Begin typing your search above and press return to search.

మంత్రివర్గ విస్తరణ : ఊహాగానమా...ఆశావాదమా ?

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 21 నెలలు గడిచాయి. 24 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు.

By:  Satya P   |   21 March 2026 10:00 AM IST
మంత్రివర్గ విస్తరణ : ఊహాగానమా...ఆశావాదమా ?
X

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 21 నెలలు గడిచాయి. 24 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. లెక్క ప్రకారం చూస్తే మరో మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఈ 24 మందిలో జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు ఉంటే టీడీపీ నుంచి 20 మంది ఉన్నారు. అయితే మొత్తంగా 164 మంది కూటమి తరఫున ఎమ్మెల్యేలు గెలిచారు. దాంతో 24 మందిని పక్కన పెడితే మిగిలిన 139 మంది మంత్రి పదవుల కోసం ఆశలు పెంచుకున్న వారే అని అంటున్నారు. విస్తరణ అనేది ఉంటుంది అన్న ఆశతోనే వారంతా ముందుకు సాగుతున్నారు.

సీనియర్ నేత వ్యాఖ్యలు :

ఇక మంత్రి వర్గ విస్తరణ మీద సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే తనదైన శైలిలో స్పందించారు. మంత్రివర్గ విస్తరణ అని ఎవరు చెప్పారని ఆయన మీడియాను ప్రశ్నిస్తున్నారు విస్తరణ అన్నది ఊహాగానమని కొట్టిపారేస్తున్నారు. అదే సమయంలో తాను మంత్రిగా ఇప్పటికే చేశాను అని చెబుతూ తనకు మంత్రి పదవి విషయంలో ఆశలు ఉన్నదీ లేనిది చెప్పకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టమని ఆయన చెప్పడం కూడా విశేషమే. ఒక వైపు ఊహాగానాలే అని చెబుతూనే బాబు ఇష్టమని ఈ సీనియర్ నేత అంటున్నారు.

సరైన సమయంలోనేనా :

అయితే మంత్రి వర్గ విస్తరణ అన్నది ఉంటుందని అది ఒట్టి ప్రచారం కాదని తల పండిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ప్రభుత్వంలో విస్తరణ పేరుతో మార్పులు చేయకపోతే అసంతృప్తి ఏర్పడుతుంది కాబట్టి కొంత కాలం ఆగి అయినా చేపడతారు అని అంటున్నారు. అయితే అది భారీ మార్పులుగా ఉంటుందా లేక స్వల్ప మార్పులతో సరిపెడతారా అన్నదే సీఎం చంద్రబాబు లౌఖ్యం వ్యూహం మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. పూర్తి స్థాయి విస్తరణ చేపట్టి ఇంతటితో సరి అనిపించకుండా కొందరిని ఇన్ మరి కొందరిని అవుట్ అని చేంజెస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు దాంతో మరోసారి విస్తరణ ఉండొచ్చు అన్న ఆశలు ఆశావహులలో ఉండేలా చూసుకుంటారని అంటున్నారు

సీనియర్లకు సైతం :

అయితే మంత్రి వర్గంలో తమకు చోటు ఉంటుందా లేదా అన్నది సీనియర్లకు సైతం అర్ధం కావడం లేదని అంటున్నారు. మంత్రి వర్గం కూర్పులో తొలి దఫా కొత్త వారిని తెచ్చి ప్రయోగాలు చేశారని విస్తరణలో అలాంటి మెరుపులు చూడవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ ఇపుడు ఒక పరిణామ క్రమంలో ముందుకు సాగుతోంది అని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పాత తరాన్ని మెల్లగా పక్కన పెట్టి కొత్త తరానికి స్వాగతం పలికే ప్రక్రియ 2024 లో ఎన్నికల టికెట్ల పంపిణీ నుంచి మొదలైందని అదే మరింతగా ముందుకు సాగే అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద మంత్రి పదవులు మాకు కొత్త కాదు అంటున్న సీనియర్ల మనసులో ఏముందో తెలియదు కానీ కొత్త వారికి చాన్స్ ఇద్దామన్న టీడీపీ పెద్దల ఆలోచనలు మాత్రం స్పష్టంగానే ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి మంత్రి వర్గ విస్తరణ మీద ఊహాగానాలు అంటూ ఇలాగే కొనసాగుతాయా లేక ఫుల్ స్టాప్ పెడుతూ కీలక నిర్ణయాలు ఉంటాయా అన్నది.