మూడేళ్లలో ఇంత మార్పా... చాట్ జీపీటీ ప్రభావం ఏ స్థాయిలో అంటే..!
మూడేళ్ల క్రితం 2022 నవంబర్ 30 వరకూ ఎవరికి ఏ సందేహం వచ్చినా, ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా.. ఆన్ లైన్ వేదికగా మూడు ఆప్షన్స్ ఉండేవి.
By: Raja Ch | 30 Nov 2025 5:00 PM ISTమూడేళ్ల క్రితం 2022 నవంబర్ 30 వరకూ ఎవరికి ఏ సందేహం వచ్చినా, ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా.. ఆన్ లైన్ వేదికగా మూడు ఆప్షన్స్ ఉండేవి. ఇందులో భాగంగా... ఒకటి గూగుల్ సెర్చ్ లో టైప్ చేయడం.. వీడియో చూసి తెలుసుకోవాలంటే యూట్యూబ్ కి వెళ్లడం.. అలెక్సాలో అడగడం. కానీ ఆ రోజు తర్వాత లెక్కలు మారిపోయాయి. ఆ మూడు ఆప్షన్స్ నూ పక్కకి నెట్టేసింది చాట్ జీపీటీ!
అవును... ఇప్పుడు ఆన్ లైన్ ప్రపంచంలో సెర్చింగ్ లో చాట్ జీపీటీ ఎంట్రన్స్ లా మారిపోయింది. 2022 నవంబర్ 30న ప్రవేశపెట్టబడింది శామ్ ఆల్ట్ మన్ కు చెందిన చాట్ జీపీటీ. ఇది ప్రవేశపెట్టబడిన కొన్ని నెలల్లోనే 100 మిలియన్లు (10 కోట్లు) మంది యూజర్స్ కి చెరువైన చాట్ జీపీటీ.. 2025 చివరి నాటికి 800 మిలియన్లు (80 కోట్లు) మంది వినియోగదారులకు చేరింది. ఈ నెంబర్స్ చాలు చాట్ జీపీటీ ప్రభావం గురించి చెప్పడానికి.
ఇలా రోజు రోజుకీ యూజర్స్ ని పెంచుకుంటే.. ఈ భూగ్రహం పై అత్యంత విస్తృతంగా ఉపయోగించే యాప్ గా మారిపోయింది! ఈ క్రమంలో దీన్ని అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో వినియోగిస్తుండగా.. అనంతరం భారతదేశమే రెండో అతిపెద్ద మార్కెట్ గా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బ్రెజిల్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఉన్నాయి. 2025 ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో అమెరికాలో 34% మంది పెద్దలు దీన్ని ఉపయోగించారు.
ఇదే క్రమంలో... సిమిలర్ వెబ్ డేటాను ఉపయోగించిన ఒక నివేదిక ప్రకారం... గూగుల్ నుంచి న్యూస్ సైట్ లకు ట్రాఫిక్ 2024 మధ్యలో 2.3 బిలియన్లకు పైగా విజిట్స్ ఉండగా.. 2025 మే నాటి ఆ సంఖ్య 1.7 బిలియన్లకు పడిపోయింది. అదే విధంగా.. జీరో క్లిక్ లతో ముగిసే న్యూస్ లకు సంబంధించిన సెర్చ్ వాటా ఒక సంవత్సర కాలంలో 56% నుంచి 69%కి పెరిగింది. దీనికి కారణం ఏఐ సృష్టించిన స్నాప్ చాట్ ను దాటి చాలా మంది స్క్రోల్ చేయకపోవడమే.
అదేవిధంగా... చాట్ జీపీటీ ప్రభావం సెర్చ్ ఇంజిన్ లకు మించి ప్రతిధ్వనించింది. ఇందులో భాగంగా.. అలెక్సా స్పీకర్లు, గూగుల్ హోమ్ వంటి వాయిస్ అసిస్టెంట్ల సంఖ్య కొద్దిగా తగ్గింది. 2025 వాయిస్ సెర్చ్ గణాంకాల సారాంశం ప్రకారం... 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో సుమారు 34% మంది స్మార్ట్ స్పీకర్ ను కలిగి ఉన్నారని అంచనా వేయబడింది. ఇది 2023లో 35%గా ఉంది.
అయితే దీనికి వురుద్ధంగా యూట్యూబ్ మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద సైట్ గానే ఉందని చెబుతున్నారు. దీనికి 2024 నాటికి సుమారు 2.74 బిలియన్ల వినియోగదారులు ఉండగా.. 2010 నుంచి ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోందని అంటున్నారు. ఈ క్రమంలో అమెరికాలో టీనేజర్లు సుమారు 90% మంది తాము యూట్యూబ్ ని వినియోగిస్తున్నామని చెబుతున్నారు.
వాస్తవానికి చాట్ జీపీటీ లాంచ్ అయిన కొత్తలో.. ఏఐ వల్ల లక్షలాది ఉద్యోగాలు పోతాయని నిపుణులు అంచనా వేశారు. అయితే కొన్ని రంగాల్లో నిజంగానే దీని ప్రభావం మొదలైంది. ఇందులో భాగంగా... వెబ్ డెవలపర్ లు, ట్రాన్స్ లేటర్లు, అమెరికన్ కాలేజీ విద్యార్థుల కోసం ఎస్సేలు రాసే కెన్యా ఫ్రీలాన్సర్లు దీని కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఇది చాట్ జీపీటీ టైమ్ అని మాత్రం చెప్పొచ్చు!
