ఏఐతో రోజుకు గంట ఆదా.. తాజా సర్వే చెప్పింది ఇదే
ఇంటా బయటా మాత్రమే కాదు.. సగటు మనిషి జీవితంలోకి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) దూసుకొచ్చిన వైనం తెలిసిందే.
By: Garuda Media | 15 Sept 2025 10:00 AM ISTఇంటా బయటా మాత్రమే కాదు.. సగటు మనిషి జీవితంలోకి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) దూసుకొచ్చిన వైనం తెలిసిందే. అన్నీ అంశాల్లోనూ ఏఐ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. పని ప్రదేశాల్లో ఏఐ వినియోగం ఇప్పుడు ఎక్కువైంది. ప్రతి విషయానికి ఏఐ మీద ఆధారపడుతున్నారు. దీనికి తగ్గట్లే.. ఆఫీసులో రోజువారీ చేసే పనుల్ని మరింత సులువుగా చేసేందుకు అందుబాటులోకి పలు ఏఐ టూల్స్ రావటంతో ఆఫీసుల్లో పని తగ్గింది.
ఇదే విషయాన్ని తాజాగా నిర్వహించిన సర్వేలో ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూపు పేర్కొంది. అంతేకాదు.. ఈ సర్వే సందర్భంగా ఏఐ పుణ్యమా అని.. ఆఫీసుల్లో పని దాదాపు గంట వరకు ఆదా అవుతుందన్న విషయాన్ని వెల్లడించింది. ఏఐని అందిపుచ్చుకొని వేగంగా పనులు చేసే విషయంలో జెన్ జెడ్ (జనరేషన్ జెడ్) వాళ్లు దూసుకెళుతున్నట్లుగా రిపోర్టు వెల్లడించింది. 1997-2012 మధ్య జన్మించిన వారిని జెన్ జడ్ గా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. అమెరికా.. బ్రిటన్ లోని రెండు వేల మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు.
ఏఐ కారణంగా తాము చాలా ప్రయోజనం పొందుతున్నట్లుగా సర్వేలో పాల్గొన్న వారిలో 86 శాతం మంది పేర్కొనటం గమనార్హం. అంతేకాదు.. తమ పదోన్నతుల్లో ఏఐ కీలకపాత్ర పోషిస్తున్న విషయాన్ని 76 శాతం మంది పేర్కొన్నారు. జెడ్ జెన్ లో 87 శాతం మంది ప్రమోషన్లకు ఏఐ కారణంగా పేర్కొన్నారు. అందివచ్చిన ఏఐను వినియోగిస్తున్న జెడ్ జెన్ లు.. మరో పని కూడా చేస్తున్నారు. పాతతరం వారికి ఏఐను ఎలా వినియోగించుకోవాలన్న విషయాల్ని నేర్పటంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఈ సర్వే గుర్తించింది.
మీటింగ్స్ కు ప్రిపేర్ కావటం.. ఈమొయిల్స్ .. ఫైళ్ల నిర్వహణ.. ఇలా రోజువారీ పనుల్ని సైతం ఏఐ సాయంతో మరింత సులువుగా పూర్తి చేసే పనిలో జెడ్ జెన్ లు ఉన్నారు. ఏఐ కారణంగా వీరి పనిలో రోజుకు 55 నిమిషాలు ఆదా అవుతున్నట్లుగా గుర్తించారు. ఏఐ టూల్స్ కారణంగా ఒకసారి చేసిన పనుల్ని మళ్లీ చేయాల్సిన అవసరం లేకుండా పోతుందని.. కొత్త అంశాలపై ఫోకస్ పెట్టేందుకు సాయం చేస్తున్నట్లుగా సర్వే వెల్లడించింది. ఏఐ హవా నేపథ్యంలో దానిపై ఇట్టే పట్టు సాధిస్తున్న జెడ్ జెన్ లు కంపెనీలకు ఆయుధాలుగా మారుతున్నారు. వారి సాయంతో ఏఐను మరింతగా అందిపుచ్చుకోవటమే కాదు.. సీనియర్లను కూడా సిద్దం చేయటం ద్వారా.. పాతతరం.. కొత్తతరం కలిసి అధిక ఉత్పత్తిని పెంచటంలో సాయం చేస్తున్నట్లుగా సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది పేర్కొనటం గమనార్హం.
