Begin typing your search above and press return to search.

వారిని మచ్చిక చేసుకోవడం ఎవరి తరం ?

వారు మామూలు తరం కాదు, ఎగిసిపడితే సునామీయే. ఆవేశపడితే అగ్ని కీలలే. కదిలిపోతే భూ ప్రకంపనలే. దూకుడు వారి నైజం.

By:  Satya P   |   8 Aug 2026 9:22 AM IST
వారిని మచ్చిక చేసుకోవడం ఎవరి తరం ?
X

వారు మామూలు తరం కాదు, ఎగిసిపడితే సునామీయే. ఆవేశపడితే అగ్ని కీలలే. కదిలిపోతే భూ ప్రకంపనలే. దూకుడు వారి నైజం. ధర్మాగ్రహం వారి అసలు లక్షణం. వారూ వీరూ అన్న తేడాలు అసలు లేనే లేవు. ఎవరైనా వారికి ఒక్కటే. మ్యాథమెటిక్స్ లో లెక్కకు ఆన్సర్ కరెక్ట్ గా వచ్చినట్లుగా వారికి పరిష్కారం అంత పెర్ఫెక్ట్ గా రావాలి. అందులో ఏ తొండి లెక్కలు కానీ మభ్యపెట్టే తీరు కానీ ఉంటే వారు ఊరకే వేడి నిట్టూర్పులు విడిచేది ఉండదు, భగ్గుమంటారు, అగ్గి మీద గుగ్గిలమే అవుతారు. ఇంతకీ వారు ఎవరు అంటే అందరికీ జవాబు తెలుసు. వారే జెన్ జీ తరం. ఇటీవల నెలలలో అందరిలో వారి గురించే చర్చ. ఈ తరం ఒకటి ఉంటుందని మీదకు వచ్చి శాసిస్తుందని తెలియని సంప్రదాయం భావజాలం, అలాగే పక్కా ట్రెడిషనల్ రొటీన్ పొలిటికల్ సిస్టం కూడా ఇపుడు ఉలికులికి పడుతోంది. అంతే కాదు ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక జుత్తులు పీక్కుంటోంది.

వేవ్ లెంగ్త్ కలుస్తుందా :

వారు ఏ గ్రహాల నుంచి ఊడి పడిన వారు కాదు, మన లాంటి వారే. మన పౌర సమాజంలోని వారే. ఇంకా చెప్పాలంటే ఈ దేశం మీద బాధ్యత వారికే ఎక్కువ ఉంది. ఎందుకంటే నూటికి అరవై మంది వారు ఉన్నారు. ఈ దేశ వనరులు కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ అంతా వారి చేతుల్లో చేతల్లోనే ఉంది. కానీ వారిని కాదని పక్కన పెట్టేసి ఆ మిగిలిన నలభై శాతం పెత్తనం చేస్తోంది. దాంతో తమకు గిట్టని ఒంటబట్టని ఈ దుర్విధానాల మీదనే జెన్ జీ తరం తిరగబడుతోంది అని సామాజిక అధ్యయన కర్తలు అంచనా వేస్తున్నారు. వారి వేవ్ లెంగ్త్ ని మ్యాచ్ చేయడం ప్రస్తుతం ఉన్న ట్రెడిషనల్ పొలిటీషియన్ల వల్ల అవుతుందా అన్నదే అతి పెద్ద ప్రశ్నగా ఉంది.

వంచన గిట్టని వైనం :

జెన్ జీ తరానికి నిజాయతీ మూలం. వారు అనుకున్నది జరగాలన్నది ఒక మారాం. అది అసాధ్యం కాదన్నది వారి వాదం. ఇది మొండి వైఖరిగా ఉన్నా కూడా వారి ఆలోచనలు అంతే అన్నది ఒక ఫిలాసఫీ. మరి వారికి నచ్చినట్లుగా సమాజం మారాలా లేక వారు మారుతారా అంటే మొదటితే కరెక్ట్ అని అంటున్నారు. ఎందుకంటే వారు మారేది ఉండదు, వారు కొత్త తరం. వారిది మరింత కాలం జీవితం. రేపటి భవిష్యత్తు వారితోనే ముడిపడి ఉంది. అందువల్ల వెనుకబడిన సిద్ధాంతాలతో ఎవరైనా ఉంటే వారు తమలో గుణాత్మకమైన మార్పులు తెచ్చుకుని మారాల్సిన అవసరం అయితే కచ్చితంగా ఉంది అని సామాజికవేత్తలు సూత్రీకరిస్తున్నారు.

జపం చేస్తే సరిపోతుందా :

ఈ రోజున దేశంలో అంతా జెన్ జీ జపం చేస్తున్నారు. వారితోనే అంతా అంటున్నారు. వారు మంచి వారు మన వారే అని అంటున్నారు. ఇలా వారి చుట్టూనే రాజకీయ పార్టీలు నేతలతో పాటు ఇతర సామాజిక సంస్థలు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ వంటి వారు నేరుగా వారితో కనెక్ట్ అవుతున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ అయితే సోషల మీడియా ఇన్స్టా గ్రామ్ ద్వారా వారితో అనుసంధానం అయ్యేందుకు చూస్తున్నారు. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అయితే జెన్ జీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు.

యువత గొంతును అణచి వేయరాదు :

ఇక తాజాగా ముంబైలో జరిగిన యువజన సదస్సులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జెన్-జీ తరంపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. నిరసనలు తెలిపే యువతను దేశద్రోహులుగా చూడకూడదని వారి ఆందోళనల్లో నిజాయతీ ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక భాగమని, యువత గొంతును అణచివేయకుండా చర్చల ద్వారా వారి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. జెన్-జీ, జెన్-ఆల్ఫా తరాలు చాలా నిజాయితీ గలవని తాను ఈ యువతను పూర్తిగా విశ్వసిస్తానని చెప్పారు. పెద్దలు చెప్పిన ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకుండా, నేటి యువత ప్రతి విషయాన్ని తార్కికంగా ప్రశ్నించి తగిన తర్కం కోసం చూస్తున్నారని తెలిపారు. విద్య అనేది వ్యాపారంగా మారకూడదని అందరికీ అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద అందరూ జెన్ జీని పొగుడుతున్నారు. వారిది కరెక్ట్ అని అంటున్నారు. మరి జెన్ జీ ఏమనుకుంటోంది అక్కదే చూడాల్సి ఉంది. అదే అసలైన పాయింట్ కూడా.