Begin typing your search above and press return to search.

అమెరికాలో భారత పోలీసులకు ఇదో అరుదైన గౌరవం

అమెరికా, భారతదేశం మధ్య సుంకాల వివాదం, ఇమ్మిగ్రేషన్ సమస్యలు కొనసాగుతున్నప్పటికీ.. ఒక హృద్యమైన ఘటన రెండు దేశాల మధ్య మానవీయ సంబంధాలను చాటిచెప్పింది.

By:  A.N.Kumar   |   25 Aug 2025 11:00 PM IST
అమెరికాలో భారత పోలీసులకు ఇదో అరుదైన గౌరవం
X

అమెరికా, భారతదేశం మధ్య సుంకాల వివాదం, ఇమ్మిగ్రేషన్ సమస్యలు కొనసాగుతున్నప్పటికీ.. ఒక హృద్యమైన ఘటన రెండు దేశాల మధ్య మానవీయ సంబంధాలను చాటిచెప్పింది. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన గార్నర్ పోలీసులు, భారతీయ పోలీసుల పనితీరును, ముఖ్యంగా ప్రజలతో వారు కలిగి ఉండే భావోద్వేగ అనుబంధాన్ని ప్రశంసిస్తూ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు విస్తృతంగా చర్చనీయాంశమైంది.

గార్నర్ పోలీసులు తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేస్తూ తమకు భారతీయ పోలీస్ అధికారి జయపాల్‌తో జరిగిన సంభాషణ గురించి వివరించారు. ఈ పోస్ట్ ఇలా సాగింది: “ఈ రోజు ఉదయం రిడ్జ్‌మూర్ ప్రాంతంలో గణేష్ గురించి తెలుసుకోవడం అద్భుతంగా అనిపించింది. ఆ కథతో పాటు, సమాజం తమ కుటుంబాలకు, ఒకరికొకరు చేసే సేవా భావం మనసును తాకింది.” అని పేర్కొన్నారు.

- ఒకరికొకరు సెల్యూట్.. ఆలింగనం..

జయపాల్ భారత పోలీస్‌ విభాగంలో 34 ఏళ్లు సేవలందించి 2024లో రిటైర్ అయ్యారు. గార్నర్ పోలీసులు ఆయనను కలవడం తమకు గౌరవంగా అనిపించిందని తెలిపారు. వారి సంభాషణలో రెండు దేశాల పోలీసు వ్యవస్థల మధ్య ఉన్న పోలికలు, తేడాలను జయపాల్ వివరించారు. సాంకేతికతతో కూడిన అమెరికా పోలీస్ వ్యవస్థతో పోలిస్తే, మానవ సంబంధాలకు, ప్రజలతో భావోద్వేగ అనుబంధానికి భారత పోలీసులు ఇచ్చే ప్రాధాన్యతను ఆయన వివరించారు. “మేము ఒకరినొకరు సెల్యూట్ చేసుకున్నాం, చేతులు కలిపాం, ఆలింగనం చేసుకున్నాం. సరిహద్దులు దాటి కూడా ఈ వృత్తి మమ్మల్ని కలిపేస్తుందనేది వినమ్ర అనుభూతి,” అని గార్నర్ పోలీసులు తమ పోస్ట్‌లో పేర్కొన్నారు.

-సామాజిక సేవలో భారత పోలీసులు

సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల పోలీస్ వ్యవస్థలు సాంకేతిక ఆధారితంగా, క్రమశిక్షణతో పనిచేస్తాయనే అభిప్రాయం ఉంటుంది. అయితే భారత పోలీసులు చట్టం, శాంతిభద్రతలకే పరిమితం కాకుండా సమాజంలో ఒక అంతర్భాగంగా ఉంటారు. విపత్తుల సమయంలో రక్షణ చర్యలు చేపట్టడం.. రక్తదానం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం.. సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో అనుబంధాన్ని పెంచుకోవడంలో భారత పోలీసుల పాత్ర కాదనలేనిది..

ఇలాంటి మానవీయ కోణాలను అమెరికా పోలీసులు గుర్తించి ప్రశంసించడం భారత పోలీస్ వ్యవస్థకు ఒక అరుదైన గౌరవం. అభివృద్ధి చెందిన దేశాల పోలీస్ వ్యవస్థ నుంచి ఇలాంటి ప్రశంస రావడం నిజంగా ఒక మైలురాయి. ఇది కేవలం రెండు దేశాల పోలీసుల మధ్య పరస్పర గౌరవాన్ని మాత్రమే కాకుండా.. అమెరికాలోని ప్రవాస భారతీయుల హక్కులను కాపాడటంలో భవిష్యత్తులో ఒక ఆశాకిరణంగా నిలిచిపోతుంది.

ఈ ఘటన ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పక్కన పెట్టి.. మానవ సంబంధాల ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేసింది.