Begin typing your search above and press return to search.

శుక్రవారం సెంటిమెంటు.. అజహర్ కు మంత్రి పదవి!

అందుకే శుక్రవారం రోజున మధ్యాహ్నం నమాజు సమయంలో జుహ్ర్ నమాజు చేసే ప్రాంతంలో జుమా నమాజు జరుగుతుంది.

By:  Tupaki Political Desk   |   1 Nov 2025 11:38 AM IST
శుక్రవారం సెంటిమెంటు.. అజహర్ కు మంత్రి పదవి!
X

మనలో చాలా మందికి సెంటిమెంట్లు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో సెంటిమెంటును ఫాలో అవుతుంటారు. కొందరికి వారాల సెంటిమెంటు ఉంటుంది. వారం, వర్జ్యం చూసుకుని ముహూర్తాలు పెట్టుకుని తమ పనులు చేస్తుంటారు. ప్రధానంగా శుక్రవారం రోజు చాలామందికి సెంటిమెంటు. హిందువులకే కాదు, ముస్లింలకు శుక్రవారం సెంటిమెంటు ఎక్కువ. ఇక చిత్ర సీమ కూడా శుక్రవారం సెంటిమెంటును ఫాలో అవుతుంది. ఎక్కువ సినిమాలు శుక్రవారం నాడే విడుదల కావడం సర్వసాధారణం. ఈ సెంటిమెంటుతోనే తెలంగాణలో వెటరన్ క్రికెటర్ అజారుద్దీన్ తో శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

శుక్రవారం ఏ కార్యక్రమం తలపెట్టినా శుభప్రదమవుతుందని చాలా మంది నమ్మకం. ముఖ్యంగా ఆ రోజు డబ్బులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. అదేవిధంగా ఆ రోజు తమ ఇంటికి ఏ వస్తువు వచ్చినా సాక్ష్యాత్తూ లక్ష్మీదేవి వచ్చిందని భావిస్తారు. ఇదే విధంగా ముస్లింలకు శుక్రవారం సెంటిమెంటు ఉంటుంది. ముస్లింలకు శుక్రవారం ఒక ముఖ్యమైన రోజుగా చెబుతారు. ఇస్లాంలో శుక్రవారాన్ని "జుమా" అని పిలుస్తారు. జుమా అంటే సమావేశ దినమనే అర్థం. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. దీనికి కూడా ఓ కారణం ఉందని అంటున్నారు.

ఇస్లాంలో రోజుకు ఐదుసార్లు నమాజు చదవడం తప్పనిసరి. దీనిని ఐదు సమయాలుగా విభజించారు. ఉదయం చేసే నమాజును ఫర్జ్, మధ్యాహ్నం నమాజును జుహ్ర్, సాయంత్రానికి ముందు అస్ర్, సాయంత్రం మగ్రిబ్, అర్థరాత్రికి ముందు చదివేది ఇషా నమాజు అంటారు. కానీ ఈ ఐదు నమాజులకు శుక్రవారం రోజున ప్రత్యామ్నాయం ఉంటుంది. ఇస్లాంలో శుక్రవారం (జుమా) రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును ఒకరినొకరు కలుసుకునే రోజుగా చెప్పుకుంటారు. అలా తమ ఐకమత్యం చాటుకుంటారు.

అందుకే శుక్రవారం రోజున మధ్యాహ్నం నమాజు సమయంలో జుహ్ర్ నమాజు చేసే ప్రాంతంలో జుమా నమాజు జరుగుతుంది.

ఇక మంత్రిగా అజారుద్దీన్ తో ప్రమాణస్వీకారం చేయించడానికి ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే రోజు, అదీ నమాజు చేసే సమయంలో మైనార్టీ నేతతో ప్రమాణ స్వీకారం చేయించడం వెనుక ఆ వర్గాన్ని ఆకట్టుకునే వ్యూహం ఉందని సందేహిస్తున్నారు. నమాజు సమయంలో ఇచ్చే మాటకు మైనార్టీలు కట్టుబడి ఉంటారనే ఆలోచనతోనే జుమా రోజున అజార్ తో ప్రమాణ స్వీకారం చేయించారని అంటున్నారు. ఇందులో నిజం ఉందో లేదో కానీ, శుక్రవారం నాడే అజ్జూ భాయ్ మంత్రిగా ప్రమాణం చేయడంపై విస్తృత చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓట్లే గెలుపోటుములను డిసైడ్ చేస్తారని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల ఓట్లు సుమారు ఉండగా, ముస్లిం మైనార్టీలు దాదాపు ఒక లక్ష ఉంటారని అంచనా. దీంతో ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకోడానికే అజహర్ తో ఆఘమేఘాలపై మంత్రిగా ప్రమాణం చేశారని కాంగ్రెస్ ప్రత్యర్థులు విమర్శలు చేయడం కూడా విశేషం. ఇదే సమయంలో అజ్జూ భాయ్ తో ప్రమాణ స్వీకరం చేయించకుండా ఆపాలని బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశాయి. కానీ, అధికార పక్షం తన మాటే నెగ్గించుకుంది. అజహర్ ను మంత్రిని చేసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సెంటిమెంటుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ అనుకున్నట్లే అజహర్ మంత్రిగా ప్రమాణం చేశారు.. ఈ పరిస్థితుల్లో శుక్రవారం సెంటిమెంటు వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి మరి.