ఎన్నికల్లో గెలిచిన గౌరీ లంకేశ్ హత్యకేసు నిందితుడు.. వీడియో!
2017లో జరిగిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగర్కర్ జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
By: Raja Ch | 17 Jan 2026 5:00 AM IST2017లో జరిగిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగర్కర్ జల్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈ సందర్భంగా ఫలితాలు వెలువడిన వెంటనే తన మద్దతుదారులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. పంగర్కర్.. వార్డ్ 13 స్థానాన్ని 2,621 ఓట్ల తేడాతో గెలుచుకుని.. బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులను ఓడించారు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఆ వార్డులో అభ్యర్థిని నిలబెట్టకపోవడం కలిసొచ్చిందని అంటున్నారు!
అవును... సంచలనం సృష్టించిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యకేసు నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ హత్యకు సంబంధించిన క్రిమినల్ కేసు విచారణలో ఉన్నప్పటికీ పంగర్కర్ విజయం సాధించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... తనపై ఇప్పటివరకు ఎటువంటి దోష నిర్ధారణ జరగలేదని, చట్టపరమైన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని నొక్కి చెప్పారు. ఇది ఎన్నికల రాజకీయాల్లో నిందితుల ఉనికిపై చర్చకు దారితీసింది.
కాగా... 2001 - 2006 మధ్య శివసేన నుండి జల్నా మున్సిపల్ కౌన్సిల్ లో కార్పొరేటర్ గా పనిచేసిన పంగర్కర్ కు 2011లో టికెట్ నిరాకరించబడటంతో.. రైట్ వింగ్ హిందూ జనజాగృతి సమితిలో చేరారు. ఈ క్రమంలో.. ఆగస్టు 2018లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ముడి బాంబులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న తర్వాత మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం అతన్ని అరెస్టు చేసింది. అతనిపై పేలుడు పదార్థాల చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయబడ్డాయి.
అనంతరం... నవంబర్ 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో కొంతకాలం ఉన్నారు పంగర్కర్. అయితే... విస్తృత విమర్శల నేపథ్యంలో షిండే అతని చేరికను పార్టీలోకి నిలిపివేశారు.
గౌరీ లంకేష్ కేసు నేపథ్యం!:
జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త అయిన గౌరీ లంకేష్.. సెప్టెంబర్ 5, 2017న కర్ణాటకలోని బెంగళూరులో తన ఇంటి బయట కాల్చి చంపబడ్డారు! ఈ హత్య దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇదే సమయంలో.. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, రాజకీయ అసహనంపై విస్తృత చర్చకు దారితీసింది. ఈ క్రమంలో... ఈ కేసులో పంగర్కర్ ను నిందితుడిగా చేర్చారు. సెప్టెంబర్ 4, 2024న కర్ణాటక హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.
