Begin typing your search above and press return to search.

వాడిన వంటనూనె ఇప్పుడు 'బంగారం'!

'యురేనస్‌ ఆయిల్‌' వంటి స్టార్టప్‌లు తమ సేవలను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా 20 రాష్ట్రాలకు విస్తరించి, రోజుకు 20 టన్నులకు పైగా నూనెను సేకరిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   11 Nov 2025 5:00 AM IST
వాడిన వంటనూనె ఇప్పుడు బంగారం!
X

ఒకప్పుడు వంట చేసిన నూనెను పారబోయడం లేదా అదే నూనెను పదేపదే వాడటం వంటి అలవాట్లు ఉండేవి. కానీ, కాలం మారింది. వాడేసిన వంటనూనె.. ఇప్పుడు కొత్త విలువను, గుర్తింపును పొందింది. దీనిని వ్యర్థంగా చూడకుండా బయోడీజిల్‌ తయారీకి విలువైన ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. ఈ మార్పు కేవలం ఆదాయ వనరుగానే కాక ఆరోగ్యానికి ముప్పు కలిగించే పాత పద్ధతులను దూరం చేయడంలో పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది.

FSSAI చొరవ: RUCOL కార్యక్రమం

దేశవ్యాప్తంగా వాడిన వంటనూనె సేకరణను వేగవంతం చేసేందుకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) 'రీ పర్పస్‌ యూజ్డ్‌ కుకింగ్‌ ఆయిల్‌ (RUCOL) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి విస్తృత ఆదరణ లభిస్తోంది. స్టార్టప్‌లు, బయోడీజిల్‌ యూనిట్లు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నాయి.

పెరిగిన డిమాండ్‌: అదనపు ఆదాయం

ప్రస్తుతం వాడిన వంటనూనెకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. చెన్నై వంటి నగరాల్లో పలు స్టార్టప్‌లు ఈ నూనెను సేకరించి, లీటరుకు ₹25 నుంచి ₹50 వరకు చెల్లిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌ యూనిట్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి పెద్ద వినియోగదారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకుని నూనెను సేకరిస్తున్నారు. రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల (RWAs) సహకారంతో ఇళ్ల నుంచీ కూడా పెద్ద ఎత్తున నూనె సేకరణ జరుగుతోంది.

'యురేనస్‌ ఆయిల్‌' వంటి స్టార్టప్‌లు తమ సేవలను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా 20 రాష్ట్రాలకు విస్తరించి, రోజుకు 20 టన్నులకు పైగా నూనెను సేకరిస్తున్నాయి. కేబీ ఎనర్జీ కార్పొరేషన్‌ వంటి సంస్థలు నెలకు 20 టన్నుల వరకు, ఎన్వోగ్రీన్‌ వంటివి నెలకు వేల లీటర్ల నూనెను సేకరిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక చిన్న రెస్టారెంట్‌ యజమాని మాటల్లో "మేము రోజుకు 30 లీటర్ల నూనె వాడుతాం. ముందు దానిని పారబోసేవాళ్లం. ఇప్పుడు లీటరుకు ₹45కు అమ్ముతున్నాం. దీనివల్ల ప్రతి నెలా అదనపు ఆదాయం వస్తోంది"

ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలు

ఒకే వంటనూనెను పదేపదే వేడిచేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు ఏర్పడతాయి. వాడిన నూనెను విక్రయించడం ద్వారా, దానిని మళ్లీ వాడే ప్రమాదకరమైన అలవాటు తగ్గుతుంది. సేకరించిన నూనెను దేశవ్యాప్తంగా ఉన్న 64 బయోడీజిల్‌ తయారీ యూనిట్లకు అమ్ముతారు. అక్కడ రసాయన ప్రక్రియల ద్వారా దానిని పర్యావరణహితమైన బయోడీజిల్‌గా మారుస్తారు. వాడిన ఒక లీటరు వంటనూనె నుంచి తయారుచేసిన బయోడీజిల్‌తో ఒక బస్సు సుమారు 3 నుండి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిని కార్లు, లారీలు, విమానాలలోనూ వాడుకోవచ్చు. సాధారణ డీజిల్‌తో పోలిస్తే బయోడీజిల్‌ ధర లీటరుకు ₹7-8 వరకు తక్కువగా ఉంటుంది.

భారత్‌లో బయోడీజిల్‌ మార్కెట్‌ భవిష్యత్తు

ప్రపంచవ్యాప్తంగా వ్యర్థ వంటనూనె మార్కెట్‌ విలువ 2031 నాటికి $70.6 బిలియన్‌లకు చేరనుందని అంచనా. భారతదేశంలో ఏటా సుమారు 2,700 కోట్ల లీటర్ల వంటనూనె వినియోగిస్తారు. ప్రస్తుతం దేశంలో 140 కోట్ల లీటర్ల UCO సేకరించబడి, అందులో 110 కోట్ల లీటర్ల బయోడీజిల్‌ తయారవుతోంది. ఈ రంగం రాబోయే 10 ఏళ్లలో 7.5 శాతం వార్షిక వృద్ధిరేటుతో ముందుకు సాగనుంది.

మొత్తానికి వాడిన వంటనూనెను పారబోసే కాలం పోయింది. ఇప్పుడు దానిని అమ్మి ఆదాయం సంపాదించవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయోడీజిల్‌ రూపంలో ఇది పర్యావరణాన్ని కాపాడుతూ, భవిష్యత్తు ఇంధనంగా మారుతోంది.