ఆదాయం పెరుగుతున్నా బ్యాంక్ బ్యాలెన్స్ నిల్.. జెన్ జెడ్ జీవనశైలిలో దాగి ఉన్న అసలు ఆర్థిక రహస్యం ఇదే!
ఉద్యోగంలో చేరి కొన్నేళ్లు పూర్తయ్యాయి.. ప్రమోషన్ వచ్చింది.. చేతికి వచ్చే జీతం కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది.
By: A.N.Kumar | 30 Aug 2026 5:00 AM ISTఉద్యోగంలో చేరి కొన్నేళ్లు పూర్తయ్యాయి.. ప్రమోషన్ వచ్చింది.. చేతికి వచ్చే జీతం కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. అయినా సరే నెలాఖరు వచ్చేసరికి బ్యాంక్ ఖాతాలో చూస్తే పైసలు మిగలడం లేదు. "ఎంత సంపాదిస్తున్నాం?" అనే ప్రశ్నకు సమాధానం స్పష్టంగానే ఉన్నా "ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతోంది?" అనే ప్రశ్న మాత్రం నేటి జెన్ జీ యువతను తీవ్రంగా తొలిచివేస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువతలో ఈ పరిస్థితి ఒక సవాలుగా మారింది. ఇటీవల వెలువడిన వినియోగదారుల అధ్యయనాల ప్రకారం.. జెన్ జెడ్ నెలవారీ ఆదాయంలో 70 శాతానికి పైగా పునరావృత ఖర్చులకే కరిగిపోతోందని వెల్లడైంది.
సౌకర్యం పేరిట కరిగిపోతున్న సొమ్ము
నేటి తరం జీవనశైలిలో 'సౌకర్యం' అత్యంత కీలకమైన అంశంగా మారింది. రోజంతా ఆఫీసులో శ్రమించిన తర్వాత ఇంటికొచ్చి వంట చేసుకోవడం కంటే ఒక క్లిక్‌తో ఆహారాన్ని డోర్ డెలివరీ చేసుకోవడమే సులభంగా అనిపిస్తుంది. రోజుకు ₹200 నుంచి ₹300 చొప్పున చేసే ఈ చిన్న ఖర్చు, నెలాఖరుకు వచ్చేసరికి ఏకంగా ₹6,000 నుంచి ₹9,000 దాటిపోతోంది. దీనికి తోడు మనకు తెలియకుండానే జేబులు ఖాళీ చేసే మరో నిశ్శబ్ద శత్రువు సబ్‌స్క్రిప్షన్లు. ఓటీటీ వేదికలు, మ్యూజిక్ యాప్‌లు, క్లౌడ్ స్టోరేజ్, ఫిట్‌నెస్ అప్లికేషన్‌లు.. ఇలా ప్రతిదీ నెలకు కొన్ని వందల రూపాయలే కదా అనిపిస్తాయి, కానీ అవన్నీ కలిపితే నెలవారీ బడ్జెట్‌పై సింహభాగం ప్రభావాన్ని చూపిస్తాయి.
అనుభూతుల కోసం ఖర్చు.. ఇఎమ్‌ఐల భారం
మరోవైపు కేవలం భౌతిక వస్తువులను కొనుగోలు చేయడం కంటే కూడా కొత్త అనుభూతులను సొంతం చేసుకోవడానికే జెన్ జీ ఎక్కువ మొగ్గు చూపుతోంది. వీకెండ్ ట్రిప్‌లు, ట్రెండీ కేఫ్‌లు, లైవ్ కన్సర్ట్‌లు, సోషల్ మీడియా ప్రభావంతో పెరిగిన లైఫ్‌స్టైల్ ట్రెండ్స్ ఆర్థిక భారాన్ని మరింత పెంచుతున్నాయి. "రేపటి సంగతి ఏమో కానీ ఇప్పుడే జీవించాలి" అనే ఆలోచన చెడు కాకపోయినా భవిష్యత్ భద్రతను పక్కన పెట్టినప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. దీనికి తోడు స్మార్ట్‌ఫోన్ నుంచి ల్యాప్‌టాప్, బైక్, ఫర్నిచర్ వరకు ప్రతిదాన్నీ ఇఎమ్‌ఐ రూపంలో కొనుగోలు చేయడం వల్ల రాబోయే ఆదాయాన్ని ముందే ఖర్చు చేసే అలవాటు పెరుగుతోంది.
సమస్య జీతంలో కాదు.. ఖర్చు చేసే దృక్పథంలోనే..
ఇక్కడ గమనించాల్సిన ప్రధానాంశం ఏంటంటే.. సేవింగ్స్ తగ్గడానికి కారణం కేవలం తక్కువ జీతం మాత్రమే కాదు.. పెరుగుతున్న ఆదాయంతో పాటు అలవాటవుతున్న 'లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్'. జీతం ₹30 వేల నుంచి ₹50 వేలకు పెరిగినప్పుడు ఖర్చులు కూడా అదే స్థాయిలో ₹20 వేల నుంచి ₹40 వేలకు పెరుగుతుంటే ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించదు.
దీనికి పరిష్కారం ఖర్చులన్నీ ఆపేసి నిరాడంబరంగా జీవించడం కాదు.. వ్యూహాత్మకంగా ప్లాన్ చేయడం. జీతం చేతికి రాగానే ముందుగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు లేదా పెట్టుబడులకు ఎస్ఐపీ.. మ్యూచువల్ ఫండ్స్ మళ్లించి, మిగిలిన మొత్తంతో మాత్రమే నెలవారీ ఖర్చులను నిర్వహించడం ఉత్తమం. 'ఖర్చు చేయగా మిగిలినదాన్ని దాచడం' కాకుండా 'దాచగా మిగిలినదాన్ని ఖర్చు చేయడం' అనే చిన్న సూత్రాన్ని అలవర్చుకున్నప్పుడే ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు పడతాయి. ఆదాయం పెరగడం ఒక ప్రారంభం మాత్రమే ఆ సంపాదనలో ఎంత మిగిలించి భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నామనేదే నిజమైన ఆర్థిక బలం..
