శీనులిద్దరూ ఒక్కటయ్యారు...వాటే పొలిటికల్ సీన్ !
ఈ నేపధ్యంలో గంటా వారి ఇంట్లో జరిగిన ఒక కీలక వేడుకకు అవంతి శ్రీనివాసరావు హాజరు కావడం రాజకీయంగా విశేషంగానే అంతా చూస్తున్నారు.
By: Satya P | 17 March 2026 8:00 PM ISTరాజకీయం అనేది ఎంతటి వారినైనా విడదీస్తుంది. రాజకీయాల్లోకి వచ్చాక బంధాలు అన్నవి పక్కకు పోతాయి. అయితే కొందరి విషయంలో అవి జీవిత కాలం దూరాన్ని పెంచుతూంటాయి. మరి కొందరి విషయంలో తాత్కాలికంగా మబ్బులు కమ్మినా తిరిగి ఒక్కటి అవుతారు. ఇపుడు అలాంటిదే విశాఖ జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకుంది. ఇద్దరు శీనులు ఒక్కటిగా కలసి పోయారు ఆ సీన్ చూసేందుకు ఎంతో బాగుంది అని అంతా అంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు ఏమిటా కధ అంటే మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.
కత్తులు దూశారు :
ఒకసారి వెనక్కి వెళ్తే 2024 ఎన్నికల వేళ భీమునిపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు మరోసారి బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య రాజకీయం వాడి వేడిగా సాగింది. ఇద్దరూ చిరకాలం ప్రత్యర్ధుల మాదిరిగా ఘాటు విమర్శలు చేసుకున్నారు. గంటా ప్రతీ ఎన్నికకూ నియోజకవర్గాలను మారుస్తారు అని అవంతి విమర్శించారు. అవంతి ని కూడా గంటా అంతే దూకుడుగా విమర్శలు చేశారు. ఇలా ఇద్దరూ కత్తులు దూసుకుని భీకర పోరుగా మార్చిన భీమిలీ ఎన్నికల్లో విజయం గంటాకు వరించింది. అది కూడా అలా ఇలా కాదు 90 వేల పై చిలుకు మెజారిటీతో గంటా అవంతి మీద గెలిచారు.
వైసీపీకి దూరం :
దాంతో ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆరు నెలలు కూడా తిరగకుండానే అవంతి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన కూటమికి మద్దతుగా తన కుమార్తె కార్పొరేటర్ ని వైసీపీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయించారు. టీడీపీలో అవంతి చేరాలని చూశారు కానీ గంటా అడ్డుపడ్డారు అన్న ప్రచారం సాగింది. అలాగే అంతకు ముందు గంటా వైసీపీలోకి రావాలనుకుంటే అవంతి అడ్డారని కూడా ప్రచారం ఉంది. ఇలా ఇద్దరూ ఒకరి మీద మరొకరు పైచేయి సాధించాలని చూసినా చివరికి గంటా విజయంతో ఇపుడు ఆయనే ముందున్నారు అనీ అంటున్నారు. అవంతి అయితే ఏ రాజకీయ పార్టీలో చేరకుండా ఆప్షన్లు తన వద్ద ఉంచుకున్నారు.
గంటాతో అవంతి :
ఈ నేపధ్యంలో గంటా వారి ఇంట్లో జరిగిన ఒక కీలక వేడుకకు అవంతి శ్రీనివాసరావు హాజరు కావడం రాజకీయంగా విశేషంగానే అంతా చూస్తున్నారు. గంటా నాలుగు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖలోని ఒక రిసార్టులో ఇచ్చిన ఆత్మీయ విందుకు అవంతి సహా అనేక మంది హాజరయ్యారు. కానీ అందరి చూపూ అవంతి మీదనే ఉంది. నాడు గంటా మీద విమర్శలు చేసి రాజకీయంగా విభేదించి దూరం జరిగిన అవంతి మళ్లీ గంటాతో సాన్నిహిత్యం నెరపడాన్ని చూసిన వారు రాజకీయాలు అంటే ఇవే కాబోలు అనుకునే పరిస్థితి ఉంది.
గంటా చొరవతోనే :
నిజానికి అవంతి శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం గంటా చొరవతోనే సాగింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున అవంతికి భీమిలీ సీటుని గంటా ఇప్పించారు. అలా వారిద్దరి మధ్య గురు శిష్య సంబంధం ఉండేది. గంటాతో పాటే నడిచిన అవంతి ఆయనతో పాటే టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అయ్యారు. ఇక 2019 ఎన్నికల ముందు మాత్రం ఇద్దరి మధ్యన విభేదాలు భీమిలీ సీటు విషయంలో వచ్చాయి. అలా అవంతి వైసీపీలోకి వెళ్ళిపోయారు, భీమిలీ నుంచి గెలిచి వచ్చి మంత్రి కూడా అయ్యారు. గంటా విపక్షంలో ఉన్నారు. అలా కొన్నాళ్ళ పాటు అవంతి హవా సాగినా మొత్తం మీద చూసుకుంటే జిల్లా రాజకీయాల్లో గంటా ఆధిపత్యమే అధికం అని అంతా ఒప్పుకుంటారు. కూటమి ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు అంతా హాజరైన ఈ కార్యక్రమలో అవంతి కనిపించడంతో ఆయన కూటమిలో చేరుతారా టీడీపీ కండువా కప్పుకుంటారా అన్న కొత్త చర్చ మొదలైంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
