గరికపాటికి కౌంటర్...అందులో తెలుగు లేదా ?
వింత పోకడలు వింత ఆలోచనలతో గరికపాటి మాట్లాడుతున్నారని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి మండిపడ్డారు.
By: Satya P | 3 March 2026 12:47 AM ISTప్రముఖ ప్రవచనకర్త ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రముఖుడు మహా సహస్రావధాని అయిన గరికపాటి నరసింహారావు తాజాగా చేసిన వ్యాఖ్యల మీద భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గరికపాటి మాటలను ఆయన తప్పు పట్టారు. గరికపాటి అధిక ప్రసంగాలు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇంతకీ గరికపాటి ఏమి అన్నారు దానికి భువనేశ్వరి పీఠాధిపతికి ఎందుకు అంత ఆగ్రహం వచ్చింది అంటే మ్యాటర్ కాస్తా సీరియస్ వ్యవహారమే అని అంటున్నారు.
తెలుగు నాడు అంటూ :
తాజాగా కోనసీమ జిల్లాలో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొన్న గరికపాటి వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరు బాగులేదని అందులో హిందీ వాసనలు ఉన్నాయని అందువల్ల తెలుగు నాడు పేరు పెట్టాలని సభా ముఖంగా ప్రభుత్వానికి ప్రతిపాదించారు తెలుగు భాషకు పట్టం కట్టాలీ అంటే రాష్ట్రం పేరులో తెలుగుదనం ఉండాలని ఆయన కోరారు. ఒక విధంగా గరికపాటి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనుకోవాలి. అయితే దానికి గట్టి కౌంటర్ ని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి ఇచ్చారు.
వింత పోకడలు అంటూ :
వింత పోకడలు వింత ఆలోచనలతో గరికపాటి మాట్లాడుతున్నారని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి మండిపడ్డారు. అడిగేవారు ఎవరూ లేరనే గరికపాటి అధిక ప్రసంగాలు చేస్తున్నారు అని ఆయన విమర్శించారు.
ఆంధ్ర ప్రదేశ్ అన్న పేరు ఉంటే ఏమిటి అభ్యంతరం అని ప్రశ్నించారు. దానిని తీసేసి తెలుగునాడు అని పేరు మార్చినా సెంటిమెంట్ కొత్తగా ఏమీ రాదని అన్నారు. ఇటువంటి మేధావులే ఏపీకి మద్రాస్ ని రాకుండా చేశారని కూడా కొత్త విమర్శలు చేశారు కమలానంద భారతి.
ఆయన అక్కడే :
ఇదిలా ఉంటే గరికపాటి తెలంగాణాలో సెటిల్ అయ్యారని కూడా కమలానంద భారతి చెప్పారు. ఆయన ఆంధ్రాకు రారని విమర్శించారు. మా ప్రాంతం మా బతుకులు ఎలా ఉండాలో మాకు బాగా తెలుసు అని కూడా ఆయన చెప్పడం విశేషం. మొత్తం మీద చూస్తే గరికపాటి అన్న మాటల మీద ప్రభుత్వ పెద్దల నుంచి భాషా ప్రేమికుల నుంచి అలాగే రాష్ట్ర అభిమానుల నుంచి పెద్దగా రియాక్షన్ అయితే రాలేదు. కానీ ఒక పీఠాధిపతి నుంచి ఈ తరహా ఘాటు విమర్శలు రావడం విశేషం. మరి దీనికి గరికపాటి నుంచి కూడా కౌంటర్ ఉండొచ్చా అన్నది చర్చ సాగుతోంది. ఇంతకీ చూస్తే ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లుగా ఒక ప్రతిపాదన ఆయన వ్యక్తం చేశారు. దాని మీద విమర్శలు వస్తున్నాయి అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకూ వెళ్తుందో.
