Begin typing your search above and press return to search.

వార్ వేళ గ్యాస్ కొరత ఏమో కానీ ఉద్యోగులకు వర్కు ఫ్రం హోం

వార్ దెబ్బకు వంటగ్యాస్ సమస్య అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే పలు నగరాలు.. మహానగరాల్లో టిఫిన్ సెంటర్లు.. హోటళ్లు.. రెస్టారెంట్లు మూసివేసిన పరిస్థితి.

By:  Garuda Media   |   13 March 2026 10:50 AM IST
వార్ వేళ గ్యాస్ కొరత ఏమో కానీ ఉద్యోగులకు వర్కు ఫ్రం హోం
X

వార్ దెబ్బకు వంటగ్యాస్ సమస్య అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే పలు నగరాలు.. మహానగరాల్లో టిఫిన్ సెంటర్లు.. హోటళ్లు.. రెస్టారెంట్లు మూసివేసిన పరిస్థితి. ఇక.. హాస్టళ్లు.. క్యాంటీన్లు మీదా గ్యాస్ కొరత పెద్ద సమస్యగా మారింది. దీంతో.. ఇప్పటివరకు ఎదురుకాని సరికొత్త ఇబ్బందులు తెర మీదకు వస్తున్నాయి. పలు ఐటీ ఆఫీసులతో పాటు.. ఇతర కార్యాలయాల్లో అందించే భోజన వసతిని గ్యాస్ కొరత నేపథ్యంలో నిలిపి వేస్తున్నారు. ఇంటి నుంచే ఫుడ్ తీసుకురావాలని చెబుతున్నాయి. అంతేకాదు ఇంధనాన్ని ఆదా చేసుకోవటానికి వీలుగా ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని కంపెనీలు కోరుతున్నాయి.

దీంతో కరోనా తర్వాత కంపెనీలు తమకు తాముగా ఇంటి నుంచి పని చేసే విధానాన్ని ప్రోత్సహిస్తున్న తొలి సందర్భంగా చెప్పాలి. వాణిజ్య గ్యాస్ లభించని కారణంగా పలువురు క్యాంటీన్ వెండర్లు సేవలు నిలిపివేశారని.. దీంతో ఉద్యోగులకు వర్కు ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించినట్లుగా చెబుతున్నారు. దేశంలోనే రెండో అతి పెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సైతం.. తమ బెంగళూరు.. చెన్నై ఆఫీసుల్లో వాణిజ్య గ్యాస్ కొరత కారణంగా క్యాంటీన్ లో తక్కువ ఫుడ్ ఐటెమ్స్ లభిస్తాయని స్పష్టం చేసింది.

ఇక హెచ్ సీఎల్ విషయానికి వస్తే ఆఫీసుల్లో లైవ్ కౌంటర్లను నిలిపివేసిన సంస్థ.. ఉద్యోగులు ఇంటి నుంచే తమ ఫుడ్ తెచ్చుకోవాలని కోరింది. ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ కొరత కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఇన్ఫోసిస్.. హెచ్ సీఎల్ రెండు సంస్థల్లోనే దాదాపు 5.5 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్న పరిస్థితి. వేలాది మంది ఉద్యోగులు రోజూ సదూర ప్రాంతాల నుంచి ఆఫీసులకు రావటం ద్వారా పెద్ద ఎత్తున ఇంధన వినియోగానికి కారణమవుతుంది. ఈ కారణంగా వర్కు ఫ్రం హోంకు అవకాశం ఇస్తే.. ఇంధన పొదుపునకు కారణమవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీల నిర్వాహణకు మాత్రమే కాదు.. ఇంధనాన్ని ఎవరికి వారు బాధ్యతగా పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. అందుకు సంస్థలు వీలైనంతవరకు ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని కోరుతున్నట్లు చెబుతున్నారు.