లోకేష్ వెంటే గంటా...మ్యాటరేంటో ?
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ చతురుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే.
By: Satya P | 30 Aug 2025 9:21 AM ISTవిశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ చతురుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తన మొత్తం పాతికేళ్ళ రాజకీయ జీవితంలో నాలుగు సార్లు పార్టీలు మారారు. ఇక 2019లో ఆయన గెలిచి టీడీపీ ఓడిన నేపథ్యంలో ఒక దశలో వైసీపీలోకి కూడా రావాలని ముహూర్తం పెట్టుకున్నారు అని ప్రచారం సాగింది. ఆ అయిదేళ్ళూ ఆయన ఎమ్మెల్యేగా కూడా పెద్దగా బయటకు కనిపించలేదని టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు పెద్దగా పార్టీ కోసం పోరాటాలు చేయలేదని విమర్శలు వచ్చాయి. దాని ఫలితంగానే ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ కూడా ఆలస్యంగా వచ్చింది అని చెప్పుకున్నారు.
గ్యాప్ ని తగ్గించే యత్నంలో :
ఇక గంటా శ్రీనివాసరావు వైఖరి ఇటీవల కాలంలో చాలా మారింది అని అంటున్నారు. గతంలో ఆయన పార్టీ పెద్దలు ఎవరు వచ్చినా అసలు కనిపించేవారు కాదని పెద్దగా స్వాగతాలకు కూడా వచ్చేవారు కాదని అంటారు. కానీ ఇపుడు సీన్ మార్చారు శీనన్న అని అంతా గుసగుసలు పోతున్నారు. గంటా నారా లోకేష్ విశాఖ వస్తే ఆయనతోనే ఉన్నారు. ఆయన వెంటే కలిసి తిరిగారు. ఇక ఆయనతో కలసి వేదిక పంచుకున్నారు. నారా లోకేష్ కార్యక్రమం కూడా తన భీమిలీ నియోజకవర్గంలో ఉండడంతో గంటా ఆయనతోనే ముచ్చటిస్తూ గ్యాప్ ని తగ్గించుకునే ప్రయత్నం చేశారు అని అంటున్నారు.
ఆ మధ్యన మంగళగిరికి :
ఇక దీని కంటే ముందు గంటా శ్రీనివాసరావు మంగళగిరికి వెళ్ళి మరీ లోకేష్ ని స్వయంగా కలసి వచ్చారు. ఆయనతో భీమిలీ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చర్చించారు. అంతే కాదు నారా లోకేష్ ఆ మధ్య ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను కలిస్తే గంటా నారా లోకేష్ గురించి గొప్పగా పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విధంగా ఆయన చినబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అని అంతా అంటున్నారు.
కుమారిడి కోసమేనా :
మరో వైపు చూస్తే గంటా వచ్చే ఎన్నికల నాటికి పోటీ చేయాలని అనుకోవడం లేదని అంటున్నారు. ఆయన తాను పోటీ నుంచి విరమించుకుని తన రాజకీయ వారసుడిగా కుమారుడిని భీమిలీ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు ఆ విధంగా ఆయన వారసుడి కోసమే నారా లోకేష్ తో గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తూ సన్నిహితం అవుతున్నారని అంటున్నారు. తన కుమారుడిని నారా లోకేష్ టీం లో ఎలాగోలా చేరిస్తే ఆయనకు టికెట్ దక్కుతుదని ఆ విధంగా తన వారసుడిగా భీమిలీ నుంచి ఎమ్మెల్యే అవుతారని అలా వారసత్వం నిలబడుతుందని గంటా భారీ స్కెచ్ గీస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు విశాఖ జిల్లాలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడితోనూ సఖ్యతను నెరుపుతున్నారని అంటున్నారు. మొత్తానికి గంటా రాజకీయం చూసిన వారు ఇదే కదా రాజకీయ చాణక్యం అంటే అని అంటున్నారుట.
