Begin typing your search above and press return to search.

ప్రమోషన్లపై ఎఫ్.ఎస్ఎస్ఏఐ సర్జికల్ స్ట్రైక్.. సెలబ్రిటీల రీల్స్‌కు పడినట్లేనా బ్రేకులు?

హెల్త్ డ్రింక్స్, ప్రొటీన్ సప్లిమెంట్లు, స్నాక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్రమోషన్ల పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు వచ్చాయి.

By:  A.N.Kumar   |   13 Aug 2026 11:22 PM IST
ప్రమోషన్లపై ఎఫ్.ఎస్ఎస్ఏఐ సర్జికల్ స్ట్రైక్.. సెలబ్రిటీల రీల్స్‌కు పడినట్లేనా బ్రేకులు?
X

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. పక్కన ఒక ఫుడ్ ప్రొడక్ట్ పెట్టుకుని.. ఐదు కేజీల మేకప్ వేసుకుని.. కెమెరా ముందుకొచ్చి "ఈ జ్యూస్ తాగితే మీ ఇమ్యూనిటీ రాకెట్ లా పరిగెడుతుంది".. "ఈ చిప్స్ తింటే బ్రెయిన్ సూపర్ కంప్యూటర్ అయిపోతుంది" అంటూ ఉచిత సలహాలు పారేసే మన ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలకు కేంద్ర ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్.ఎస్ఎస్ఏఐ) గట్టిగా బ్రేకులు వేసింది. ఇప్పటివరకు "వావ్.. సూపర్.. మైండ్ బ్లోయింగ్" అని నోటికొచ్చిన రీల్స్ చేసి కోట్లు వెనకేసిన వారికి ఎఫ్.ఎస్ఎస్ఏఐ ఇప్పుడు అసలైన ఫుడ్ పాయిజన్ రుచి చూపించబోతోంది.

హెల్త్ డ్రింక్స్, ప్రొటీన్ సప్లిమెంట్లు, స్నాక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్రమోషన్ల పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలు వచ్చాయి. ఆహార ఉత్పత్తుల నాణ్యత, పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై తప్పుడు అతిశయోక్తి లేదా ధ్రువీకరించని క్లెయిమ్‌లు ఇకపై చెల్లవు. ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేసే ముందు అందులో పేర్కొన్న క్లెయిమ్‌లు నిజమైనవా.. వాటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా అనే విషయాలను తప్పనిసరిగా పరిశీలించాల్సిందే.

100% ప్యూర్ కాదు స్వామీ.. 100% గ్యాస్!

"మా నూనె 100% నేచురల్.. మా తేనె 100% ఆర్గానిక్" అంటూ కంపెనీలు ఇచ్చే బిల్డప్‌లను, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏమాత్రం ఆలోచించకుండా ప్రచారం చేసేస్తుంటారు. అసలు ఎఫ్.ఎస్ఎస్ఏఐ నిబంధనల్లో ఈ '100%' అనే పదానికే చోటు లేదని రెగ్యులేటర్ తెగేసి చెప్పింది. పోనీలే అని వదిలేస్తే రేపు "మా ప్రొడక్ట్ తింటే 100% అమరత్వం వస్తుంది" అని చెప్పేలా ఉన్నారని గ్రహించిన ఎఫ్.ఎస్ఎస్ఏఐ.. సైంటిఫిక్ ప్రూఫ్స్ లేకపోతే క్లాస్ పీకడం ఖాయమని హెచ్చరించింది.

ప్రకటనలో చెప్పే ప్రతీ విషయం ఉత్పత్తి లేబుల్‌పై ఉన్న సమాచారంతో ఖచ్చితంగా సరిపోవాలి. డాబర్ వంటి పెద్ద పెద్ద బ్రాండ్లే తేనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి వంటి ఉత్పత్తులపై ఈ ‘100%’ రొడ్డకొట్టుడు క్లెయిమ్‌లు చేసి వివాదాల్లో చిక్కుకుని కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందంటే మన సోషల్ మీడియా స్టార్ల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రీల్స్ చేస్తే సరిపోదు.. ఫైన్ కట్టడానికి జేబులు ఖాళీ చేసుకోవాలి..

ఇప్పటివరకు కెమెరా ముందు తిని చూపించి కోట్లు సంపాదించిన వారికి ఇకపై పప్పులు ఉడకవు. ప్రమోట్ చేసే ముందు ఆ ప్రొడక్ట్ వెనుక ఉన్న డబ్బాపై ఏముందో చదవడం.. డ్యూ డిలిజెన్స్ చేయడం నేర్చుకోవాలి. తాము చేసే ఎండార్స్‌మెంట్ నిజమైన అనుభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలి తప్ప, పైసల కోసం మోసపూరిత క్లెయిమ్‌లకు మద్దతు ఇవ్వకూడదు.

వినియోగదారుల రక్షణ చట్టం కింద సీన్ రివర్స్ అయి తప్పుడు ప్రమోషన్ అని తేలితే భారీ ముక్కుపిండి వసూళ్లు తప్పవు. మొదటి తప్పుకే ఏకంగా రూ. 10 లక్షల జరిమానా పడుతుంది. పోనీలే అని బుద్ధి మారక రెండోసారి కూడా అదే పని చేస్తే రూ. 50 లక్షల జరిమానాతో పాటు, కొన్నాళ్ల పాటు అసలు ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లపై 'బ్యాన్' విధించే ప్రమాదం కూడా ఉంది.

"గొప్ప ప్రభావంతో.. గొప్ప బాధ్యత వస్తుంది" అని స్పైడర్ మ్యాన్ డైలాగ్ చెప్పిన ఎఫ్.ఎస్ఎస్ఏఐ.. ఇన్‌ఫ్లుయెన్సర్ల చేతిలో ఉన్న మైకులను, కెమెరాలను ఒకసారి చెక్ చేసుకోమంది. ఇకపై ఫుడ్ ప్రొడక్ట్ తిని "వావ్ " అని డ్రామాలు ఆడే ముందు దానికి శాస్త్రీయ ఆధారం ఉందో లేదో చూసుకోకపోతే.. ఆ "వావ్" కాస్త "అయ్యో" గా మారడం ఖాయం!