జెన్ జీ ఉద్యోగులపై కంపెనీల షాకింగ్ నిర్ణయం.. అలెర్ట్ అవ్వాల్సిందేనా?
డిగ్రీ చేతికి రాగానే ఏదో కంపెనీల్లో చేరిన యువత పట్ల యాజమాన్యాలు అసంతృప్తిగా ఉన్నట్లు 'ఇంటెలిజెంట్' అనే సంస్థ జరిపిన సర్వేలో తేలింది.
By: Madhu Reddy | 10 March 2026 11:52 AM ISTకష్టపడి చదివి, క్యాంపస్ సెలక్షన్లలో ఉద్యోగం సంపాదిస్తే ఆ ఆనందమే వేరు. కానీ, అలా చేరిన కొద్ది నెలలకే కంపెనీలు 'టాటా' చెప్పేస్తున్నాయంటే నమ్ముతారా? అవును, తాజా సర్వే ప్రకారం దాదాపు 60% కంపెనీలు తాము నియమించుకున్న జెన్-జీ యువతను కొద్ది రోజుల్లోనే ఇంటికి పంపేస్తున్నాయి. అసలు ఈ తరం యువత దగ్గర కంపెనీలు ఏం ఆశిస్తున్నాయి? ఎందుకు ఈ తొలగింపులు జరుగుతున్నాయి? ఆ షాకింగ్ నిజాలేంటో ఇప్పడు తెలుసుకుందాం.
ఎందుకీ ఫైరింగ్స్? కంపెనీలు చెబుతున్న కారణాలు ఇవే:
డిగ్రీ చేతికి రాగానే ఏదో కంపెనీల్లో చేరిన యువత పట్ల యాజమాన్యాలు అసంతృప్తిగా ఉన్నట్లు 'ఇంటెలిజెంట్' అనే సంస్థ జరిపిన సర్వేలో తేలింది. పది మంది యజమానుల్లో ఆరుగురు తాము కొత్తగా తీసుకున్న గ్రాడ్యుయేట్లను ఇప్పటికే తీసేశామని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఆఫీసు వాతావరణానికి అలవాటు పడలేకపోవడం. ఇక పని పట్ల సరైన అవగాహన లేకపోవడం, టీమ్ మెంబర్స్‌తో కలిసి పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి కంపెనీలను ఆలోచనలో పడేశాయి. కేవలం సబ్జెక్టు నాలెడ్జ్ ఉంటే సరిపోదని, ప్రొఫెషనల్ బాడీ లాంగ్వేజ్ మరియు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.
నైపుణ్యం ఉంటే సరిపోదు.. 'వర్క్ కల్చర్' ముఖ్యం:
జెన్-జీ ఉద్యోగులు టెక్నాలజీలో చాలా ఫాస్ట్ గా ఉన్నప్పటికీ, ఆఫీసు విధానాలు పాటించడంలో వెనుకబడుతున్నారని సర్వేలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మీటింగ్స్ లో ఎలా ఉండాలి, ఇమెయిల్స్ ఎలా రాయాలి, పని పట్ల ఎంత నిబద్ధతతో ఉండాలి అనే విషయాల్లో నేటి తరం సరిగ్గా ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక కొందరు ఉద్యోగులు పనులను సీరియస్ గా తీసుకోకపోవడం, తరచుగా సెలవులు కోరడం కూడా కంపెనీలకు చిరాకు తెప్పిస్తోంది. అందుకే, ఒక ఉద్యోగికి కేవలం డిగ్రీ మార్కులు చూసి కాకుండా, వారి వ్యక్తిత్వం మరియు బాధ్యతను కూడా గమనించి యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
గెట్ రెడీ.. యువత మార్చుకోవాల్సిన విషయాలు:
ఎవరైనా కేవలం కంపెనీలను తిట్టుకుంటే సరిపోదు, మారుతున్న కాలానికి అనుగుణంగా యువత కూడా తమను తాము అప్‌డేట్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆఫీసులో కేవలం పని చేయడం మాత్రమే కాదు, తోటివారితో సత్సంబంధాలు కలిగి ఉండటం, సమయపాలన పాటించడం చాలా అవసరం. కంపెనీలు ఇప్పుడు 'సాఫ్ట్ స్కిల్స్' కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. త్వరగా నేర్చుకునే తత్వం ఉండాలని కోరుకుంటున్నాయి. ఇక ఈ సమస్యను అధిగమించాలంటే కాలేజీ రోజుల్లోనే ఇంటర్న్‌షిప్స్ చేయడం ద్వారా ఆఫీసు వాతావరణంపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే ఈ 'హైర్ అండ్ ఫైర్' కల్చర్ నుండి బయటపడటం సాధ్యమవుతుంది అంటున్నారు నిపుణులు.
