Begin typing your search above and press return to search.

గాజా బిడ్డకు 'సింగపూర్' పేరు... కారణం వెనుక విషాద గాథ!

వివరాళ్లోకి వెళ్తే... హమాస్ తో యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ దెబ్బకు గాజా గజగజ వణికిపోయిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   22 Oct 2025 11:28 AM IST
గాజా బిడ్డకు సింగపూర్ పేరు... కారణం వెనుక విషాద గాథ!
X

ఈ రోజుల్లో కృతజ్ఞత కలిగి ఉండే జానాలు బాగా తగ్గిపోయారని.. చాలా మందికి అలాంటి ఆలోచన ఉండదనే మాటలు వినిపిస్తున్నాయి! అయితే మరికొంతమందికి మాత్రం పొందిన సాయంపట్ల, చేసినవారి పట్ల ఎంతో కృతజ్ఞత ఉంటుందని.. వారు ఆ సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని అంటారు. అలాంటి వ్యక్తే గాజాకు చెందిన హమ్దాన్‌. తాజాగా హమ్దాన్‌, ఆయన భార్య తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది.

అవును... ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన భీకర దాడులతో గాజా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఐడీఎఫ్ చేసిన దాడులతో గాజా ప్రజల బ్రతుకులు అల్లకల్లోలం అయిపోయాయి. తినడానికి తిండి లేక వేల మంది పాలస్థీనియన్లు స్వచ్ఛంద సంస్థల సాయం కోసం చేతిలో పాత్రలు పట్టుకుని, రోడ్లపై నిలుచున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. కొన్ని సందర్భాల్లో ఆ సాయం కూడా అందేది కాదు!

అలాంటి పరిస్థితుల్లో తన భార్య గర్భవతిగా ఉందని.. ఆ సమయంలో సింగపూర్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ తమను ఆదుకుందనే కృతజ్ఞతతో తమ బిడ్డకు 'సింగపూర్' అని పేరు పెట్టారు గాజాలోని ఓ దంపతులు!

వివరాళ్లోకి వెళ్తే... హమాస్ తో యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ దెబ్బకు గాజా గజగజ వణికిపోయిన సంగతి తెలిసిందే. గాజాలో ఎటు చూసినా కాంక్రీట్ శిధిలాలు, ప్రజల ఆర్ధనాధాలు, ఆకలి కేకలు, ఆస్పత్రుల నిండా జనాలతో ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో సింగపూర్‌ కు చెందిన గిల్బర్ట్ గో అనే సామాజిక కార్యకర్త ఆధ్వర్యంలోని 'లవ్ ఎయిడ్ సింగపూర్' అనే స్వచ్ఛంద సంస్థ గాజాలో సేవలందించింది.

ఇందులో భాగంగా... పాలస్తీనీయులకు ఉచితంగా ఆహారం అందజేసింది. ఆ సమయంలో హమ్దాన్‌ హదాద్‌ అనే స్థానికుడు ఆ కిచెన్ లో రెండేళ్లపాటు వంటమనిషిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె భార్య గర్భవతిగా ఉన్నారు. అయితే.. ఇటీవల ఆ దంపతులకు ఓ పాప జన్మించింది. సంక్షోభ సమయంలో తమకు అండగా నిలిచిన దేశాన్ని గౌరవించేందుకు బిడ్డకు 'సింగపూర్' అని పేరు పెట్టారు.

ఈ సందర్భంగా స్పందించిన హమ్దాన్‌.. తన భార్య గర్భధారణ సమయంలో పోషణ కోసం ఆ సంస్థ పెట్టే ఆహారం మీదే ఆధారపడి ఉండేదని.. ఆహార కొరత, కరవు పరిస్థితులు నెలకొన్న సమయంలో తన కుటుంబాన్ని సదరు సింగపూర్‌ సంస్థే ఆదుకుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వీడియోను 'లవ్‌ ఎయిడ్‌ సింగపూర్’ సంస్థ ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది.

ఈ సందర్భంగా స్పందించిన లవ్ ఎయిడ్ సింగపూర్ సంస్థ... ఓ పాలస్తీనా శిశువుకు 'సింగపూర్‌' అని పేరు పెట్టడం ఇదే మొదటిసారని తెలిపింది. ఆ పాప మంచి ఆరోగ్యంతో ఎదగాలని ఆకాంక్షించింది. ఆ పేరును ధృవీకరించడానికి ఆమె జనన ధృవీకరణ పత్రం ఫోటోను షేర్ చేసింది. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ ద్వారా గుర్తించబడిన కొత్త ప్రపంచంలో ఆమె పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ విషయం నెట్టింట వైరల్‌ గా మారింది. నెటిజన్లు ఆ చిన్నారికి, సదరు సింగపూర్ సంస్థకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్నారి ఉన్నతంగా ఎదగాలని కోరుకున్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా సింగపూర్‌ ను సందర్శించాలని, తాము సాదరంగా స్వాగతిస్తామని ఓ నెటిజన్‌ పేర్కొన్నారు.