మసీదులో వినాయకుడు.. ఇదిరా భారత్ అంటే?
భిన్నత్వంలో ఏకత్వం. మతం అన్నది నమ్మకం. మానవత్వానికి నిలువెత్తు రూపంగా ఉండాలే తప్పించి.. ఆ పేరుతో విభేదాల్ని క్రియేట్ చేసుకోవద్దు.
By: Garuda Media | 2 Sept 2025 9:27 AM ISTభిన్నత్వంలో ఏకత్వం. మతం అన్నది నమ్మకం. మానవత్వానికి నిలువెత్తు రూపంగా ఉండాలే తప్పించి.. ఆ పేరుతో విభేదాల్ని క్రియేట్ చేసుకోవద్దు. ఒకరి సంప్రదాయాన్ని మరొకరు గౌరవించుకోవటం.. అందరు కలిసి మెలిసి పండగల్ని చేసుకోవటంలో ఉండే సంతోషం.. మరెందులోనూ ఉండదు. ఒకరి పండుగ వేళను మరో వర్గం వారు సాదరంగా ఆహ్వానించటం.. తాము భాగస్వామ్యం కావటానికి మించిన మానవత్వం ఇంకేం ఉంటుంది. కథ లాంటి ఒక ఉదంతం మహారాష్ట్రలోని ఒక గ్రామంలో గడిచిన కొన్నేళ్లుగా నడుస్తోంది.
వీరి ఉదంతం విన్నతర్వాత అసలుసిసలు మతసామరస్యానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకేం ఉంటుందన్న భావన కలుగక మానదు. అంతేకాదు.. ఇది కదా భారత్ అంటే అన్న భావన మనసును కమ్మేస్తుంది. ఇంతకూ విషయం ఏమంటే.. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపానికి వేదికగా మారిందో మసీదు. అవును.. మీరు చదివింది నిజమే. ఇంతకూ ఇదెక్కడ? అదెలా సాధ్యం? మిగిలిన వారికి భిన్నంగా ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులు ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోట్ఖిండీ గ్రామంలోని స్థానికులు ప్రతి ఏడాది గణేశుడి విగ్రహానని మసీదులో ప్రతిష్ఠించి పూజలు చేయటం కనిపిస్తుంది. ఇలా ఎలా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే 45 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అప్పట్లో భారీ వర్షం కారణంగా ఒక గణపతి విగ్రహాం తడిచి పోతుంటే.. దాన్ని స్థానిక ముస్లింల చొరవతో మసీదులోకి మార్చారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది మసీదులోనే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణేశ్ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు.
ఆసక్తికరంగా గణేశ్ నవరాత్రుల్ని హిందూ.. ముస్లింలు ఉమ్మడిగా పాల్గొంటూ ఈ ఊరి స్పెషల్. వీరి ఐక్యమత్యానికి కాలపరీక్ష కూడా ఎదురైంది. అదేమంటే.. ఒకసారి వినాయకచవితి.. బక్రీదు ఒకేసారి వచ్చింది. ఈ సందర్భంగా ఇరు వర్గాలు చర్చించుకొని.. ఊహించని రీతిలో పరిష్కారానికి కనుగొన్నారు. ఇందుకు ముస్లింలు చొరవ తీసుకోవటం విశేషం. వినాయకచవితి.. బక్రీదు ఒకేరోజు వచ్చిన రోజు.. ముస్లింలు నమాజ్ మాత్రమే చేసి.. కుర్బానీకి దూరంగా ఉండటం గమనార్హం. ఇలా వినాయక చవితిని మసీదులో ఘనంగా నిర్వహించుకోవటం అరుదైన అంశమే కాదు.. మతసామరస్యానికి ఇదో స్ఫూర్తిగా చెప్పక తప్పదు.
