నెలల్లో ఈవీల ధరలు డౌన్.. గడ్కరీ చెప్పిన బిగ్ గుడ్ న్యూస్
భారత్ లో చమురు ఉత్పత్తి తక్కువ. అందుకే దిగుమతులపై అధికంగా ఆధారపడుతుంటాం. ఏడాదికి ఈ దిగుమతుల విలువ రూ.22 లక్షల కోట్లు.
By: Tupaki Political Desk | 7 Oct 2025 12:22 PM ISTఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)... ఇప్పుడు వీటిదే హవా..! ధరలు చూసి పెట్రోల్, డీజిల్ వాహనాల మీద ఆసక్తి లేకనో... పర్యావరణం మీద ప్రేమనో... వాహనాల్లోని వసతుల కారణంగానో.. చాలామంది ఈవీల వైపు మొగ్గుతున్నారు. బైక్ లు, కార్లు ఈవీవే ఎక్కువ కొనేందుకు ఆసక్తిచూపుతున్నారు. అయితే , ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయనేది ఈవీల మీద ఉన్న ప్రధాన ఆరోపణ...! మరి వీటి ధరలు తగ్గుతాయా? భవిష్యత్ లో పెట్రో వాహనాల స్థాయికి వస్తాయా? అనేది అందరిలోనూ మెదిలే ఆసక్తికర ప్రశ్న. దీనికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు.
మున్ముందు ఈవీలదే రాజ్యం...
బైక్ లు కానివ్వండి, కార్లు కానివ్వండి.. భవిష్యత్ లో ఈవీలదే రాజ్యం అని చెప్పాలి. ఇప్పటికే ప్రధాన నగరాల్లో చాలా వరకు ఈవీలు వచ్చేశాయి. రోడ్లపై వీటి సందడి మామూలుగా లేదు. కొన్ని హైబ్రిడ్ (ఈవీ+ పెట్రో) వాహనాలూ ఉన్నాయి. ప్రజల ఆసక్తి నేపథ్యంలో ఈవీల తయారీ అధికం చేస్తున్నాయి పరిశ్రమలు. ఈ క్రమంలో వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లోనే ఈవీల ధరలు తగ్గుతాయని అంటున్నారు కేంద్ర మంత్రి గడ్కరీ. ఈయన చెప్పినదాని ప్రకారం పెట్రో-ఈవీ వాహనాల ధరల మధ్య అంతరం భారీగా తగ్గనుంది.
రూ.22 లక్షల కోట్ల ఖర్చు...
భారత్ లో చమురు ఉత్పత్తి తక్కువ. అందుకే దిగుమతులపై అధికంగా ఆధారపడుతుంటాం. ఏడాదికి ఈ దిగుమతుల విలువ రూ.22 లక్షల కోట్లు. అయితే, పెట్రోల్, డీజిల్ వాడకం కారణంగా పర్యావరణానికి ముప్పు చాలా ఉంటోంది. ఈ నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ (శుద్ధ ఇంధనం) వాడకాన్ని పెంచుకోవాలని గడ్కరీ పేర్కొన్నారు. తాజాగా ఫిక్కీ హైయర్ ఎడ్యుకేషన్ సదస్సులో మాట్లాడుతూ.. ఐదేళ్లలో భారత వాహన పరిశ్రమను ప్రపంచంలో టాప్ కు చేర్చుతామన్నారు.
అప్పట్లో రూ.14 లక్షలు కోట్లు.. నేడు రూ.22 లక్షల కోట్లు
గడ్కరీ ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఎంతో డెవలప్ మెంట్ చేస్తున్నారు. మోదీ ప్రభుత్వంలో స్వేచ్ఛగా మాట్లాడే ఏకైక మంత్రిగానూ గడ్కరీ పేరుంది. అలాంటి మంత్రి.. తాను ఈ శాఖను చేపట్టేనాటికి భారత వాహన పరిశ్రమ పరిమాణం రూ.14 లక్షల కోట్లు ఉందని, ఇప్పుడు రూ.22 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. ప్రతి ఒక్కరికి కనీసం ఒక కారు ఉండే అమెరికా (రూ.78 లక్షల కోట్లు), అత్యధిక జనాభా ఉన్న చైనా (రూ.47 లక్షల కోట్లు) తర్వాతి స్థానం భారత్ దే. అయితే, ఐదేళ్లలో అమెరికాను దాటేస్తాం అంటున్నారు గడ్కరీ.
