Begin typing your search above and press return to search.

కోనసీమలో గ్యాస్ పేలుడు.. 30 ఏళ్ల నాటి బ్లోఅవుట్ గుర్తు చేసిన ప్రమాదం

అంబేద్కర్ కోనసీమ జిల్లా మకిలిపురం మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ లీకుతో భారీగా మంటలు చెలరేగాయి.

By:  Tupaki Political Desk   |   5 Jan 2026 6:04 PM IST
కోనసీమలో గ్యాస్ పేలుడు.. 30 ఏళ్ల నాటి బ్లోఅవుట్ గుర్తు చేసిన ప్రమాదం
X

అంబేద్కర్ కోనసీమ జిల్లా మకిలిపురం మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ లీకుతో భారీగా మంటలు చెలరేగాయి. ఇరుసుమండ అనే గ్రామంలో గ్యాస్ పైపు లైన్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ బటయకు తన్నుకు వచ్చింది. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తొలుత భారీ శబ్దంతో పేలుడు సంభవించడం, ఆ తర్వాత మంటలు చెలరేగి పొగ కమ్ముకోవడంతో గ్రామస్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ భారీ ప్రమాదం 30 ఏళ్ల క్రితం సంభవించిన పాసర్లపూడి బ్లోఅవుట్ ను గుర్తు చేస్తోందని అంటున్నారు.

సంక్రాంతి పండుగ ముందు కోనసీమలో ఇలాంటి ప్రమాదం జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. నాలుగైదు గంటలుగా అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్జీసీ ఉద్యోగులు శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 500 వరకు కొబ్బరి చెట్లు కాలి బూడిదైనట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. మంటల తీవ్రత గమనిస్తే ఇప్పుడప్పుడే అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్న అంచనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం కూడా ఇదే ప్రాంతంలో పాసర్లపూడి బ్లో అవుట్ కారణంగా మంటలు చెలరేగి వారాల తరబడి చల్లారలేదు.

ఇప్పుడు ప్రమాదం ఆ స్థాయిలో లేకపోయినా, మంటల కారణంగా జరిగిన నష్టం ఆవేదన గుర్తించేస్తోందని చెబుతున్నారు. గ్యాస్ లీకై మంటలు చెలరేగడం, ఒక పట్టాన అదుపులోకి రావడం లేదన్న సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంటల కారణంగా పెద్ద ఎత్తున పొగ కమ్మేయడంతో స్థానికులు అందరికీ మాస్కులు సరఫరా చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

కాగా, గత ఏడాది ఇదే గ్రామంలో పైపు లైన్ లీకైందని స్థానికులు చెబుతున్నారు. తరచూ గ్యాస్ లీకవుతున్న ఘటనలు నమోదు అవుతున్నా, ఓఎన్జీసీ నిర్లక్ష్యం వహించదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ లీకు కారణంగా ఎప్పటికైనా పెద్దప్రమాదం పొంచి ఉన్నట్లేనంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ విస్తృతంగా ప్రయత్నిస్తోంది. సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపింది. ముందస్తు జాగ్రత్తగా గ్రామం ఖాళీ చేయాల్సిందిగా స్థానికులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.