హమాస్ - ఇజ్రాయెల్ మధ్యలో ట్రంప్.. ఆదివారం ఇదే హాట్ టాపిక్!
సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్న గాజా యుద్ధం ముగిసేలా కనిపిస్తోంది. ప్రధానంగా... ఈ యుద్ధం ఆపడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక స్టెప్ తీసుకున్నారు.
By: Raja Ch | 5 Oct 2025 12:07 PM ISTసుమారు రెండేళ్లుగా కొనసాగుతున్న గాజా యుద్ధం ముగిసేలా కనిపిస్తోంది. ప్రధానంగా... ఈ యుద్ధం ఆపడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక స్టెప్ తీసుకున్నారు. ఇందులో భాగంగా... ఇటీవల 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. అయితే... దీనికి హమాస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. తమ చెరలో ఉన్న బందీల విడుదల చేస్తామని ప్రకటించింది.
అవును... ఇజ్రాయెల్ దాడుల నుంచి హమాస్ కు ఉపశమనం కలిగించే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించింది. ఈ సమయంలో వారికి ట్రంప్ డెడ్ లైన్ విధించారు. ఇందులో భాగంగా... అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు.
ఆలస్యాన్ని సహించేది లేదు!:
గాజా యుద్ధం ముగింపు వ్యవహారంలో హమాస్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఒత్తిడిని తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం విషయంలో వేగంగా నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హమాస్ ను ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయంలో ఆలస్యాన్ని ఏమాత్రం సహించేదే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ కు ట్రంప్ అభినందనలు!:
గాజా యుద్ధం ముగింపు వ్యవహారంలో హమాస్ కు డెడ్ లైన్ విధించి ఘాటు హెచ్చరికలు చేసిన ట్రంప్.. మరోవైపు ఇజ్రాయెల్ ను అభినందించారు. ఇందులో భాగంగా... బందీల విడుదల, శాంతి ఒప్పందం కోసం గాజాలో దాడులను తాత్కాలికంగా నిలిపేసిందని పేర్కొంటూ ఇజ్రాయెల్ కు ట్రంప్ అభినందనలు తెలిపారు.
తాజాగా ట్రూత్ సోషల్ లో పోస్టు పెట్టారు ట్రంప్. ఇందులో భాగంగా... ప్రణాళికలోని తొలిదశలో భాగంగా గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని తెలిపారు. దీన్ని హమాస్ కు కూడా పంపించినట్లు వెల్లడించారు. హమాస్ కూడా దీన్ని అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్నారు. దీంతో ఇజ్రాయెల్ - హమాస్ మధ్య బందీలు, ఖైదీల అప్పగింత ప్రారంభమవుతుందన్నారు.
ఇజ్రాయెల్ నుంచి అధికారిక ప్రకటన లేదు, పని ఆగలేదు!;
గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ... దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు! మరోవైపు శనివారం సైతం గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయని.. ఈ దాడుల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఫస్ట్ అగ్రిమెంట్ ఇదే!:
ట్రంప్ ప్రణాళిక ప్రకారం.. హమాస్ తమ దగ్గర మిగిలి ఉన్న 48 బందీలనూ మూడు రోజుల్లో విడుదల చేయాలి. అయితే వీరిలో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో... గాజాపై తన నియంత్రణను వదులుకోవడంతో పాటు.. ఆయుధాలనూ త్యజించాలి. ఇందుకు బదులుగా ఇజ్రాయెల్ తన దాడులను ఆపుతుంది.
అనంతరం తన దళాలను గాజా నుంచి ఉపసంహరించుకుంటుంది. తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిచిపెడుతుంది. అదేవిధంగా... గాజాకు మానవతా సాయం వెళ్లేందుకు అనుమతిస్తుంది. కాగా... గాజా శాంతి విషయంలో నిర్ణయాత్మక పురోగతి సాధించిన ట్రంప్ నాయకత్వాన్ని భారత ప్రధాని మోడీ అభినందించారు.
ఇజ్రాయెల్ ప్రజలకు నెతన్యాహు హామీ!:
ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇందులో భాగంగా... హమాస్ ను నిరాయుధీకరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఏదిఏమైనా... గాజాపై యుద్ధంలో త్వరలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందని.. హమాస్ వద్ద ఉన్న తమ పౌరులు విడుదలై తిరిగి తమ దేశానికి చేరుకుంటారని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.
