వరస గెలుపుల మంత్రం చెప్పిన గంటా !
ఇంతకీ ఆయన ఎక్కడ చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కీలక నేతలతో నిర్వహించిన రెండు రోజుల కాంక్లేవ్ లో గంటా మాట్లాడుతూ చెప్పిన విషయం అన్న మాట.
By: Satya P | 9 Sept 2026 6:37 AM ISTవరసగా ఎన్నికల్లో గెలవడం అన్నది ఒక కళ. అందులోనూ ఓటమి చెందకుండా గెలుపు బాటలో పయనించడం అంటే అది పెద్ద విద్య. ఈ విషయంలో విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సిద్ధ హస్తులు. ఒక విధంగా చెప్పాలీ అంటే మాస్టర్ డిగ్రీ చేశారు. ఆయన రాజకీయ జీవితం దాదాపుగా మూడు దశాబ్దాలు. అయితే ఒక్క ఎన్నికల్లోనూ గంటా ఓటమి పాలు కాలేదు, అంతే కాదు ఆయన ఎక్కడ పోటీ చేసినా విజయం ఖాయం చేసుకున్నారు. అలా ఒకసారి ఎంపీ అయిదు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచారు. నిజానికి రాజకీయాల్లో ఎంతో మందికి ఓటమి పలుకరించింది. ఓటమి తెలియని వారు ఎవరూ లేరు. కానీ గంటా లాంటి అతి కొద్ది మందికి మాత్రమే ఇది సాధ్యమైంది అంటే ఎలా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో ఉంది. అయితే తన గెలుపు మంత్రం ఏంటో గంటావే స్వయంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆయన ఎక్కడ చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కీలక నేతలతో నిర్వహించిన రెండు రోజుల కాంక్లేవ్ లో గంటా మాట్లాడుతూ చెప్పిన విషయం అన్న మాట.
గెలుపు వ్యూహమంటే :
తన వద్దకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి వరసగా మీరు గెలుస్తున్నారు కదా ఎలా సాధ్యం అని ప్రశ్నించారు అని గంటా చెప్పారు. అయితే గెలుపునకు ఫార్ములాలు అంటూ వేరే ఉండవని ఆయన చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసినా 2004 ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి ఏపీలో ఓటమి పాలు అయింది అని గుర్తు చేశారు. అలాగే 2014 నుంచి 2019 మధ్యలో బెస్ట్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా టీడీపీ ఓటమి తప్పలేదని చెప్పారు. ఇక డబ్బులు ఖర్చు పెడితే గెలుస్తారు అనుకుంటే తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ఖర్చు చేయని టీవీకే పార్టీ గెలిచింది కదా అని విశ్లేషించారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా విజయానికి ఇదే దగ్గర దారి అని చెప్పలేమని గంటా స్పష్టం చేశారు.
మమేకం కావాల్సిందే :
అయితే పార్టీ అన్నాక అందరూ కలసి పనిచేయాలని ఇగోలకు పోకుండా ఉండాలని ఆయన సూచించారు. కార్యకర్తలతో నిరంతరం మమేకం అవాల్సి ఉంటుందని గంటా సూచనలు ఇచ్చారు. అంతే కాదు ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్థానికంగా స్పందించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులను చెప్పుకుంటూ ప్రజలకు అన్నీ తెలియచేస్తూ ఉండాలని కూడా ఆయన పేర్కొన్నారు. పార్టీలో అంతా ఒక కుటుంబం అన్న భావనతో సాగాలని కూడా ఆయన చెప్పారు.
ఎలక్షనీరింగ్ ముఖ్యం :
ఎన్నికల్లో అన్నిటికంటే ఎలక్షనీరింగ్ చాలా ముఖ్యమని గంటా అసలు సీక్రెట్ చెప్పారు. ఎన్ని చేసినా ఎన్నికల వేళ మన ఓట్లు మనం వేసుకోకపోతే ఇబ్బంది కదా. అందుకే ఎలక్షనీరింగ్ చాలా ఇంపార్టెంట్ అని గంటా చెప్పుకొచ్చారు. అంటే గెలుపునకు ఎలక్షనీరింగ్ చాలా అవసరం అన్న మాట. ప్రజల వద్ద తాము ఉన్నామని వారితోనే ఎప్పుడూ మమేకం అవుతున్నామని ఎవరైనా అనుకుని పోలింగ్ రోజున ఎలక్షనీరింగ్ విషయంలో అంతగా ఫోకస్ పెట్టకపోతే ఓడిపోయిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఇదే విషయం గంటా చెప్పుకొచ్చారు అన్న మాట. అంటే గంటా లాంటి వారి వరస గెలుపుల వెనక ఎలక్షనీరింగ్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది అని అర్ధం అవుతోంది కదా. ఇదిలా ఉంటే గంటా స్పీచ్ ని టీడీపీ కాంక్లేవ్ లో అంతా శ్రద్ధగా విన్నారు, చంద్రబాబు కూడా చాలా ఆసక్తిగా వినడం జరిగింది అని అంటున్నారు.
