Begin typing your search above and press return to search.

ఖర్గే గడ్కరీ ఇద్దరూ అలా...మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్

ఒక వైపు చూస్తే ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం అధికార ఎన్డీఎ కూటమి విపక్ష ఇండియా కూటమి ఢీ అంటే ఢీ కొడుతూ తమ అభ్యర్ధులను నిలబెట్టిన నేపథ్యం ఉంది

By:  Satya P   |   9 Sept 2025 8:19 PM IST
ఖర్గే గడ్కరీ ఇద్దరూ అలా...మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్
X

ఉప రాష్ట్రపతి ఎన్నికల వేల పార్లమెంట్ హౌస్ లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. ఒక వైపు చూస్తే ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం అధికార ఎన్డీఎ కూటమి విపక్ష ఇండియా కూటమి ఢీ అంటే ఢీ కొడుతూ తమ అభ్యర్ధులను నిలబెట్టిన నేపథ్యం ఉంది. ఇక కొసవరకూ ఏ మాత్రం తగ్గకుండా రెండు కూటములూ బలమైన ప్రచారం చేస్తూ వచ్చాయి. మరో వైపు చూస్తే పార్లమెంట్ లో ఉప్పు నిప్పులా బీజేపీ కాంగ్రెస్ తీరు ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో పార్లమెంట్ సమావేశాలు అయితే అసలు సజావుగా జరగడం లేదు. ఈ నేపధ్యంలో బీజేపీకి చెందిన ఒక అత్యంత కీలక నాయకుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఇద్దరూ కలసి చెట్టాపట్టాల్ వేస్తే అది రాజకీయంగా ఊహకు సైతం అందని విషయమే అవుతుంది కదా.

అరుదైన సీన్ ఆవిష్కరణ :

ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ అరుదైన సన్నివేశమే ఆవిష్కరణ జరిగింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గె ఇద్దరూ అలా కలసి వచ్చారు. ఇద్దరూ చేయి చేయీ పట్టుకుని కలసి నడుస్తూ వచ్చారు. అంతే కాదు ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ మంచి దోస్తులు మాదిరిగా నవ్వుతూ వచ్చారు. దానిని చూసిన వారు అంతా షాక్ తినే పరిస్థితి ఏర్పడింది. ఈ ఇద్దరూ కూడా చాలా సేపు మాట్లాడుకోవడం సైతం అందరినీ ఆకట్టుకుంది.

మోడీ మీద విమర్శలు :

సరే ఈ ఇద్దరు అగ్ర నేతలు అలా మంచి స్నేహంగా ఉన్నారు. బాగానే ఉన్నారు. కానీ పోయి పోయి ప్రధాని నరేంద్ర మోడీ మీద విమర్శలు చేయడమేంటి అన్నదే కదా మరో చర్చ. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అఖిలేష్ ప్రతాప్ సింగ్ అయితే ఈ ఇద్దరూ అలా మాట్లాడుకోవడం నవ్వుతూ ముందుకు సాగడం చూసి ఇది కదా ప్రజాస్వామ్యం అని మురిసిపోయారు. అంతే కాదు ఆయన నరేంద్ర మోడీ మీద తన విమర్శలను ఎక్కు పెట్టారు. నరేంద్ర మోడీ ఎప్పుడైనా ఇలా విపక్షాలతో కలసి నడిచారా నవ్వులు చిందిందారా సరదాగా సంభాషించారా అని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు మోడీ ఎపుడూ కోపంగా ఉంటారు అని కూడా నిందించారు.

బీజేపీ మౌనం :

ఈ పరిణామాల పట్ల బీజేపీ అయితే ఏ రకమైన వ్యాఖ్యానం చేయలేదు. మౌనంగానే ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీని టార్గెట్ చేయడం విశేషం. ఈ రోజే కాదు గతంలో కూడా గడ్కరీ మీద కాంగ్రెస్ నేతలు తమ అభిమానాన్ని అలా పార్లమెంట్ వేదికల మీదనే చాటుకున్నారు. ఆయన మంచి నాయకుడు ప్రజాస్వామ్య వాది అని కూడా వారు మెచ్చుకున్నారు. ఇక బీజేపీలో చూస్తే నితిన్ గడ్కరీని అంతా మరో వాజ్ పేయ్ అంటారు. ఆయన అందరితో బాగుంటారు ఉదారవాదిగా ఉంటూ రాజకీయాలు చేస్తారు అని పేరు. ఇపుడు అదే జరిగింది అని అంటున్నారు.