Gen Z యువత మద్యం వద్దు అంటోంది ఎందుకు?
ముందు తరాల్లో మద్యం అంటే సరదా, పార్టీలు, స్నేహితులతో గడిపే సమయం అని భావించేవారు.
By: Priya Chowdhary Nuthalapti | 24 Feb 2026 6:00 PM ISTఇటీవలి కాలంలో Gen Z యువతలో ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. మునుపటి తరాలతో పోలిస్తే..ఈ తరం మద్యం తాగడంపై ఆసక్తి చాలా తక్కువగా చూపిస్తోంది. ఒక తాజా అధ్యయనం ప్రకారం.. Gen Zలో సుమారు 87 శాతం మంది మద్యం తాగడాన్ని ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పవచ్చు.
ముందు తరాల్లో మద్యం అంటే సరదా, పార్టీలు, స్నేహితులతో గడిపే సమయం అని భావించేవారు. కానీ Gen Z యువత మాత్రం ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. శరీరానికి హాని కలిగించే అలవాట్లకు దూరంగా ఉండాలని ఈ తరం భావిస్తోంది.
ఆ విషయం స్పష్టంగా తెలుసుకున్న Gen Z..!
మద్యం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని Gen Zకు స్పష్టమైన అవగాహన ఉంది. కాలేయ సమస్యలు, బరువు పెరగడం, నిద్ర లోపాలు వంటి ఇబ్బందులు మద్యం వల్ల వస్తాయని యువతకు.. తెలుసు. అందుకే వారు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకుంటున్నారు.
ఇంకో ముఖ్యమైన కారణం మానసిక ఆరోగ్యం. మద్యం తాగితే తాత్కాలికంగా ఆనందంగా అనిపించినా, తర్వాత ఒత్తిడి, ఆందోళన పెరుగుతుందని Gen Z గుర్తించింది. అందుకే స్పష్టమైన ఆలోచనలతో ఉండటానికే వారు ఇష్టపడుతున్నారు.
ఫిట్‌నెస్ కల్చర్ కూడా Gen Zపై బలమైన ప్రభావం చూపిస్తోంది. జిమ్, యోగా, వర్కౌట్స్ వంటి వాటిపై ఆసక్తి పెరిగింది. మద్యం తాగితే ఫిట్‌నెస్ లక్ష్యాలు దెబ్బతింటాయని వారు భావిస్తున్నారు. అందుకే మద్యం వద్దు అంటున్నారు.
అలాగే.. మద్యం ఖరీదు కూడా ఒక కారణం. మంచి జీవనశైలికి డబ్బు దాచుకోవాలని Gen Z భావిస్తోంది. మద్యం మీద ఖర్చు పెట్టడం అవసరం లేదని చాలామంది అనుకుంటున్నారు.
సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంది. ప్రతి చిన్న విషయం బయటకు వచ్చేస్తున్న ఈ కాలంలో, మద్యం తాగిన ఫోటోలు లేదా వీడియోలు పేరు చెడగొడతాయని యువత భయపడుతోంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
మద్యం బదులు మాక్‌టెయిల్స్, జీరో ఆల్కహాల్ డ్రింక్స్‌ను Gen Z ఇష్టపడుతోంది. సరదా కూడా ఉండాలి, ఆరోగ్యం కూడా ఉండాలనే ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు.
ఏది ఏమైనా.. Gen Z యువత మద్యం కన్నా స్పష్టమైన ఆలోచనలు, ఆరోగ్యకరమైన జీవితం, ప్రశాంతమైన మనసును ఎక్కువగా విలువ ఇస్తోంది. ఇది భవిష్యత్ తరాలకు మంచి మార్గం చూపించే మార్పుగా చెప్పవచ్చు.
