Begin typing your search above and press return to search.

21 ఏళ్ళకే చట్టసభలకు ....తుళ్ళిపోయేది ఎవరు ?

దేశంలో ఇపుడు అంతా యువ శక్తి గురించే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. భారతీయ యువత దేనికీ పెద్దగా స్పందించదని అది సోషల్ మీడియాకే పరిమితం అవుతుందని అంతా భావిస్తూ ఉంటారు.

By:  Satya P   |   26 July 2026 8:05 AM IST
21 ఏళ్ళకే చట్టసభలకు ....తుళ్ళిపోయేది ఎవరు ?
X

దేశంలో ఇపుడు అంతా యువ శక్తి గురించే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. భారతీయ యువత దేనికీ పెద్దగా స్పందించదని అది సోషల్ మీడియాకే పరిమితం అవుతుందని అంతా భావిస్తూ ఉంటారు. అయితే తాజాగా కాక్రోచ్ దండులో కనిపించింది అంతా యువతరమే. పైగా జెన్ జీ తరం. ఇంకా చెప్పాలంటే నూనూగు మీసాల నూత్న యువత అంతా అక్కడ కదలి సునామీనే క్రియేట్ చేసింది. దీంతో దేశంలో సరికొత్త మార్పుగా అంతా చూస్తున్నారు. నిజానికి యువత అంటే భావితరానికి ప్రతినిధులు. వారిదే ఈ దేశం. దేశ సంపద కానీ వనరులు కానీ వారికే చెందుతాయి. అయితే వాటి గురించి పట్టించుకునే తీరిక ఓపిక భారతీయ యువతకు అంతగా లేవని అనుకునే వారు. అయితే ఇపుడు బిగ్ చేంజ్ అయితే వచ్చేసింది.

కొండను పిండి చేసేలా :

యువతరం తలచుకుంటే కొండను పిండి చేయగలదు. అసాధ్యాలను సుసాధ్యం చేయగలదు. అది చరిత్రలో ఎన్నో సార్లు రుజువు అయింది. మొండిగా ఎవరు వ్యవహరించినా యువత రంగంలోకి దిగనంతవరకే అని విద్యార్ధుల ఉద్యమ విజయం చూసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా ఎనభయ్యేళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఒక ప్రముఖ నాయకుడు లేకుండా బలమైన రాజకీయ పార్టీ అండదండలు లేకుండా కేవలం యువత మాత్రమే పోరాడి విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదనే అంటున్నారు. వాట్సప్ నుంచి దిగివచ్చి జంతర్ మంతర్ గ్రౌండ్ లో గడగడలాడించి ఏకంగా బలమైన కేంద్ర ప్రభుత్వంతోనే చర్చలకు ఆహ్వానం అందుకుని తమ డిమాండ్లు నెగ్గించుకోవడం అంటే యూత్ పవర్ అన్నది దేశానికే కాదు యావత్తు ప్రపంచానికి తెలిసింది. దాంతో ఇపుడు అంతటా ఇదే చర్చగా సాగుతోంది.

చట్ట సభలకు వస్తే :

ఇదిలా ఉంటే చట్ట సభలోకి ఎవరైనా అడుగు పెట్టాలి అంటే పాతికేళ్ళ వయసు ఉండాలి. పాతికేళ్ళు అంటే ఒక విధంగా ఆలోచనా శక్తి పెరుగుతుందని వివేచనతో వ్యవహరిస్తారు అని ఈ నిబంధన పెట్టారు. అయితే ఇప్పటి తరం చాలా ముందుగానే విచక్షణతో కూడిన ఆలోచనలు చేస్తోంది. జెన్ జీ తరం దూకుడు చూస్తే పాతికేళ్ళు అన్నది పెద్ద వయసు గానే ఉంటోంది అని మేధావులు అంటున్నారు. దాంతో నవతరం యువత ముఖ్యంగా జెన్ జీ తరానికి చట్ట సభలలో చోటు కల్పించాల్సిన అవసరాన్ని కూడా మేధావులు ఆలోచనాపరులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 21 ఏళ్ళకే చట్ట సభలలో యువతను పంపిస్తే దేశ గతి ప్రగతి కూడా సరికొత్త దిశగా సాగి వేగం పుంజుకుంటాయన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారు ఇపుడు అధికంగా కనిపిస్తున్నారు.

రేవంత్ నోట అదే మాట :

అయితే దేశంలో ఈ విషయం మీద గత కొంతకాలంగా చర్చ సాగుతున్నా ఆచరణలో పెట్టేందుకు ఎవరూ ముందుకు అడుగులు వేయడం లేదు. కానీ విచిత్రంగా తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట ఈ మాట రావడం విశేషం. ఆయన యువతకు చట్ట సభలలో అవకాశాలను చాలా వేగంగా దక్కేలా చూస్తామని అంటున్నారు. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని, 21 ఏళ్లకే చట్టసభలలో యువత అడుగుపెట్టేలా తీర్మానం చేస్తామని చెప్పారు. రేవంత్ కనుక ఈ తీర్మానం చేస్తే అది నిజంగా సంచలనమే అవుతుంది.

పార్లమెంట్ కూడానా :

అదే జరిగితే దేశంలో చాలా రాష్ట్రాల మీద యువత నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అపుడు పార్లమెంట్ లో కూడా రాజ్యాంగ సవరణ చేసి 21 ఏళ్ళకే చట్ట సభలలో యువగ్త పోటీకి అవకాశం కల్పించేందుకు చట్టం తీసుకుని వచ్చినా వస్తారు అని అంటున్నారు. ఇపుడు దేశంలోని చాలా పార్టీల చూపు యువత మీద ఉంది. మరీ ముఖ్యంగా జెన్ జీ తరం మీద ఉంది. విద్యార్ధుల ఉద్యమం విజయం సాధించాక రాజకీయ పార్టీలు అన్నీ ఇపుడు యూత్ గురించే మాట్లాడుతున్నాయి. దాంతో అధికార ప్రతిపక్షాల తేడా లేకుండా అంతా కలసి యూత్ మనసు చూరగొనేలా ఈ కొత్త చట్టం తెచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

సగటు వయసు తగ్గి :

అదే జరిగితే చట్ట సభలలో సగటు వయసు గణనీయంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం భారతదేశంలోని చట్ట సభలలో సభ్యుల సగటు వయసు సుమారు 56 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుల సగటు వయసు: 53 సంవత్సరాలుగా ఉంది. 21 ఏళ్ళకే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అవకాశం ఇస్తే కనుక ఈ ఎవరేజ్ ఏజ్ కాస్తా చట్ట సభలలో 50 లోపుకు పడిపోతుంది. అపుడు యువ భారతం అని అంతా అంటున్నది యువ పాలకులతో అసలైన వాస్తవంగా ఆవిష్కరించబడుతుంది అని అంటున్నారు.