గన్నవరం టెర్మినల్ పనులు సా..గుతూనే ఉండటమా బాబు?
రాత్రికి రాత్రే పరిస్థితుల్ని మార్చేయటం అంత తేలికైన విషయం కాదు. అందునా.. ఒక వ్యవస్థలో మార్పులు వచ్చేలా చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని.
By: Garuda Media | 6 Dec 2025 8:30 AM ISTరాత్రికి రాత్రే పరిస్థితుల్ని మార్చేయటం అంత తేలికైన విషయం కాదు. అందునా.. ఒక వ్యవస్థలో మార్పులు వచ్చేలా చేయటం చాలా కష్టంతో కూడుకున్న పని. అదే విధంగా కొన్ని ప్రాజెక్టులు ఎంత వేగంగా పూర్తి కావాల్సి ఉన్నా.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించే ధోరణి ఉంటుంది. ఇప్పుడు ఆ కోవలోకే చేరుతుంది గన్నవరం ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన పనులు. దగ్గర దగ్గర రూ.470కోట్లతో మొదలెట్టిన పనులు ఐదేళ్ల క్రితం మొదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. 30 నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. పనులు షురూ అయి 68 నెలలు అవుతోంది. ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ శాఖకు కేంద్ర మంత్రిగా ఉన్నది ఏకంగా ఏపీకి చెందిన అధికారపార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడే.
కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఇప్పటికే రెండుసార్లు పరిశీలించి.. పనులు వేగంగా పూర్తి చేసేలా సూచనలు చేసి వెళ్లారు. అధికారులతో పాటు.. కాంట్రాక్టర్ ను కూడా హెచ్చరిచారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేకపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గన్నవరం ఎయిర్ పోర్టు పరిధిలోనే ఇద్దరు శక్తివంతమైన ఎంపీలు ఉన్నారు. వారే.. బాలశౌరి.. శివనాథ్. కేంద్రంలో చాలా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా చెబుతారు.
అంటే ఒక కేంద్రమంత్రి.. ఇద్దరు శక్తివంతమైన ఎంపీలు ఉండి కూడా.. ఒక భవనాన్ని పూర్తి చేసే విషయంలో ఇంత ఆలస్యమవుతున్నా ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నది ప్రశ్నగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పనులు పూర్తి చేయటానికి మరో ఆర్నెల్లు సమయం పడుతుందని చెబుతున్నారు. కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పనులు వేగంగా జరగకపోవటాన్ని గుర్తించి.. 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించి వెళ్లారు.
కానీ.. పరిస్థితుల్లో కించిత్తు మార్పు లేని పరిస్థితి. పనులు ఎంత వేగంగా చేసినా వచ్చే ఏడాది జూన్ కు కూడా పనులు పూర్తి కావన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ ఈ టెర్మినల్ అవసరం ఎంత? అంటే చాలానే ఉందని చెప్పాలి. ప్రముఖ విమానయాన సంస్థలకు చెందిన భారీ బోయింగ్ సర్వీసులు గన్నవరం ఎయిర్ పోర్టుకు రావాలంటే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నూతన టెర్మినల్ చాలా అవసరం. ఇక్కడ సంబంధిత టెర్మినల్ లేకపోవటంతో ఏళ్లకు తరబడి అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులు నడిపేందుకు ముందుకు రావట్లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో గన్నవరం రావాల్సిన విమానాలు ఎక్కువగా హైదరాబాద్ తదితర విమానాశ్రయాలకు చేరుకుంటున్నాయి. నిజానికి ఏదైనా పనిని పూర్తి చేయించాలన్నా.. పరుగులు పెట్టించాలన్నా చంద్రబాబుకు సాటి వచ్చే ముఖ్యమంత్రి లేరన్న మాట వినిపిస్తూ ఉంటుంది. కానీ.. ఆయన సైతం ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికైనా ఏపీ సీఎం ఈ ఇష్యూను సీరియస్ గా టేకప్ చేయకపోతే.. పనులు మరింత ఆలస్యం కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
