Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య విభేదాలు బహిరంగ విమర్శలకు దారితీస్తున్నాయి. దామోదర రాజనర్సింహ, లక్ష్మీకాంతరావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, వంశీకృష్ణ వంటి నేతల మధ్య వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలతో అప్రమత్తమైన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. అసంతృప్త నేతలను గాంధీ భవన్‌కు పిలిచి మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. టీ కప్పులతో ఈ విభేదాలకు పరిష్కారం దొరుకుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

By:  A.N.Kumar   |   5 Nov 2026 3:31 PM IST
కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష
X

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు ఇప్పుడు కాకరేపుతున్నాయి.. అధికారం చేతికి రాగానే నేతలందరూ కలసికట్టుగా ప్రజలకు పాలన అందిస్తారేమో అని అమాయకంగా ఆశించిన అంతర్గత తగాదాలతో అగ్గిరాజేస్తున్నారు.. కాంగ్రెస్ నేతలు ఓపెన్ గానే బరెస్ట్ అవుతూ నిప్పు రాజేస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు “సమైక్యంగా పోరాడుదాం” అని భుజం భుజం కలిపి నినదించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. తీరా అధికార పీఠం దక్కేసరికి.. "పోరాటం ఆగదు.. కాకపోతే ఈసారి మనోళ్లతోనే" అంటూ సొంత పార్టీలోనే రంగుల రచ్చ మొదలుపెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఒకరా ఇద్దరా? ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు.. వ్యంగ్యాస్త్రాలు.. సెటైరికల్ లేఖలతో వార్తల్లో నిలుస్తూ సగటు ఓటరుకి కావాల్సినంత ఉచిత వినోదాన్ని పంచుతున్నారు.

మంత్రి దామోదర రాజనర్సింహకు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు పడదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లు అయితే బహిరంగంగానే డైలాగ్ వార్ నడుపుతున్నారు. ఇక ఎంపీ వంశీకృష్ణ ది మరో లొల్లి. ఆయన ఏకంగా మంత్రి శ్రీధర్ బాబుకే ఒక 'చమత్కారపు లేఖ' రాసి తమలోని సృజనాత్మకతను చాటుకున్నారు. అంతర్గత సమావేశాల్లో తేల్చుకోవాల్సిన ముచ్చట్లను మీడియా ముందుకు తెచ్చి మైకుల ముందు రచ్చ చేయడమే అసలైన 'కాంగ్రెస్ మార్క్' క్రమశిక్షణ అని నిరూపిస్తున్నారు.

ఈ పంచాయితీలన్నీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కి పెద్ద తలనొప్పిగా మారాయి. దీంతో ఆయన ‘గాంధీ భవన్’ను అసలైన పంచాయితీ రచ్చబండగా మార్చేశారు. విభేదాలున్న నేతలకు గాంధీ భవన్ టీ, బిస్కట్ల ఆతిథ్యం ఇచ్చి.. "కొంచెం తగ్గించుకోండి బాస్" అని క్లాస్ పీకేందుకు ప్లాన్ చేశారు. అయితే అసమ్మతి మహావృక్షాలను టీకప్పులలో సర్దిచెప్పడం సాధ్యమేనా అన్నదే ఇక్కడ అసలైన ట్విస్ట్..

అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కన్నా "ఎవరి హవా ఎంత?" అని నిరూపించుకోవడానికే నేతలకు సమయం సరిపోవడం లేదు. పీసీసీ చీఫ్ పిలిపించి మాట్లాడితే ఈ ‘స్నేహపూర్వక పోరాటాలు’ ఆగుతాయా? లేక గాంధీ భవన్ గుమ్మం దాటగానే మళ్ళీ పాత పాట అందుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రతిపక్షాలకు కష్టపడే పనిలేకుండా తమకు తామే వినోదాన్ని అందిస్తున్న కాంగ్రెస్ క్రమశిక్షణ పరీక్షలో పాస్ అవుతుందో... లేక సొంత నేతల సెటైర్లకే బలైపోతుందో కాలమే సమాధానం చెప్పాలి..