Begin typing your search above and press return to search.

నిషేధాజ్ఞ చ‌ట్టం: ప్లాస్టిక్ పౌచ్‌లు-అల్యూమినియం ప్యాకింగులకు ఫుడ్ సేఫ్టీ చెక్

ఇబ్బ‌డిముబ్బ‌డ‌గా ప్లాస్టిక్ క‌వ‌ర్లు, ప్లాస్టిక్ వ‌స్తువులు, అల్యూమినియం ఫాయిల్స్ ఉప‌యోగించే ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని క‌ఠిన నిజాలు ఎన్నో ఉన్నాయి.

By:  Sivaji Kontham   |   13 Aug 2026 4:00 AM IST
నిషేధాజ్ఞ చ‌ట్టం: ప్లాస్టిక్ పౌచ్‌లు-అల్యూమినియం ప్యాకింగులకు ఫుడ్ సేఫ్టీ చెక్
X

మ‌నిషిని క‌నిపించ‌కుండా కాల్చుకు తినేవి కొన్ని ఉంటాయి. వాటిపై ప‌రిశోధ‌న‌లు పూర్త‌యి ఫుడ్ అండ్ సేఫ్టీ శాఖ మేల్కోనేప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంది. ఇబ్బ‌డిముబ్బ‌డ‌గా ప్లాస్టిక్ క‌వ‌ర్లు, ప్లాస్టిక్ వ‌స్తువులు, అల్యూమినియం ఫాయిల్స్ ఉప‌యోగించే ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని క‌ఠిన నిజాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజుల్లో ప్ర‌తి ఇంటికి ఒక క్యాన్స‌ర్ పేషెంట్ కామ‌న్ గా మార‌డం వెన‌క ప్లాస్టిక్ వినిమ‌యం నుంచి పుట్టుకొచ్చే విల‌యం కూడా ఒక ప్ర‌ధాన కార‌ణమ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ క‌ఠిన చ‌ట్టాల‌ను తెర‌పైకి తెచ్చింది. ఆహార ప‌దార్థాల‌ను సేఫ్ అనుకుని అల్యూమినియం ఫాయిల్స్ లో చుట్టేవారికి లేదా బిరియానీల‌ను వేడిగా ఉంచ‌డం కోసం ఫాయిల్స్ లో ప్యాకింగులు చేసేవారికి కూడా ఇది ఒక హెచ్చ‌రిక‌.

ప్లాస్టిక్, ప్లాస్టిక్ పౌచ్ లు, అల్యూమినియం ఫాయిల్స్ తో ప్యాకింగులు వేటినీ ఇక‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉపేక్షించ‌రు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

మానవ ఆరోగ్యాన్ని లోలోపలే దెబ్బతీసే అంశాలపై పరిశోధనలు పూర్తయి అధికారులు మేల్కొనేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. నేటి రోజుల్లో ప్రతి ఇంట్లోనూ క్యాన్సర్ బాధితులు కనిపిస్తుండటానికి ప్లాస్టిక్ కవర్లు, అల్యూమినియం ఫాయిల్స్ నిత్య జీవితంలో మితిమీరి ఉపయోగించడమే ప్రధాన కారణమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వేడి వేడి బిరియానీలను, ఆహార పదార్థాలను అల్యూమినియం ఫాయిల్స్‌లో చుట్టి ప్యాకింగ్ చేయడం సురక్షితమని భావించే వారికిది ఒక తీవ్రమైన హెచ్చరిక. ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆహార భద్రతా ప్రమాణాలను పెంచేందుకు కఠిన చట్టాలను రంగంలోకి దించింది.

ఈ దిశగా FSSAI పాన్ మసాలా ప్యాకేజింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ప్లాస్టిక్, ప్లాస్టిక్-లామినేటెడ్ పౌచ్‌లను పూర్తిగా నిషేధించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) అమెండ్‌మెంట్ రెగ్యులేషన్స్- 2026 పేరిట ఆగస్టు 7న ఈ సవరించిన నిబంధనలను అధికారికంగా నోటిఫై చేశారు. ఎఫ్‌.ఎస్.ఎస్.ఏ.ఐ సీఈఓ రాజిత్ పున్హానీ సంతకం చేసిన ఈ కొత్త‌ ఆదేశాలు గెజెట్‌లో ప్రచురించిన తేదీ నుండి తక్షణమే అమల్లోకి వస్తాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.

ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై పాన్ మసాలాను కేవలం పేపర్, పేపర్‌బోర్డ్, సెల్యులోజ్ లేదా ఇతర సహజ సిద్ధమైన మెటీరియల్స్‌లో మాత్రమే ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్యాకేజింగ్‌లో పాలిథిలిన్, పాలిప్రొపైలీన్, పాలియేస్టర్, ప్లాస్టిక్ లేదా పీవీసీ వంటి ఏ విధమైన సింథటిక్ పాలిమర్లు లేదా లామినేట్‌లు ఉండకూడదని స్పష్టం చేశారు. సహజ సిద్ధమైన మెటీరియల్స్‌తో ప్యాకింగ్ చేసినా అందులో అల్యూమినియం ఫాయిల్ లేదా మెటలైజ్డ్ పొరలను ఉపయోగించడంపై కూడా నిషేధం విధించారు. వీటి స్థానంలో సురక్షితమైన టిన్ లేదా గ్లాస్ కంటైనర్లలో ప్యాక్ చేయడానికి అనుమతిచ్చారు.

పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త నిబంధనలకు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్- 2016 లోని నిబంధనలను కూడా వర్తింపజేస్తున్నారు. కాగా ఈ చట్టాన్ని ఉన్నపలంగా రుద్దకుండా 28 ఏప్రిల్ 2026న ముసాయిదాను విడుదల చేసి 60 రోజుల పాటు ప్రజలు, పరిశ్రమల వాటాదారుల నుండి అభ్యంతరాలు - సూచనలను స్వీకరించిన తర్వాతే ఎఫ్‌.ఎస్.ఎస్.ఏ.ఐ ఈ తుది నిర్ణయాన్ని తీసుకుంది. ఆహార పదార్థాల ప్యాకింగ్ విషయంలో వ్యాపారులు, తయారీదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఆహార భద్రతను బలోపేతం చేసే క్రమంలో ఎఫ్‌.ఎస్.ఎస్.ఏ.ఐ కేవలం పాన్ మసాలా ప్యాకేజింగ్‌కే పరిమితం కాకుండా విస్తృత చర్యలు చేపడుతోంది. తప్పుడు బ్రాండింగ్.. దారి మళ్లించే ప్రకటనలు ఇస్తున్న దాదాపు 14 డి2సి ఫుడ్ బ్రాండ్లకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా పాడైపోయిన నాణ్యత లేని ఆహారాన్ని సరఫరా చేస్తున్న బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా హెచ్చరికలు పంపింది. వ్యాపార సంస్థలు, ప్యాకేజింగ్ తయారీదారులు తక్షణమే మారకపోతే ఎఫ్‌.ఎస్.ఎస్.ఏ.ఐ విధించే కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదు.