ఈ దేశానికి ఎంతో సహనం ఉంది. అసలు ఈ గడ్డకు మాత్రం అది సొంతం అని చెప్పాలి. ఎంతో మంది విదేశీయులు దేశం మీద పడి దండయాత్రలు చేసినా వారి మీద పోరాడి పంపించే శక్తి కూడా ఉంది. అదే సమయంలో మంచిగానే ఉంటూ శత్రువును సైతం ఆవల గట్టుకు పంపించే సహనం కూడా జనాలలో ఉంది. అదే ఎప్పటికీ శ్రీరామ రక్షగా దేశంలో అందరికీ నిలిచి దీవిస్తోంది.

కట్టలు తెంచుకోవద్దనే :

ఈ దేశంలో జెన్ జెడ్ తరం శివమెత్తాలని వారు వీరభద్రులై ప్రళయ తాండవం చేయాలని కొందరు రాజకీయ నేతలు ఉత్సాహపడుతున్నారు. కానీ అదే కనుక జరిగితే ముందు వారే తట్టుకోలేరు అన్నది పచ్చి నిజం. అలుగుటయే ఎరుగని ధర్మరాజు అలిగిన నాడు సాగరమ్ములన్నీ ఏకమయ్యేను అన్న మహా భారత పద్యం సాక్షిగా సలసల మండే యువత అయినా సగటు జనత అయినా సహనంగా ఉన్నంత సేపే అని అంతా గుర్తు ఉంచుకోవాలి. కట్టలు తెంచుకుంటే మాత్రం అదిసునామీయే అవుతుంది. అలాంటి స్థితి పరిస్థితి రాకుండా సమున్నత భారతంగా సహన భారతంగా సకుటుంబ పరివారం సమాజంగా సగర్వంగా తలెత్తుకుని నిలబడి ప్రపంచానికి మనమే ఒక అద్భుత సందేశంగా నిలవాలన్నదే అందరి కోరిక. అందువల్ల దయచేసి ప్రత్యర్థుల మీద సెటైర్ల కోసం జెన్ జెడ్ ని ఎవరూ వాడొద్దు. ఎందుకంటే అది అగ్గి రవ్వ. నిప్పు కణిక తట్టుకోలేరు అంతే. తస్మాత్ జాగ్రత్త.