Begin typing your search above and press return to search.

జెన్ జీ కుర్రోళ్ళలో కొత్త కోరికలు.. మరి అమ్మాయిలు అంగీకరిస్తారా?

నేటి తరం కుర్రాళ్ళు అంటేనే మోడ్రన్ ఆలోచనలు, సమానత్వం అని మనం అనుకుంటాం. కానీ తాజాగా 'కింగ్స్ కాలేజ్ లండన్' మరియు 'ఇప్సోస్' నిర్వహించిన సర్వే విస్తుపోయే నిజాలను బయటపెట్టింది.

By:  Madhu Reddy   |   7 March 2026 10:44 AM IST
జెన్ జీ కుర్రోళ్ళలో కొత్త కోరికలు.. మరి అమ్మాయిలు అంగీకరిస్తారా?
X

నేటి తరం కుర్రాళ్ళు అంటేనే మోడ్రన్ ఆలోచనలు, సమానత్వం అని మనం అనుకుంటాం. కానీ తాజాగా 'కింగ్స్ కాలేజ్ లండన్' మరియు 'ఇప్సోస్' నిర్వహించిన సర్వే విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. బయటకు స్టైలిష్‌గా కనిపిస్తున్నా, మనసులో మాత్రం పాతకాలపు కట్టుబాట్లనే నమ్ముతున్నారని ఈ నివేదిక చెబుతోంది. మరి ఈ విచిత్రమైన మనస్తత్వం పెళ్లిళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? అమ్మాయిలు ఈ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలను అంగీకరిస్తారా? ఈ ఆసక్తికరమైన సర్వే వివరాలు ఇప్పుడు చూద్దాం..

బయట మోడ్రన్.. ఇంట్లో మాత్రం బాస్:

జెన్ జీ యువత సోషల్ మీడియాలో సమానత్వం గురించి గొప్పగా మాట్లాడవచ్చు కానీ, వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి వారి ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 31% మంది మగవారు భార్య కచ్చితంగా భర్త మాట వినాలని కోరుకుంటున్నారు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన తాతల కాలం నాటి 'బేబీ బూమర్స్' (13%) కంటే ఈ తరం యువతే ఎక్కువ సంప్రదాయబద్ధంగా ఆలోచిస్తున్నారు. అంటే బయట ఎంత మోడ్రన్‌గా తిరిగినా, ఇంటి నాలుగు గోడల మధ్య మాత్రం తామే 'బాస్' అనిపించుకోవాలనే కోరిక వీరిలో బలంగా ఉంది. దాదాపు 33% మంది కుర్రాళ్లు ఇంట్లో కీలక నిర్ణయాలు కేవలం మగవారే తీసుకోవాలని అభిప్రాయపడటం నేటి కాలంలో ఒక విచిత్రమైన ధోరణిగా కనిపిస్తోంది.

సక్సెస్‌ఫుల్ భార్య కావాలి.. కానీ లోకువగా ఉండాలి:

ప్రస్తుత కుర్రాళ్లలో ఒక వింతైన డ్యూయాలిటీ కనిపిస్తోంది. కెరీర్‌లో దూసుకుపోయే, ఆర్థికంగా బలంగా ఉన్న మహిళలంటే 41% మంది అబ్బాయిలకు చాలా ఇష్టం. కానీ, అదే సమయంలో ఆ మహిళలు అతిగా ఇండిపెండెంట్‌గా ఉంటే మాత్రం వీరు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఆఫీసులో మేడమ్‌లా ఉండాలి కానీ, ఇంట్లో మాత్రం భర్త మాటకు ఎదురు చెప్పకూడదనే వింత కోరిక వీరిది. ఇక మగతనం అంటే కండలు ఉండాలి, అస్సలు ఏడవకూడదు అనే పాతకాలపు భావజాలం ఇంకా 43% మందిలో బలంగా ఉంది. ఇక కనీసం తన మగ స్నేహితులతో ఎమోషన్స్ పంచుకోవడం కూడా వీరికి ఇబ్బందిగానే ఉంది. ఈ రకమైన కఠినమైన ఆలోచనలే నేటి కాలంలో పెళ్లిళ్లు ఆలస్యం కావడానికి లేదా పెటాకులు కావడానికి ప్రధాన కారణమవుతున్నాయని సర్వే స్పష్టం చేస్తోంది.

పిల్లల పెంపకం మరియు ఇంటి పనులు:

సాధారణంగా ఈ తరం అబ్బాయిలు ఇంటి పనుల్లో సాయం చేస్తారని మనం భావిస్తాం. అయితే 21% మంది జెన్ జీ యువకులు పిల్లలను చూసుకునే మగాళ్లకు మగతనం తక్కువని భావిస్తున్నారట. ఇది పాత తరం వారి ఆలోచనల కంటే దారుణంగా ఉంది. అంటే వంట చేయడం, పిల్లలను ఆడించడం వంటివి కేవలం ఆడవారి పనులే అన్నట్లుగా వీరు ఫిక్స్ అయిపోతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో సమానత్వం గురించి వింటున్నా, లోలోపల మాత్రం పాత సామాజిక నిబంధనల నుంచి వీరు బయటపడలేకపోతున్నారు. ఇక ఈ ఇలాంటీ ఆలోచనల వల్ల అటు అమ్మాయిలకే కాకుండా, అబ్బాయిలు కూడా తమ చుట్టూ తామే ఒక గీత గీసుకుని బంధీలు అవుతున్నారు. ఈ పాతకాలపు ఆలోచనలతో కొత్త తరం అమ్మాయిలను మెప్పించడం వీరికి కత్తి మీద సామే అని చెప్పాలి. అటు ఈ నిర్ణయాలను అమ్మాయిలు అంగీకరిస్తారా అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.