ఐఫోన్ క్రేజ్‌లో చిక్కి చితికిపోతోన్న యువత
ప్రతి తరం తమ ఉనికిని, సమాజంలో తమ గుర్తింపును చాటుకోవడానికి కొన్ని చిహ్నాలను వెతుకుతుంది.
By: A.N.Kumar | 16 Sept 2025 5:00 PM ISTప్రతి తరం తమ ఉనికిని, సమాజంలో తమ గుర్తింపును చాటుకోవడానికి కొన్ని చిహ్నాలను వెతుకుతుంది. ఒకప్పుడు అది బట్టలు, ఖరీదైన గడియారాలు, బైక్‌లు లాంటి వాటి రూపంలో ఉండేది. కానీ నేటి యువతకు, ముఖ్యంగా జెన్ జెడ్ (Gen Z) యువతకు, ఆ గుర్తింపు గాడ్జెట్‌ల రూపంలో మారిపోయింది. ఈ క్రమంలో ఐఫోన్ ఒక సాధారణ కమ్యూనికేషన్ పరికరం స్థాయిని దాటి, ఒక స్టేటస్ సింబల్ గా రూపాంతరం చెందింది.
భారతదేశంలో గత పదేళ్లలో ఐఫోన్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇది కేవలం ఫోన్ మాత్రమే కాదు... ఒక సామాజిక హోదాకు నిదర్శనంగా మారింది. తమ స్నేహితుల మధ్య వెనుకబడిపోకుండా ఉండటానికి.. సమాజంలో “ఫిట్ ఇన్” కావడానికి, చాలామంది యువత కొత్త ఐఫోన్ మోడల్‌ను కొనుగోలు చేయడమే తమ గౌరవంగా భావిస్తున్నారు. ఈ కారణంగా యువత ప్రమాదకరమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
* ఆర్థిక ఒత్తిడి.. ప్రమాదకరమైన ఫలితాలు
తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ.. యువత నెలల తరబడి భారీ ఈఎంఐ (EMI)లు కట్టడానికి సిద్ధపడుతున్నారు. కొందరు తమ సామర్థ్యానికి మించి డబ్బు ఖర్చు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. టీనేజర్లు తమ తల్లిదండ్రులపై ఐఫోన్ కొనివ్వమని అతి ఒత్తిడి తెస్తున్నారు, వారి ఆర్థిక పరిమితులను పట్టించుకోవడం లేదు. ఐఫోన్ కొనివ్వలేదని నిరాశతో ఆత్మహత్యలు, లేదా ఇతర ప్రమాదకర చర్యలకు పాల్పడిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ క్రేజ్ దొంగతనాలు, మోసాలు, విలువైన వస్తువులను అమ్మి ఫోన్ కొనే ప్రయత్నాలకు దారితీస్తోంది. ఇది యువత భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది.
సోషల్ మీడియా ప్రభావం
సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్లు, సినీ తారలు, ప్రముఖులు ఐఫోన్‌ను ఒక విజయానికి చిహ్నంగా ప్రదర్శించడం వల్ల, యువతలో ఈ భావన మరింత బలపడుతోంది. ఫోన్ మోడల్ మారినప్పుడల్లా తమ ఫోన్లను ప్రదర్శించడం, కొత్త ఫీచర్లను చూపించడం అనేది యువతలో ఒక ఆరాధన భావాన్ని కల్పిస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?
ఆర్థిక అవగాహన అవసరం. యువతకు డబ్బు విలువ, పొదుపు, బాధ్యతాయుతమైన ఖర్చుల గురించి నేర్పించడం చాలా ముఖ్యం. తమ సంపాదనకు మించి ఖర్చు చేయకూడదని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం. పిల్లలకు కేవలం కోరికల కోసం కాకుండా, జీవితానికి అవసరమైన సరైన విలువలు, బాధ్యతను నేర్పించాలి. అవసరం, ఆడంబరం మధ్య తేడాను స్పష్టంగా వివరించాలి.
మార్కెటింగ్ హైప్‌ను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఫోన్ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి ఉపయోగించే వ్యూహాలను యువత అర్థం చేసుకోవాలి. ఒక ఫోన్ అనేది కేవలం ఒక సాధనం మాత్రమే, అది వ్యక్తిత్వాన్ని లేదా గౌరవాన్ని నిర్ణయించదు అనే విషయాన్ని గ్రహించాలి.
ఐఫోన్ నిస్సందేహంగా ఒక ప్రపంచ స్థాయి ఉత్పత్తి. దాని నాణ్యత, సాంకేతికత అద్భుతమైనవి. అయితే అది యువత జీవన విధానాన్ని, విలువలను నిర్వచించే స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం. నిజమైన విజయం అనేది ఖరీదైన ఫోన్‌తో రాదు, కష్టపడి సాధించుకున్న అవకాశాలు, కలలు, నైపుణ్యాలతో వస్తుంది. యువత తమ భవిష్యత్తు కోసం ఆలోచించాలి, ఫోన్ కోసం కాదు, తమ స్వప్నాల కోసం కష్టపడితేనే నిజమైన విజయం సాధ్యమవుతుంది.
