గాంధీని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయిందా ?
ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన వారిలో మహాత్ముడు ముందు వరసలో ఉంటారు. అది వాస్తవం కూడా.
By: Satya P | 9 Oct 2025 1:00 AM ISTఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన వారిలో మహాత్ముడు ముందు వరసలో ఉంటారు. అది వాస్తవం కూడా. అయితే నాణేనికి రెండవ కోణం ఉన్నట్లుగా చరిత్రలో మరో వైపు కూడా ఉంటుంది. అందులో ఇతర నాయకులు కూడా జాతీయ స్థాయిలో పోరాడారు. బ్రిటిష్ వారి మీద గట్టిగా ఉద్యమించారు. అలా అందరూ కలిస్తేనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇందులో ఒకరు తక్కువ కానీ ఎక్కువ కానీ ఏమీ లేదు నిజం చెప్పాలంటే ఆ కాలంలో ఉన్న జాతీయ నాయకులు ఎవరూ గాంధీని విమర్శించినది లేదు అని గుర్తుంచుకోవాలి.
నమ్మలేని నిజం :
గాంధీ మరణించి దాదాపుగా ఎనభై ఏళ్ళు దగ్గర అవుతోంది. అయినా ఇంకా భారత జాతి ఆయనను గుర్తు పెట్టుకుంటోంది అంటే అది చాలదా ఆయన మహాత్ముడు అనడానికి ఇది ఒక విధంగా నమ్మలేని నిజం. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి వారు కూడా గాంధీని చూసి అబ్బురపడ్డారు. రక్తమాంసాలతో నడిచే ఒక మానవ మూర్తి ఒక తరంలో జాతిని నడిపించారని తెలిస్తే తర్వాత తరాలు ఆశ్చర్యపోతాయని అన్నారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మహాత్మా గాంధీని ఎంతో ఆరాధించారన్నది చరిత్ర పుటలలో భద్రంగా ఉంది. గాంధీని తన కాలపు రాజకీయ వ్యక్తులందరిలో అత్యంత జ్ఞానోదయం కలిగిన వ్యక్తిగా భావించి ఆయన అహింసాయుత ప్రతిఘటనను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రశంసించారు. 1939లో రాసిన ఒక లేఖలో ఐన్‌స్టీన్ రాబోయే తరాలు ఇలాంటి వ్యక్తి ఈ భూమిపై ఎప్పుడూ నడయాడాడని నమ్మకపోవచ్చు అని రాశాడు. ఇద్దరూ లేఖలు మార్చుకున్నారు కానీ ఎప్పుడూ కలవలేదు. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి గాంధీ అహింసను ఉపయోగించడం ద్వారా ఐన్‌స్టీన్ ప్రేరణ పొందాడు, ముఖ్యంగా యూరప్‌లో పెరుగుతున్న హింస తీవ్రవాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ విభజనకు కారణం కాదా :
చరిత్ర లోతుల్లోకి వెళ్తే గాంధీ గురించి ఎన్నో విషయాలు వెలుగు చూస్తాయి. దేశ విభజనకు గాంధీ ఏ మాత్రం కారణం కాదని చరిత్రకారులు చెబుతారు. అంతే కాదు ఆయన భారత్ నుంచి ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ విడిపోవడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. అఖండ భారతం కోసం ముస్లిం లీగ్ నాయకుడు జిన్నాతో గాంధీ 1942 ప్రాంతంలో ఏకంగా 18 సార్లు చర్చలు జరిపారన్నది చరిత్రలో ఉన్న విషయం. హిందూ ముస్లిం భాయీ భాయీ అని గాంధీ నినదించారు. ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని ఆయన ప్రవచించారు. భారత్ బలంగా ఒక్కటిగా ఉండాలని అభిలషించారు.
అయిదు సార్లు హత్యాయత్నం :
గాంధీ మీద అయిదు సార్లు హత్యా యత్నం జరిగింది అన్నది చరిత్రలో ఉంది. 1934 జూన్ 25న పూణెలో తొలిసారి గాంధీ మీద హత్యా యత్నం జరిగింది. అలాగే 1944 జూలై లో పంచగనిలో రెండోసారి గాంధీ మీద హత్యా యత్నం జరిగింది. అదే ఏడాది సెప్టెంబర్ లో మూడవసారి సేవాగ్రాం లో గాంధీ మీద హత్యా యత్నం జరిగింది. నాలుగో సారి 1946 జూన్ 29న పూణేలో హత్యా యత్నం చోటు చేసుకుంది. అయిదో సారి 1948 జనవరి 20న ఢిల్లీలో గాంధీ మీద హత్య ప్రయత్నం జరిగింది ఇక చివరి సారి 1948 జనవరి 30న సాయంత్రం 5.17 సమయంలో గాంధీ మీద జరిగిన చివరి హత్య ప్రయత్నం సక్సెస్ అయింది. ప్రార్థన కోసం వెళ్తున్నసందర్భంలో చివరికి మహాత్మా గాంధీని చంపడంలో ఆయన వ్యతిరేక శక్తులు విజయం సాధించాయి.
దారుణమైన విషయం :
ఈ దేశం కోసం జాతి కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ వంటి మహనీయుల విషయంలో వర్తమాన తరంలో చాలా మంది తేలికగా మాట్లాడుతూ ఉంటారు. అంతే కాదు మహాత్ముడిని విమర్శించేందుకు సైతం తెగబడుతూంటారు. అది ఒక ఫ్యాషన్ గా కూడా మారింది అన్నది చాలా మంది భావన. తాజాగా టాలీవుడ్ కి చెందిన ఒక నటుడు అత్యంత జుగుప్సాకరంగా గాంధీ మీద విమర్శలు చేసారు. నిజానికి గాంధీ కుటుంబీకులు ఎవరూ రాజకీయాల్లో లేరు. అధికార పదవులు ఎవరూ పొందలేదు. గాంధీ కూడా ఏ పదవీ తీసుకోలేదు. కానీ ఆయనను విమర్శించే గొంతులు పెరిగిపోతున్నాయి అన్నదే గాంధేయవాదుల ఆవేదన. గాంధీని మెచ్చుకోకపోయినా ఫర్వాలేదు కానీ విమర్శించడం ఇకనైనా ఆపేయాలి. జాతి మూల పురుషులుగా ఉన్న వారిని తరాలకు స్పూర్తిదాతలుగా నిలిచిన వారిని విమర్శించడం అన్నది మానుకోకపోతే అది ఈ జాతికే ఒక అవమానంగా ఉంటుంది. ఇకనైనా దీనికి అడ్డుకట్ట పడాలి. ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకుని వీలైతే తగిన చర్యలకు ఉపక్రమించాలన్నది గాంధేయవాదుల భావన. సోషల్ మీడియాలో గాంధీ అభిమానుల ఆత్మ ఘోష ఇదే వినిపిస్తోంది.
