Begin typing your search above and press return to search.

జెన్ జెడ్ టేస్ట్ మారిపోయిందిగా..

ఆకాశాన్ని తాకుతున్న ధరలు, మోయలేని వడ్డీ రేట్ల మధ్య 'సొంత ఇల్లు' అనేది ఒక కలగా మిగిలిపోతుంటే, ఆ నిరాశను అవకాశంగా మార్చుకుంటూ యువత స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేస్తోంది.

By:  A.N.Kumar   |   16 Feb 2026 6:00 PM IST
జెన్ జెడ్ టేస్ట్ మారిపోయిందిగా..
X

ఒకప్పుడు 25 ఏళ్లు నిండగానే ఇంటి స్థలం కోసం ఆరా తీసేవారు. కానీ నేటి 'జెన్-జీ' తరం చేతిలో గృహప్రవేశం కార్డులు లేవు.. బదులుగా డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. ఆకాశాన్ని తాకుతున్న ధరలు, మోయలేని వడ్డీ రేట్ల మధ్య 'సొంత ఇల్లు' అనేది ఒక కలగా మిగిలిపోతుంటే, ఆ నిరాశను అవకాశంగా మార్చుకుంటూ యువత స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేస్తోంది. ఇటుకలతో గోడలు కట్టడం కంటే, ఇండెక్స్‌లతో సంపదను సృష్టించడమే మేలని భావిస్తున్న ఈ కొత్త తరం ఆర్థిక విప్లవం చర్చనీయాంశమవుతోంది.

ఒకప్పుడు మధ్యతరగతి భారతీయుడి జీవితాశయం... ఒక సొంత ఇల్లు. కానీ నేటి జెన్-జీ ఆలోచనా ధోరణిలో పెనుమార్పు కనిపిస్తోంది. ఆకాశాన్ని తాకుతున్న రియల్ ఎస్టేట్ ధరలు, పెరిగిన వడ్డీ రేట్ల మధ్య "సొంత గూడు" అనేది సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతోంది. ఈ క్రమంలోనే యువత తమ ఆర్థిక వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. ఇటుకలతో గోడలు కట్టడం కంటే.. స్టాక్ మార్కెట్ సూచీలతో సంపదను నిర్మించడమే మేలని వారు భావిస్తున్నారు.

మారిన ప్రాధాన్యతలు: హౌసింగ్ వర్సెస్ స్టాక్స్

గతంలో 25-30 ఏళ్ల వయస్సు రాగానే ఇంటి కోసం లోన్ తీసుకోవడం ఒక సామాజిక బాధ్యతగా ఉండేది. కానీ నేడు పరిస్థితులు భిన్నం. జెపి మోర్గాన్ చేజ్ ఇన్స్టిట్యూట్ , రెడ్‌ఫిన్ గణాంకాల ప్రకారం.. గృహ కొనుగోలుదారుల్లో యువత వాటా గణనీయంగా పడిపోయింది. కెరీర్ కోసం ఏ నగరానికైనా వెళ్లాల్సి వస్తే, సొంత ఇల్లు ఒక భారంగా మారుతుందని జెన్ జెడ్ భావిస్తోంది. అందుకే అద్దె ఇంట్లో ఉంటూ మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో మళ్లించడం వారికి సులభంగా అనిపిస్తోంది. 2013తో పోలిస్తే యువతలో ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్లు ఉన్న వారి సంఖ్య మూడింతలు పెరగడం, వారిలో పెరిగిన ఆర్థిక అవగాహనకు నిదర్శనం.

వాల్ స్ట్రీట్ వైపు అడుగులు

రియల్ ఎస్టేట్ కంటే స్టాక్ మార్కెట్ వైపు యువత మొగ్గు చూపడానికి ప్రధాన కారణం లిక్విడిటీ. అత్యవసర సమయంలో ఇంటిని అమ్మడం కష్టం.. కానీ స్టాక్స్‌ను నిమిషాల్లో నగదుగా మార్చుకోవచ్చు. పైగా తక్కువ పెట్టుబడితో (ఎస్.ఐపీల ద్వారా) ప్రయాణాన్ని మొదలుపెట్టే అవకాశం ఉండటం వారికి కలిసొచ్చే అంశం. "సంపద అంటే కేవలం మన కంటికి కనిపించే ఆస్తి మాత్రమే కాదు.. కాలక్రమేణా వృద్ధి చెందే పెట్టుబడి" అనే సూత్రాన్ని నేటి యువత బలంగా నమ్ముతోంది.

సొంత ఇల్లు అనేది ఒక భావోద్వేగమైన అంశం కావచ్చు, కానీ నేటి ఆర్థిక పరిస్థితుల్లో అది లాభదాయకమైన పెట్టుబడి కాకపోవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. "మెయిన్ స్ట్రీట్" రియల్ ఎస్టేట్ లో చిక్కుకుపోయే కంటే, "వాల్ స్ట్రీట్" స్టాక్ మార్కెట్ లో దూసుకుపోవడమే తెలివైన పని అని జెన్ జెడ్ నిరూపిస్తోంది. ఇల్లు కొనలేకపోతున్నామనే నిరాశ కంటే.. ఆ డబ్బును సమర్థవంతంగా మదుపు చేసి భవిష్యత్తును భద్రం చేసుకోవాలనే వారి ధైర్యం అభినందనీయం.