ఏఐ సాంకేతికతతో మ్యూజియంలో గాంధీ, వాజ్‌పేయీ దర్శనం!
చరిత్రను పుస్తకాల్లో చదవడం వేరు.. అదే చరిత్రలో ఉన్న మహనీయులతో ముఖాముఖి మాట్లాడటం వేరు.
By: Tupaki Political Desk | 27 April 2026 10:59 AM ISTచరిత్రను పుస్తకాల్లో చదవడం వేరు.. అదే చరిత్రలో ఉన్న మహనీయులతో ముఖాముఖి మాట్లాడటం వేరు. అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ), 3డీ టెక్నాలజీ పుణ్యమా అని, ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయం ఇప్పుడు సందర్శకులకు అటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. గాంధీజీ, వాజ్‌పేయీ వంటి మహనీయులు మన కళ్లముందే సాక్షాత్కరిస్తారు. సాక్షాత్కరించడమే కాదు..మనతో మాట్లాడుతారు కూడా.
టైమిషన్ లో కాలంలో వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది..? దేశ భవిష్యత్తును నిర్దేశించిన నాయకులను కలిసి, వారి ఆలోచనలను వారి మాటల్లో వింటే ఎంత బాగుంటుంది? ఈ ఊహను నిజం చేస్తోంది ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయం. కేవలం విగ్రహాలు లేదా చిత్రపటాలకే పరిమితం కాకుండా, ఏఐ ఆధారిత 3డీ అవతార్ ల ద్వారా సందర్శకులు నేరుగా గాంధీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీలతో సంభాషించవచ్చు. మే నెలాఖరుకల్లా అందుబాటులోకి రానున్న ఈ ప్రదర్శన, చరిత్రను నేర్చుకునే విధానాన్ని పూర్తిగా మార్చివేస్తోంది.
సాంకేతిక అద్భుతం
ఈ ప్రాజెక్టు వెనుక అత్యంత సంక్లిష్టమైన కృత్రిమ మేధ ఉంది. కేవలం తెరపై కనిపించే బొమ్మలే కాకుండా, మన ముందు మనుషులు ఉన్నారనే భ్రమను కలిగించేలా ఈ అవతార్లను రూపొందించారు. గాంధీజీ లేదంటే వాజ్‌పేయీ పాత ప్రసంగాలు, వారి గొంతులోని మాడ్యులేషన్, వారు వాడే పదజాలాన్ని ఏఐకి ఫీడ్ చేశారు. దీనివల్ల మనం ఏదైనా ప్రశ్న అడిగితే, వారు నిజంగా ఎలా సమాధానం ఇస్తారో అదే శైలిలో ఈ అవతార్ లు స్పందిస్తాయి. ఇప్పటికే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఏపీజే అబ్దుల్ కలాం అవతార్ లు ఏర్పాటు చేయగా, సందర్శకుల నుంచి స్పందన లభించింది. ముఖ్యంగా విద్యార్థులు కలాంతో మాట్లాడేందుకు అమితమైన ఆసక్తి చూపుతున్నారు.
చరిత్ర పునరుజ్జీవం
మ్యూజియం డైరెక్టర్ అశ్వనీ లోహనీ దీని గురించి వివరించారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు.., ఒక అపూర్వ అనుభవం. పుస్తకాల్లో ఉండే పాఠాల కంటే, ఒక వ్యక్తితో నేరుగా మాట్లాడటం వల్ల కలిగే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గాంధీజీ అహింస గురించి లేదంటే వాజ్‌పేయీ కవిత్వం గురించి మనతో మాట్లాడుతుంటే, ఆ అనుభూతి వర్ణనాతీతం. నేటి డిజిటల్ తరానికి చరిత్ర అంటే బోర్ కొట్టే సబ్జెక్టుగా మిగిలిపోకుండా.. ఒక ఇంటరాక్టివ్ గేమింగ్ అనుభవంలా అనిపిస్తుంది. దీనివల్ల జాతినేతల త్యాగాలను వారు అర్థం చేసుకుంటారు.
ఈ మ్యూజియం ఏప్రిల్ 14 నాటికి నాలుగేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ మ్యూజియంను సగటున రోజుకు 1,500 మంది సందర్శిస్తున్నారంటే.. సాంకేతికతను జోడించిన చరిత్రకు ఎంతటి ఆదరణ ఉందో తెలుస్తోంది. లైట్ అండ్ సౌండ్ షోలు, డిజిటల్ గ్యాలరీలతో పాటు ఇప్పుడు ఈ ఏఐ సంభాషణలు మ్యూజియం స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి.
సాంకేతికత అంటే కేవలం రోబోలు, రాకెట్లే కాదు.. అది మన సంస్కృతిని, చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించే వారధి కావాలని ప్రాజెక్టు నిరూపిస్తోంది. గతించిన నాయకులను మళ్లీ మన ముందుకు తీసుకురావడం ద్వారా, వారి ఆశయాలను సజీవంగా ఉంచే ప్రయత్నం అభినందనీయం. మే ఆఖరు నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాంధీజీ శాంతి వచనాలు, వాజ్‌పేయీ అనర్గళ ప్రసంగాలను మళ్లీ ప్రత్యక్షంగా వినే రోజులు దగ్గరపడ్డాయి.
