గాయపడ్డ గాజాలో .... సామూహిక పెళ్ళి బాజాలు....
యుద్ధంలో ఘోరంగా దెబ్దతిన్న ఖాన్ యూనస్ లో మంగళవారం 54 జంటలు ఒక్కటయ్యాయి.
By: Tupaki Political Desk | 3 Dec 2025 12:10 PM ISTయుద్ధగాయాలతో అతలాకుతలమై పెను విషాదంలో కూరుకుపోయిన గాజాలో ఇపుడు పెళ్ళి బాజాలు వినిపిస్తున్నాయి. పాత గాయాలను మరచి కొత్త జీవితాన్ని అందుకునే దిశగా కొత్త జంటలు ఏడడుగులు నడిచాయి. ఇజ్రయిల్ దాడుల్లో దారుణంగా దెబ్బతిన్న గాజాలో ప్రజలు దాదాపు చితికి పోయారు. యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో...మనిషి జీవనానికి శాంతి ఎంత అవసరమో గాజా ప్రజల్ని ఒక్కసారి అడగండి చెబుతారు. అయితే జీవితం ఎల్లప్పుడు ఒకేలా ఉండదు. ఉండాల్సిన అవసరం లేదు. కాలం గడుస్తున్న కొద్ది గాయాలు పాతపడిపోతుంటాయి. జీవితం కొత్త ఆశల్ని రేకెత్తిస్తుంటుంది. గాజా ప్రజల ప్రస్తుత మనస్థితి ఇంతే.
యుద్ధంలో ఘోరంగా దెబ్దతిన్న ఖాన్ యూనస్ లో మంగళవారం 54 జంటలు ఒక్కటయ్యాయి. యుద్ధం నేపథ్యంలో ఇంతవరకు ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఇపుడు మళ్ళీ మొదలయ్యాయి. ఇజ్రయెల్ హమాస్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నందున పెళ్లి వేడుకలు ఊపందుకున్నాయి. ఈ సామూహిక వివాహాలకు యూఏఈ మద్దతు ఉన్న ఆల్ ఫారెస్ ఆల్ షాహిమ్ నిధులు సమకూర్చింది. కొత్త జంటలకు డబ్బుతోపాటు కాపురానికి కావల్సిన అత్యవసర సామగ్రిని అందించారు. పాలస్తీనియన్లు పెళ్ళిళ్ళకు చాలా ప్రాధాన్యమిస్తారు. ఈ వేడుకల్ని వారు చాలా సుదీర్ఘంగా రోజులు తరబడి జరుపుకొంటారు. మన పెళ్లిళ్ళలో జరిపినట్లే సంగీత్ నృత్యాలు అక్కడా ఉంటాయి. వధూవరుల్ని చాలా ఆడంబరంగా వీధుల వెంబడి ఊరేగిస్తారు. పెళ్ళి మరపురాని మధుర స్మృతిగా మలచుకోడానికి పాలస్తీనియన్లు ఇష్టపడతారు.
మంగళవారం పెళ్ళి వేడుకల్లో భాగంగా నూతన వధూవరుల్ని కార్లలో కూర్చోబెట్టి వీధుల్లో ఊరేగించారు. యుద్ధంలో ఘోరంగా దెబ్బతిన్న భవనాల ముందు వేడుక సాగడం చాలా వింతగా కనిపించింది. కళ్ళెదుటే యుద్ధ మౌనసాక్ష్యంగా నిలుచున్న శిథిల భవనాలను దాటుకుంటూ మరో ఆనందమయ జీవనం కోసం ప్రజలు ఆశించడం వారిలోని సానుకూల దృక్పథానికి నిలువెత్తు దర్పణంగా నిలుస్తోంది. ఈ ఊరేగింపులో డాన్స్ లు ఆనందపు కేరింతలు తుళ్ళింతలతో నగరం రోడ్లు వింతశోభను సంతరించుకున్నాయి. వైట్ రెడ్ గ్రీన్ దుస్తుల్లో మెరిసిపోతున్న ఇమాన్ మాట్లాడుతూ...ఈ పెళ్ళి తమకు ఎంతో ఊరటను కాసింత ఆనందాన్ని, జీవితంపై నమ్మకాన్ని ఇచ్చిందని ఆమె నవ్వుతూ అన్నారు. అయితే యుద్దంలో ఆమె తలిదండ్రులు,కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుని అనాథగా మిగిలింది. చాలా కాలం తర్వాత ఆమె కళ్ళలో మెరుపులు, భవిష్యత్తుపై ఆశ కనిపించాయి. ఒక పెను విషాదం తర్వాత ఆనందాన్ని అనుభవించడం కూడా చాలా కష్టం అంది. అంతా దైవేచ్చ మళ్ళీ జీవితాన్ని ఇటుక ఇటుకగా పేర్చుకుంటూ కొత్తగా కట్టుకోవాలి అంటూ నిట్టూర్చింది ఇమాన్ హుస్సేన్.
