అయ్యన్న కొడుకు బాటలోనే గంటా కొడుకు కూడా ?
ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీలో ఇద్దరు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుల పలుకుబడి గట్టిగా ఉందన్న సంగతి తెలిసిందే.
By: Satya P | 8 Sept 2026 8:57 AM ISTఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీలో ఇద్దరు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుల పలుకుబడి గట్టిగా ఉందన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ దశాబ్దాల తరబడి రాజకీయాలు చేస్తూ వచ్చారు విజయాలు సాధిస్తూ ఉమ్మడి విశాఖ జిల్లా మీద తమదైన ముద్రను వేశారు. అయ్యన్న ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా గెలిస్తే గంటా ఒకసారి ఎంపీగా అయిదు సార్లు ఎంపీగా గెలిచారు. అయ్యన్న పదేళ్ళకు పైగా వివిధ ప్రభుత్వాలలో మంత్రిగా చేస్తే గంటా కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలలో ఏడేళ్ళ పాటు మంత్రిగా ఉన్నారు. ఇలా ఇద్దరూ రాజకీయంగా ప్రముఖ నేతలుగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తన రాజకీయ విరమణను ప్రకటించేశారు. తన కుమారుడు విజయ్ ని రాజ్యసభను ఆయన పంపించుకోగలిగారు. అలాగే రెండవ కుమారుడు రాజేష్ ని ఆయన నర్సీపట్నం నుంచి 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.
గంటా వారసుడు రెడీ :
అయితే గంటా వారసుడు కూడా మరో వైపు రెడీగానే ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే భీమిలీ నియోజకవర్గంలో తండ్రి సీటులో గంటా రవితేజ తాను కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలలో ఆయన చురుకుగా ఉంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయనే భీమిలీ నుంచి టీడీపీ తరఫున అభ్యర్ధి అని ప్రచారం సాగుతూ వస్తోంది. అయితే భీమిలీ సీటు ఇపుడు హాట్ అండ్ స్వీట్ సీటుగా మారింది అని అంటున్నారు. నేరుగా టీడీపీ అధినాయకత్వం చూపు ఈ సీటు మీద ఉందని అంటున్నారు. దానికి కారణం అనేక పరిశ్రమలు ఐటీ కంపెనీలు గూగుల్ డేటా సెంటర్ వంటివి ఇక్కడే ఏర్పాటు కావడంతో ఒక్కసారిగా భీమిలీ ప్రాధాన్యత పెరిగింది అని అంటున్నారు.
భారీగానే పోటీ :
ఈసారి భీమిలీ సీటుకు భారీగానే పోటీ ఉంటుందని అంటున్నారు. గంటా రాజకీయ విరమణ ప్రకటిస్తే ఆయన కుమారుడికి దక్కుతుందని కూడా చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు. ఎంపీగా ప్రస్తుతం ఉన్న శ్రీ భరత్ భీమిలీ నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అని ప్రచారం కూడా ఉంది. అలాగే టీడీపీ అధినాయకత్వానికి దగ్గర వారు కూడా ఈ సీటు నుంచి పోటీ చేయవచ్చు అని మరో ప్రచారం ఉంది. ఈ క్రమంలో గంటా వారసుడి భవిష్యత్తు ఏమిటి అన్న చర్చ కూడా వస్తోంది. అయితే రాజకీయ వ్యూహాలలో ఆరితేరిన గంటా ప్లాన్ బీని కూడా సిద్ధంగా ఉంచుకున్నారు అని అంటున్నారు. దాంతో తన కుమారుడికి భీమిలీ సీటు కాకపోతే విశాఖ ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు.
రెండు ఆప్షన్లతో :
విశాఖ ఎంపీ సీటు 2029 నాటికి డీ లిమిటేషన్ లో భాగంగా రెండు అవుతుందని అంటున్నారు. అలా కనుక జరిగితే ఒకటి విశాఖ సెంట్రల్ గా మార్పు చెందుతుందని అందులో భీమిలీ అసెంబ్లీ సీటు కూడా ఉంటుందని దాంతో సొంత బలంతో పాటు పార్టీ బలం కూడా తోడు అయితే 2029 ఎన్నికల్లో గంటా వారసుడు ఈజీగా గెలిచేందుకు వీలు అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఒక వేళ అలా కనుక కుదరకపోతే విజయనగరం ఎంపీ సీటు మీద కూడా గంటా ఫోకస్ పెట్టి ఉంచారని అంటున్నారు. గతంలో టీడీపీ మంత్రిగా ఉన్నపుడు ఆయన విజయనగరం జిల్లా ఇంచార్జిగా పనిచేశారు. దాంతో ఆ పరిచయాలు ఉన్నాయని స్థానిక రాజకీయం మీద కూడా అవగాహన ఉంది కాబట్టి కుమారుడిని అక్కడ నుంచి అయినా బరిలోకి దించుతారు అని అంటున్నారు.
ఇద్దరూ పార్లమెంట్ కే :
అదే కనుక జరిగితే అయ్యన్న కుమారుడు విజయ్ తో పాటుగా గంటా కుమారుడు కూడా పార్లమెంట్ కి వెళ్తారు అని అంటున్నారు. ఇప్పటికే పెద్దల సభలో విజయ్ ఉన్నారు, దాంతో గంటా వారసుడు లోక్ సభ నుంచి ఎంపీగా వస్తారని అంటున్నారు. గంటా కూడా తొలిసారి ఎంపీగానే గెలిచి తన రాజకీయాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు.
