గ్యాస్ సిలిండర్ పోర్టబులిటీ.. అంటే ఏంటో తెలుసా?
గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సమస్యలను తీర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Political Desk | 29 Sept 2025 4:10 PM ISTగ్యాస్ సిలిండర్ వినియోగదారుల సమస్యలను తీర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. మొబైల్ ఫోన్ నెంబర్ పోర్టబులిటీ మాదిరిగా గ్యాస్ కనెక్షన్లకు పోర్టబులిటీ సదుపాయం కల్పించాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. చాలా చోట్ల ఏజెన్సీ నిర్వాహకులతో వినియోగదారులకు సమస్యలు ఎదురవుతున్నాయి. సరైన సేవలు కల్పించలేకపోవడం, ఏజెన్సీలు సుదూరంగా ఉండటం వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఏజెన్సీని మార్చుకునే అవకాశం కల్పించి కొంత మేర ఇబ్బందులు తగ్గించింది. అయితే సమీపంలో ఒక గ్యాస్ ఏజెన్సీ ఉండగా, తమకు వేరే కంపెనీ గ్యాస్ కనెక్షన్ ఉండటం వల్ల ఇంకా చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఇబ్బందులను పరిష్కరించేలా గ్యాస్ సిలిండర్ పోర్టబులిటీ ప్రవేశపెట్టాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకు మీ వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే కంపెనీ లేదా ఏజెంట్ తో ఇబ్బందులు ఉంటే నచ్చిన ఏజెన్సీకి మారిపోయే సౌకర్యాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మొబైల్ ఫోన్ నంబరును నచ్చిన సర్వీసు ప్రొవైడర్ కు ఎలా మారవచ్చో అదేవిధంగా గ్యాస్ సరఫరాకు సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రస్తుతం దీనిపై వినియోగదారులు, భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతోంది. దీనికి సంబంధించి 2013లోనే పైలట్ ప్రాజెక్టుగా దేశంలోని 24 జిల్లాల్లో పోర్టబులిటీ సేవలను అమలు చేశారు.
ఆ తర్వాత 2014లో 14 రాష్ట్రాల్లోని 480 జిల్లాలకు గ్యాస్ పోర్టబులిటీని విస్తరించారు. అయితే ఈ పైలట్ ప్రాజెక్టుల ద్వారా గ్యాస్ ఏజెన్సీలను మార్చుకునే అవకాశం కల్పించారు కానీ, కంపెనీలను మార్చుకునే వెసులుబాటు ఇవ్వలేదు. అయితే ఇకపై ఏజెన్సీలతోపాటు కంపెనీలకు మార్చుకునే అవకాశం అందుబాటులోకి తేవాలని కేంద్ర పెట్రలోలియం, సహజ వాయువు నియంత్రణ బోర్డు తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే దేశవ్యాప్తంగా ఒకేసారి గ్యాస్ సిలిండర్ పోర్టుబులిటీ అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేస్తోంది.
గ్యాస్ పోర్టుబులిటీ సేవలు అందుబాటులోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులతోపాటు తరచూ బదిలీల వల్ల నివాసాలు మారే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో సేవల వల్ల లోపం ఉంటే వినియోగదారులు వారికి నచ్చిన ఏజెన్సీలు, కంపెనీలకు మారిపోయే సౌలభ్యం అందుబాటులో ఉండటం వల్ల గ్రాస్ కంపెనీ ఏజెన్సీలు వినియోగదారుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు. నిత్యావసర వస్తువైన గ్యాస్ సరఫరాలో సేవలలో లోపం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే పోర్టబులిటీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
