గల్లాకు పెద్ద సీటు గ్యారంటీనా ?
తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు ఎంపీగా గెలిచారు. బలమైన సామాజిక నేపధ్యం ఉంది.
By: Satya P | 5 Aug 2025 6:00 PM ISTతెలుగుదేశం పార్టీలో రెండు సార్లు ఎంపీగా గెలిచారు. బలమైన సామాజిక నేపధ్యం ఉంది. రాజకీయంగా కూడా అంగబలం అర్థబలంతో ఉన్న వారు, వైసీపీ ప్రభంజనంలో సైతం 2019 గెలిచిన వచ్చిన ముగ్గురు ఎంపీలలో ఆయన ఒకరు. ఆయనే గల్లా జయదేవ్. గుంటూరు పార్లమెంట్ సీటు నుంచి 2014, 2019లలో గెలిచిన గల్లా జయదేవ్ 2024లో కూడా సీటు గ్యారంటీ. గెలుపు సైతం గ్యారంటీ. కానీ ఆయన తీసుకున్న ఒక షాకింగ్ డెసిషన్ వల్ల ఈ రోజు రాజకీయ త్రాసులో కిందన ఉండాల్సి వస్తోంది అంటున్నారు.
సెంట్రల్ మినిస్టర్ జస్ట్ మిస్ :
ఇదిలా ఉంటే గల్లా జయదేవ్ కి కేంద్ర మంత్రి చాన్స్ జస్ట్ మిస్ అని అంటున్నారు. ఆయన కనుక 2024లో పోటీ చేసి ఉంటే పెమ్మసాని చంద్రశేఖర్ స్థానంలో ఆయనే కేంద్ర మంత్రిగా అయి ఉండేవారు అని అంటున్నారు. కానీ రాజకీయంగా లక్ ని ఆయన అలా జార్చుకున్నారు అన చర్చ అయితే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే గల్లా జయదేవ్ పొలిటికల్ గా రీ ఎంట్రీ కోసం చూస్తున్నారు అన వార్తా కధనాలు వినిపిస్తున్నాయి
మనసు మార్చుకున్నారా :
ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయను అని ఎన్నికల ముందు ఒక నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలకు దూరం అని ప్రకటించారు. దాంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. మంచి పొలిటికల్ కెరీర్ ని ఆయన వదిలేసుకుంటున్నారు అని కూడా అనుకున్నారు. మరో వైపు చూస్తే పరిశ్రమలు వ్యాపారాల గురించి ఆలోచించి ఆయన ఈ విధంగా డెసిషన్ కి వచ్చారు అని అంటున్నారు. దాంతో పాటు గత వైసీపీ ప్రభుత్వం తో వెక్స్ అయిపోయి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.
తప్పకుండా వస్తున్నారా :
అయితే తాజాగా మీడియా కంటబడ్డారు. ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు. తప్పకుండా రాజకీయాల్లో రీ ఎంట్రీ ఉంటుందని కూడా స్పష్టం చేశారు. పార్టీ పెద్దలతో చర్చిస్తున్నాను అన్నారు. అంటే టీడీపీ పెద్దలు ఆయన రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని ప్రచారం సాగుతోంది. బలమైన రాజకీయ నేపధ్యం కలిగిన గల్లా కుటుంబం కనుక ఆయన మరోసారి తన రాజకీయ ఆసక్తిని ప్రదర్శిస్తే టీడీపీ పెద్దలు సుముఖంగానే ఉంటారు అని అంటున్నారు.
పెద్దల సభకేనా :
ఇక రాజ్యసభ సీటు మీద గల్లా జయదేవ్ ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. 2026లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో నుంచి ఒక దానిని ఆయన ఆశిస్తున్నారు. రెండు సార్లు ఎంపీగా లోక్ సభకు పనిచేసిన అనుభవం తో పాటు వివాదరహితునిగా ఉండడం ఆయనకు కలసి వచ్చే విషయంగా చెబుతున్నారు. అదే విధంగా సూపర్ స్టార్ క్రిష్ణ కుటుంబానికి చెందిన వారు కాబట్టి కూడా ఆయనకు టీడీపీలో ప్రత్యేక స్థానం ఉంటుందని చెబుతున్నారు. దాంతో గల్లా జయదేవ్ మరోసారి పార్లమెంట్ లో పెద్దల సభలో కనిపించే చాన్స్ తప్పకుండా ఉంటుందని అంటున్నారు.
